IMD Weather Alert: అధిక ఉష్ణోగ్రతలతపై భారత వాతావరణ శాఖ (IMD), రాష్ట్ర స్థాయి విపత్తు నిర్వహణ సంస్థలు తాజాగా హెచ్చరికలు జారీ చేశాయి. తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో మే 19 నుంచి ఎండ వేడి ఎక్కువ అయ్యే అవకాశం ఉందని తెలిపింది. అలాగే ఆంధ్రప్రదేశ్ లో వడగాల్పులు ఎక్కువగా ఉండడంతో మధ్యాహ్న సమయంలో అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని పేర్కొంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
తెలంగాణలోని ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, ఖమ్మం, నల్లగొండ , సూర్యాపేట, భద్రాద్రి- భూపాలపల్లి, ములుగు, మహబూబూబాద్ జిల్లాలో 45 నుంచి 47 సెల్సియస్ డిగ్రీ మధ్య ఉష్ణోగ్రతలు నమోదు కావొచ్చని తెలిపింది. అధికారిక ప్రకటనల ప్రకారం..తాగజా తెలంగాణలో మే 18న జగిత్యాల జిల్లాలో 44.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మే 20, 21వ తేదీల్లో కూడా మరికొన్ని ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి.
ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (APSDMA) ఎండీ ప్రఖర్ జైన్ ప్రకారం.. మంగళవారం (మే 19)న ఏపీలోని పలు జిల్లాలలో 44 నుంచి 46 సెల్సియస్ డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. ముఖ్యంగా విజయనగరం, పార్వతీపురం మన్యం, పోలవరం, ఏలూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం జిల్లాలలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి. రాష్ట్రవ్యాప్తంగా 47 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 88 మండలాల్లో వడగాల్పుల ప్రభావం ఉంటుందని APSDMA అంచనా వేసింది.
ఉష్ణోగ్రతలు ప్రమాదకరంగా మారడంతో ఉదయం 11:00 నుంచి సాయంత్రం 4:00 గంటల మధ్య అత్యవసరంకాకపోతే ఇంటి నుండి బయటకు రావొద్దని IMD, APSDMA అధికారులు స్పష్టం చేశారు. ఈ సమయంలో సౌర వికిరణం, వాతావరణ ఉష్ణోగ్రత కలిసి హీట్‌స్ట్రోక్, డీహైడ్రేషన్ వంటి తీవ్ర ఆరోగ్య సమస్యలకు కారణమవుతాయని పేర్కొంటున్నారు.
వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం ఆరోగ్య నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. బయటకు వెళ్లేవారు లేదా బయట నుంచి ఇంటికి వచ్చిన వారు తరచుగా నీళ్లు తాగాలి. తేలికపాటి దుస్తులను ధరించాలి. తలకు రుమాలు లేదా టోపీ వాడాలి. ముఖ్యమైన పనులు అయితే తప్ప బయటకు వెళ్లొద్దు. చిన్న పిల్లలు, వృద్ధులు ఇంట్లోనే జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.
