AP temple tickets: సాధారణంగా ఆలయాల సందర్శన, స్వామివారి దర్శనాలు అంటే రోజులు ముందుగానే ప్లాన్ చేసుకునే పరిస్థితి ఉంది. దీంతో చాలా రకాలుగా సమయాభావం ఏర్పడుతూ ఉంటుంది. దానికి చెక్ చెబుతూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కోరుకున్న ఆలయంలో టిక్కెట్లు ఇక సులభంగా పొందే వెసులుబాటు కలిగించింది. సాధారణంగా ఆలయాల్లో ఆన్లైన్, ఆఫ్ లైన్ విధానాల్లో మాత్రమే దేవుడి దర్శనం టికెట్లు లభించేవి. అయితే మనిషి ఉన్నచోట నుంచి నిమిషాల్లో టిక్కెట్లు తీసుకునే విధానం అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ ఆలయాల సందర్శన, దర్శనం, సేవ టికెట్ల కోసం ప్రభుత్వం ఈ కొత్త విధానం అందుబాటులోకి తెచ్చింది. రాష్ట్రంలో శ్రీశైలం సహా ప్రముఖ ఆలయాల దర్శన, సేవా టిక్కెట్లు ఇకనుంచి మరింతగా సులభంగా లభ్యం కానున్నాయి.
వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా..
ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్( WhatsApp governance) పేరిట ప్రత్యేక యాప్ ను అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. వందలతో ప్రారంభమైన సేవలు ప్రస్తుతం వేలకు చేరుకున్నాయి. ప్రభుత్వ వాట్సాప్ నంబర్ కు హాయ్ అని మెసేజ్ పెడితే.. మనకు అవసరమైన సేవల జాబితా వస్తుంది. అందులో వివరాలను పొందుపరిస్తే ఆ సేవలను నిర్ణీత రుసుముతో పొందవచ్చు. అందులో భాగంగానే రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో ఆర్జిత సేవలు, దర్శనాల టికెట్లను బుకింగ్ చేసుకునే అవకాశం కల్పించారు. ఆలయాలకు కానుకలు కూడా ఈ హుండీ ద్వారా పంపే అవకాశం కూడా కల్పిస్తోంది ప్రభుత్వం ఈ కొత్త విధానం ద్వారా..
ఇప్పటికే చాలా సేవలు..
రాష్ట్రంలో మన మిత్ర( Mana Mitra ) వాట్సాప్ గవర్నెన్స్ యాప్ అందుబాటులోకి వచ్చింది. అందులో సాధారణ పౌర సేవలతో పాటు ప్రత్యేక సేవలు కూడా పొందవచ్చు. విద్యార్థులకు సంబంధించిన ధ్రువపత్రాలు, పరీక్షల హాల్ టికెట్లు,, పరీక్ష రుసుం చెల్లింపులు.. ఇలా ప్రతి సేవలను పొందవచ్చు. స్మార్ట్ ఫోన్ ఉన్నవారు మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరోవైపు 9552300 009 అనే వాట్సాప్ నెంబర్ కు హాయ్ అని మెసేజ్ చేయాలి. అందులో సేవలు ఎంచుకోవాలి. ప్రముఖ దేవాలయాలకు సంబంధించిన దర్శనాలు, సేవల జాబితా అందులో అందుబాటులోకి వస్తుంది. శ్రీశైలం, కాణిపాకం, అన్నవరం, విజయవాడ, శ్రీకాళహస్తి.. ఇలా ఏపీలోని ప్రముఖ దేవాలయాల పేర్లు ఆ జాబితాలో కనిపిస్తాయి. మీరు వెళ్లాలనుకునే దేవాలయాన్ని సెలెక్ట్ చేసుకుని వివరాలు పొందుపరిస్తే.. దర్శనం తో పాటు సేవా టికెట్లు ఇట్టే దక్కించుకోవచ్చు.
