Ramoji Rao: రాజ గురువు రామోజీరావు తనకున్న మీడియా బలంతో ఇన్నాళ్లు ఎన్నో ప్రభుత్వాలను ఢీకొన్నారు. మరెన్నో ప్రభుత్వాలను అందలమెక్కించారు. తాను అనుకున్నది అనుకున్నట్టు చేయగలిగారు. కానీ జగన్ ప్రభుత్వం విషయానికి వచ్చేసరికి ఆయన పప్పులు ఉడకలేదు. జగన్ సిఐడితో వెంటాడారు. వేటాడి దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో ఆయన సాంకేతిక కారణాలతో కోర్టులలో కొంత ఉపశమనం పొందాల్సి వచ్చింది. అందుకే ఈ ఎన్నికల్లో జగన్ అధికారంలోకి రాకూడదని బలంగా కోరుకుంటున్నారు. అందుకు తగ్గట్టుగా తన మీడియా ద్వారా పావులు కదుపుతున్నారు.
గత కొన్ని రోజులుగా జగన్ సర్కార్ వైఫల్యాలను ఎండగడుతూ ఈనాడులో భారీ కథనాలు వస్తున్నాయి. ఇక్కడ టిడిపి ప్రయోజనాల కంటే.. రామోజీరావుకు తన ప్రయోజనాలే ముఖ్యం. పొరపాటున జగన్ మరోసారి అధికారంలోకి వస్తే జైలు జీవితం తప్పదు. తాను చేసిన ఆర్థిక నేరాలకు శిక్ష తప్పదు. అయితే అదేదో యావజ్జీవ కారాగార శిక్ష కాదు. ఉరిశిక్ష అంతకంటే కాదు. కానీ రామోజీరావు పరువు విషయంలో అంతకంటే శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి. మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో మార్గదర్శి కేసు బయటపడింది. కానీ ఈ కేసు విషయంలో రాజశేఖర్ రెడ్డి ఉదారంగా వ్యవహరించారనే చెప్పాలి. కానీ జగన్ విషయంలో అలా కాదు. తనను దెబ్బ కొట్టిన రామోజీని ఎలాగైనా తిరిగి దెబ్బ కొట్టాలని జగన్ కృత నిశ్చయంతో ఉన్నారు.
ఇంతటి ప్రమాదకర స్థితిలో సైతం రామోజీరావు ఎదురుదాడికి దిగుతున్నారు. పాత కేసులను తెరపైకి తెస్తూ జగన్ జైలుకు పంపించాలని చూస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం దయ ఉన్నంతవరకు జగన్ కు వచ్చే చేటు ఏమీ లేదు. ఒకవేళ చంద్రబాబు అధికారంలోకి వచ్చి.. ఆయన మాటను కేంద్ర ప్రభుత్వం మన్నిస్తే మాత్రం జగన్ కు మరోసారి జైలు జీవితం తప్పదు. అదే కానీ జగన్ అధికారంలోకి మరోసారి వస్తే మాత్రం రామోజీరావు ప్రమాదంలో పడినట్టే. ఆయన జైలు జీవితం అనుభవించకుండా దేవుడు కూడా తప్పించలేరు.ప్రస్తుతం రామోజీ డేంజర్ జోన్ లో ఉన్నారు.అందుకే చంద్రబాబు కోసం పరితపిస్తున్నారు. జగన్ కు బలంగా ఢీకొడుతున్నారు. సర్వశక్తులు వడ్డుతున్నారు.