TDP
TDP: ఏపీలో ఆ మూడు పార్టీల మధ్య పొత్తుల వ్యవహారం, సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ప్రకటన వంటి వాటిపై ఇప్పటికీ స్పష్టత రాలేదు. ఇప్పటికే అధికార వైసిపి రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల అభ్యర్థులను ప్రకటించింది. టిడిపి, జనసేన, బిజెపిలు పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించలేదు. కీలకమైన స్థానాలు విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోవడమే దానికి కారణం.
తెలుగుదేశం పార్టీ 144 అసెంబ్లీ సీట్లు, 17 పార్లమెంట్ స్థానాలు దక్కించుకుంది. తొలి జాబితాలో 94 అసెంబ్లీ స్థానాలు, రెండో జాబితాలో 34 అసెంబ్లీ సీట్లకు అభ్యర్థులను ప్రకటించింది. ఇంకా 16 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. అటు 17 పార్లమెంట్ స్థానాలకు సైతం అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. పెండింగ్ అసెంబ్లీ స్థానాలతో పాటు పార్లమెంట్ స్థానాలకు మంగళవారం సాయంత్రం అభ్యర్థులను ప్రకటిస్తామని టిడిపి వర్గాలు చెప్పుకొచ్చాయి. కానీ అటువంటిదేమీ జరగలేదు. కొన్ని స్థానాల విషయంలో మూడు పార్టీలు మధ్య ఏకాభిప్రాయం లేకపోవడమే దానికి కారణం. ఇప్పటికే బీజేపీ సీట్ల పంచాయితీ ఢిల్లీకి చేరింది. అక్కడ అభ్యర్థుల ఎంపిక పూర్తి కానుంది.
మరోవైపు బిజెపి అదనంగా రెండు అసెంబ్లీ సీట్లను అడుగుతున్నట్లు సమాచారం. అయితే ఇప్పటికే అధిక సీట్లు కేటాయించామని.. తమ వల్ల కాదని టిడిపి తెగేసి చెబుతోంది. మరోవైపు అసెంబ్లీ సీట్లు రెండు తీసుకుని.. పార్లమెంట్ సీటు అదనంగా ఇవ్వాలని బిజెపి అడుగుతున్నట్లు టాక్ నడుస్తోంది. విజయవాడ పశ్చిమ వంటి నియోజకవర్గాల విషయంలో మూడు పార్టీల మధ్య ఒక రకమైన పోటీ వాతావరణం నెలకొంది. మరోవైపు ముందుగా బిజెపికి ప్రతిపాదించిన సీట్లలో సైతం ఆ పార్టీ మార్పు కోరుతోంది. బిజెపిలో సైతం టిక్కెట్ల కోసం పాత, కొత్త నేతల మధ్య పోటీ తీవ్రస్థాయిలో ఉంది. ఆశావహుల సంఖ్య అధికంగా ఉంది. టికెట్ నాకంటే నాకు అంటూ నేతలు పోటీ పడుతున్నారు. ముందుగా బిజెపి అభ్యర్థులు ఖరారయ్యాకే.. టిడిపి జాబితా విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి అయితే బిజెపి వల్ల టిడిపి జాబితా ఆలస్యం అవుతుండడం విశేషం. టిడిపి ఆశావహుల్లో అసహనానికి ఇదొక కారణం.