Telugu states : తెలుగు రాష్ట్రాల( Telugu States ) మధ్య సహృద్భావ వాతావరణం ఉంది. రాజకీయంగా రెండు విరుద్ధ ప్రభుత్వాలు ఉన్నాయి. కానీ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య మాత్రం మంచి సన్నిహిత సంబంధాలు కొనసాగుతున్నాయి. ఈ తరుణంలో తెలుగు రాష్ట్రాల సీఎంలు మరోసారి కలుసుకోనున్నారు. ప్రజా భవన్ వేదికగా ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఒకసారి భేటీ అయ్యారు. ఏపీ నుంచి చంద్రబాబుతో పాటు మంత్రులు కందుల దుర్గేష్, సత్య ప్రసాద్, బీసీ జనార్దన్ రెడ్డి హాజరయ్యారు. తెలంగాణ నుంచి రేవంత్ రెడ్డి తో పాటు మంత్రులు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. చాలా రకాల అంశాలపై చర్చలు జరిపారు. అప్పట్లోనే మరోసారి సమావేశం కావడానికి కూడా నిర్ణయించారు.
* వివాహ వేడుకల్లో..
అయితే తాజాగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలవబోతుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే అది అధికారిక వేదికపై కాదు. ఈరోజు టిడిపి సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు( devineni Uma Maheshwarao) కుమారుడు వివాహం జరగనుంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. ఆంధ్రప్రదేశ్ కు రానున్నారు. వధూవరులను ఆశీర్వదించనున్నారు. వారం రోజుల కిందట రేవంత్ రెడ్డిని కలిసిన దేవినేని ఉమా తన కుమారుడి వివాహ ఆహ్వాన పత్రికను అందించారు. వివాహానికి రావాలని ఆహ్వానించారు. మరోవైపు ఈ వివాహ వేడుకకు ఏపీ సీఎం చంద్రబాబు కూడా హాజరయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రత్యేకంగా సమావేశం అవుతారు అనే ప్రచారం నడుస్తోంది.
Also Read : తెలుగు రాష్ట్రాల్లో త్రివేణి సంగమాలు.. ఎక్కడెక్కడ ఉన్నాయి.. ఏయే నదులు తెలుసా..?
* కలయికకు ఎనలేని ప్రాధాన్యం
ప్రస్తుతం ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. ఎన్డీఏ పక్ష ముఖ్యమంత్రిగా చంద్రబాబు( Chandrababu) ఉన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రేవంత్( Revanth Reddy) ఉన్నారు. ఇటువంటి తరుణంలో రాజకీయాల పరంగా, అటు వ్యక్తిగతంగా కూడా వీరి కలయిక ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణలో ముందుగా సీఎం గా బాధ్యతలు స్వీకరించారు రేవంత్ రెడ్డి. పది నెలల కిందట సీఎం గా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటికే వీరిద్దరూ ఓసారి అధికారికంగా కలుసుకున్నారు కూడా.
* దేవినేని ఉమా తో స్నేహం..
రేవంత్ రెడ్డి సుదీర్ఘకాలం తెలుగుదేశం పార్టీలో( Telugu Desam Party) కొనసాగారు. ఉమ్మడి ఏపీలో టిడిపిలో తనదైన పాత్ర పోషించారు. ఆ సమయంలోనే దేవినేని ఉమా తో సన్నిహితంగా ఉండేవారు. రేవంత్ సీఎం అయిన తర్వాత కూడా అదే స్నేహం కొనసాగుతూ వస్తోంది. దీంతో మిత్రుడు దేవినేని ఉమ ఆహ్వానం మేరకు వివాహ వేడుకకు హాజరు కాబోతున్నారని తెలుస్తోంది.
* రేవంత్ షెడ్యూల్ ఇదే..
దేవినేని ఉమా కుమారుడి వివాహం విజయవాడలో జరుగుతోంది. ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం రేవంత్ హాజరుకానున్నారు. ఉదయం తొమ్మిది గంటల 15 నిమిషాలకు హైదరాబాదులోని బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరనున్నారు. ఉదయం 10:40 గంటలకు కానూరు ధనేకుల ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణానికి చేరుకుంటారు. ఉదయం 10:50 గంటల నుంచి 11:30 గంటల వరకు వివాహ వేడుకల్లో ఉండనున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు హైదరాబాద్ ప్రయాణం కానున్నారు. అయితే రేవంత్ హాజరయ్యే సమయానికి ఏపీ సీఎం చంద్రబాబు కూడా వచ్చే అవకాశం ఉంది. దీంతో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల కలయికపై అందరి దృష్టి పడింది.
Also Read : చంద్రబాబు, రేవంత్ లను కేంద్రం అందుకే పిలిచిందా? తెలుగు రాష్ట్రాలకు ఏమిస్తోందంటే?