YS Jaganmohan Reddy : ఎన్నికల్లో జగన్ రెడ్డి సామాజిక వర్గం ఆదరించలేదా? అభిమానం ఉన్న జనాలతో ఓట్లు వేయించ లేదా? ఇంతటి ఓటమికి రెడ్డి సామాజిక వర్గమే కారణమా? అంటే అవుననే సమాధానం వస్తోంది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి లాంటివారు ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల అన్నాక గెలుపు ఓటములు సహజం. కానీ రెడ్డి సామాజిక వర్గం సుదీర్ఘకాలం కాంగ్రెస్ వెంట నడిచింది. రాజశేఖర్ రెడ్డి హయాంలో ప్రత్యేక గుర్తింపు పొందింది. వైసీపీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీకి వెన్నుదన్నుగా నిలిచింది. కానీ 2019లో అధికారంలోకి వచ్చిన వైసిపి సోషల్ ఇంజనీరింగ్ కు ప్రాధాన్యమిచ్చింది. బీసీ, ఎస్సీ, ఎస్టి, మైనారిటీలకు ఎనలేని ప్రాధాన్యత ఇస్తూ వచ్చింది. అదే సమయంలో వైసీపీ ఉన్నతికి కృషి చేసిన రెడ్డి సామాజిక వర్గాన్ని మాత్రం పెద్దగా పట్టించుకోలేదు. చివరకు వారు ప్రాబల్యం అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఎమ్మెల్యే, ఎంపీపీ, జడ్పిటిసి, చివరకు సర్పంచ్ పదవుల్లో సైతం వేరే సామాజిక వర్గాల వారికి కూర్చోబెట్టింది. అది అంతిమంగా రెడ్డి సామాజిక వర్గంలో ఆగ్రహానికి కారణమైంది. తమ వరకు ఓకే కానీ.. కేదార్ తో కానీ.. ప్రజలతో కానీ ఓటు వేయించేందుకు ఆ సామాజిక వర్గం నేతలు ఇష్ట పెట్టుకోలేదు. దాని ఫలితమే వైసీపీకి ఘోర పరాజయం.
* గట్టి పని చేసిన కమ్మ సామాజిక వర్గం
ఈ ఎన్నికల్లో 90 శాతం కమ్మ సామాజిక వర్గం టిడిపికి మద్దతు తెలిపింది. మద్దతు తెలపడమే కాదు స్వయంగా రంగంలోకి దిగింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కమ్మలు రంగంలోకి దిగి ఎలక్షన్ క్యాంపెయిన్ చేశారు. భారీగా నిధులు సమకూర్చారు. ఈసారి కానీ టిడిపి రాకుంటే కమ్మ సామాజిక వర్గం ఉనికి ప్రశ్నార్ధకం అవుతుందని భయపడ్డారు. అందుకే తామే అభ్యర్థుల మన్న రీతిలో రంగంలోకి దిగారు. సామాజిక వర్గ పరంగా విభేదాలు ఉన్న కాపు సామాజిక వర్గాన్ని కలుపుకొని వెళ్లారు. కానీ ఆ స్థాయిలో రెడ్డి సామాజిక వర్గం పని చేయలేదు. 2019లో అదే పని చేసిన రెడ్డి సామాజిక వర్గానికి ఐదేళ్లపాటు ఎటువంటి న్యాయం చేయలేదు జగన్.
* రాయలసీమలో రిక్తహస్తం
సాధారణంగా రెడ్డి సామాజిక వర్గంలో నేతలు అధికం. ముఖ్యంగా రాయలసీమలో దశాబ్దాల పాటు రాజకీయ పునాది వేసుకున్నాయి కొన్ని కుటుంబాలు. అయితే జగన్ అధికారంలోకి వచ్చాక సోషల్ ఇంజనీరింగ్ పేరిట పెద్ద ఎత్తున బీసీలకు పదవులు ఇచ్చారు. ఎస్సీ ఎస్టీలకు సైతం అధిక ప్రాధాన్యం ఇచ్చారు. అదే సమయంలో రిజర్వేషన్ల పేరిట రెడ్డిల ప్రాధాన్యత తగ్గించారు. దీంతో ఆ సామాజిక వర్గంలో నాయకత్వం తగ్గింది. నాయకత్వ పటిమను క్రమేపి తగ్గించేశారు. వైసీపీని గెలిపించేందుకు అహోరాత్రులు శ్రమించిన తమ విషయంలో.. జగన్ అలా ప్రవర్తించేసరికి రెడ్డి సామాజిక వర్గంలో ఒక రకమైన నిర్లిప్తత ప్రారంభమైంది. తమకు తాము వైసీపీ మద్దతు దారులుగా నిలిచినా.. క్యాడర్ తో పాటు ప్రజలను ఒప్పించేందుకు వారి మనసు అంగీకరించలేదు. అందుకే ఈ ఎన్నికల్లో రెడ్డి ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో సైతం వైసీపీకి వచ్చిన ఓట్లు అత్యల్పం.
* కేతిరెడ్డి హాట్ కామెంట్స్
తాజాగా వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఒక వ్యక్తి నాయకుడిగా 20 సంవత్సరాల శ్రమ ఉంటుందని అభిప్రాయపడ్డారు. అలాంటి నాయకుడికి సోషల్ ఇంజనీరింగ్ పేరుతో తప్పించి.. వేరే వారికి అప్పగిస్తే కచ్చితంగా బాధ కలుగుతుంది. అదే పెయిన్ రెడ్డి సామాజిక వర్గం నేతలు ఎదుర్కొన్నట్లు కేతిరెడ్డి చెప్పుకొచ్చారు. రాజకీయ ప్రాబల్యం కోల్పోయిన వారి పరిస్థితి దిగజారుతుందని.. ఆ పరిస్థితికి జగన్ ఆలోచనలే కారణం అన్నట్టు తప్పు పట్టారు కేతిరెడ్డి. మొత్తానికైతే జగన్ వైఫల్యాన్ని ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గం ఎత్తిచూపుతుండడం విశేషం. దీని నుంచి అయినా జగన్ గుణపాఠాలు నేర్చుకుంటారో? లేదో? చూడాలి.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read More