Thammineni Sitaram Family: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే ఆయన సీనియర్ నాయకుడు. సుదీర్ఘకాలం మంత్రి. ఆపై శాసనసభ స్పీకర్ గా కూడా పనిచేశారు. అటువంటి నాయకుడు అరెస్టు భయంతో అజ్ఞాతంలోకి వెళ్లడం ఆందోళన కలిగిస్తోంది. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఫ్యామిలీ చుట్టూ ఇప్పుడు ఉచ్చు బిగిస్తోంది. ల్యాండ్ స్కాం నమోదయింది. ఫోర్జరీ పత్రాలతో దాదాపు నాలుగు కోట్ల రూపాయల విలువైన భూమిని రిజిస్ట్రేషన్ చేయడం సంచలనంగా మారింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఈ వ్యవహారం నడిచినట్లు తెలుస్తోంది. అరెస్టుల భయంతో ఫ్యామిలీ అంతా అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు ప్రచారం జరుగుతోంది.
* అసలు యజమానురాలు ఉండగా..
శ్రీకాకుళం నగరంలో విలువైన భూములు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సర్వేనెంబర్ 35 /13 లో 900 గజాల భూమి ఉంది. దీనికి యజమానురాలుగా అంధవరపు రజిని ఉన్నారు. అయితే ఆమె చనిపోయినట్టు ఫేక్ డెత్ సర్టిఫికెట్ సృష్టించారు. అదే భూమికి యజమానిగా అడబాల రజిని చూపించి నకిలీ డాక్యుమెంట్ క్రియేట్ చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో తమ్మినేని సీతారాం కుమారుడు చిరంజీవి నాగ్ అలియాస్ నాని కీలక పాత్ర పోషించారు. తమ్మినేని సీతారాం తో పాటు ఆయన భార్య వాణి సహకారం అందించారు. నిబంధనలకు విరుద్ధంగా ఈ ల్యాండ్ రిజిస్ట్రేషన్ జరిగినట్లు పోలీస్ విచారణలో తేలింది. అసలైన యజమానురాలు అంధవరపు రజిని డొంకంతా కదిలింది. తమ్మినేని సీతారాం ఫ్యామిలీ హస్తం ఉందని నిర్ధారణ అయింది.
* ఎస్పీ పర్యవేక్షణలో..
శ్రీకాకుళం పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఈ కేసును. ఎస్పీ ప్రత్యేక పర్యవేక్షణలో దర్యాప్తు కొనసాగింది. ఈ కేసులో పెద్దిరాజు, రజని, లక్ష్మణరావు, ఉపేంద్ర కుమార్, ఉపేంద్ర రావు, గోపాలకృష్ణ, సాంబశివరావు అరెస్టయ్యారు. తమ్మినేని సీతారాం, ఆయన భార్య వాణి, కుమారుడు చిరంజీవి నాగ్ పరారీలో ఉన్నారు. కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు సబ్ రిజిస్టర్ బొడ్డేపల్లి అరుణ అరెస్టుకు ప్రభుత్వాలుమతికి లేఖ రాసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పోలీసులకు చిక్కకుండా తమ్మినేని సీతారాం ఫ్యామిలీ పరారీలో ఉంది.
