Mudragada Padmanabham: ముద్రగడ పద్మనాభం విషయంలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. పవన్ కళ్యాణ్ విషయంలో ముద్రగడ ఎన్నెన్నో సవాళ్లు చేశారు. తనపై పోటీ చేసి గెలవాలని.. తాను ఇండిపెండెంట్ గానైనా పోటీ చేసి పవన్ పై గెలిచి తీరుతానని కూడా సవాల్ చేసిన సందర్భం ఉంది. మొన్నటికి మొన్న పవన్ గెలిస్తే తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని ముద్రగడ సవాల్ చేసిన విషయం తెలిసిందే.ఇప్పుడు పోలింగ్ ముగియడంతో సోషల్ మీడియాలో ముద్రగడ టార్గెట్ అవుతున్నారు. పేరు మార్చుకునేందుకు సిద్ధంగా ఉండాలని జన సైనికులు పోస్టులు పెడుతున్నారు. ప్రస్తుతం ఇవే వైరల్ గా మారాయి. పవన్ గెలుపు పక్కా అని తేలడంతో జనసైనికులు ముద్రగడ సవాళ్లను తెరపైకి తీసుకొచ్చారు. పద్మనాభ రెడ్డిగా పేరు మార్చుకోవాలని వినూత్న రీతిలో సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
వాస్తవానికి ఒకానొక దశలో ముద్రగడ జనసేనలోకి వస్తారని ప్రచారం జరిగింది. వైసీపీలోకి వెళ్లాల్సిన ఆయనకు ఆ పార్టీ సముచిత స్థానం ఇవ్వలేదు. దీంతో జనసేన నేతలు ఆయన ఇంటికి వెళ్లి చర్చలు జరిపారు. పవన్ కళ్యాణ్ వచ్చి మీతో చర్చిస్తారని.. ప్రత్యేకంగా ఆహ్వానిస్తారని చెప్పుకొచ్చారు. కానీ అలా జరగలేదు. పవన్ పట్టించుకోలేదు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో వైసీపీలోకి వెళ్లిన ఆయన.. పవన్ పై నిత్య విమర్శకుడిగా మారిపోయారు. వైసీపీలో చేరిన నాటి నుంచి పవన్ పై వ్యక్తిగత కామెంట్స్ సైతం చేశారు. ఈ క్రమంలో జనసేన నేతలకు ముద్రగడ టార్గెట్ అయ్యారు. అటు సొంత కుటుంబ సభ్యులు సైతం ముద్రగడ వైఖరిని వ్యతిరేకించారు. అయితే ఈ క్రమంలో పిఠాపురంలో పవన్ ను ఓడిస్తానని.. అలా జరగకపోతే తన పేరును పద్మనాభ రెడ్డి గా మార్చుకుంటానని ముద్రగడ తేల్చి చెప్పారు. అయితే ఇప్పుడు పోలింగ్ ముగియడం, పవన్ విజయం పై సంకేతాలు రావడంతో జనసైనికులు రెచ్చిపోతున్నారు.
నూతన నామకరణ మహోత్సవానికి ఆహ్వానం అంటూ.. ఒక ఆహ్వాన పత్రికను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ముద్రగడ పద్మనాభరెడ్డి నామకరణ మహోత్సవ ఆహ్వాన పత్రిక మీకోసం.. అందరికీ నమస్కారం. నూతన నామకరణ మహోత్సవం.. కాపు సోదరా సోదరీమణులందరికీ ప్రత్యేక ఆహ్వానం. 2024 జూన్ 4న సాయంత్రం 6 గంటల నుంచి తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి లో ఈ కార్యక్రమం జరుగుతోందని అందులో పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ గెలిస్తే పద్మనాభ రెడ్డి గా పేరు మార్చుకుంటానని సవాల్ చేసిన పెద్దాయన మాటపై నిలబడతారని నమ్మకం మాకుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని కోరుతున్నాం. అంటూ ఆహ్వాన పత్రికను రిలీజ్ చేశారు. పిఠాపురంలో పవన్ గెలుపు ఖాయమని ప్రచారం నేపథ్యంలో.. నిజంగానే ముద్రగడ అన్నంత పని చేస్తారా? లేదా? అన్నది చర్చనీయాంశంగా మారింది. అయితే చివరకు మీ ఉప్మా, కాఫీలు మీరే తెచ్చుకోవాలండి అంటూ ముద్రగడ మాట్లాడినట్లు.. సెటైరికల్ గా విజ్ఞప్తి చేయడం విశేషం.
ముద్రగడ పద్మనాభరెడ్డి గారి నామకరణ మహోత్సవ ఆహ్వాన పత్రిక pic.twitter.com/EtGwItG64Y
— Political Missile (@TeluguChegu) May 13, 2024