Teacher Job : తాము అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్పీపైనే తొలి సంతకం చేస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu Nayudu)ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. ఎన్నికల్లో గెలిచాక, హామీ ప్రకారమే మెగా డీఎస్సీ ఫైల్‌పై సంతకం చేశారు. కానీ, తొమ్మిది నెలలైనా నోటిఫికేషన్ రాలేదు. తాజాగా నోటిఫికేషన్ విడుదలకు కసరత్తు జరుగుతోంది. ఈ క్రమంలో అభ్యర్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం(Andhra Pradesh Government) మెగా డీఎస్సీ 2025 కోసం కీలక నిర్ణయాలతో అభ్యర్థులకు సరికొత్త అవకాశాలను అందిస్తోంది. వయోపరిమితి పెంపు నుంచి నియామక ప్రక్రియలో మార్పుల వరకు, రాష్ట్ర నిరుద్యోగ యువతకు ఈ నోటిఫికేషన్ ఆశాకిరణంగా నిలుస్తోంది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం మెగా డీఎస్సీ(Mega DSC) అభ్యర్థులకు వయోపరిమితిని 42 నుంచి 44 ఏళ్లకు పెంచింది. ఈ నిర్ణయం ఈ డీఎస్సీకి మాత్రమే వర్తిస్తుందని, 2024 జులై 1ని కటాఫ్ తేదీగా నిర్ణయించినట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఈ చర్య ఎక్కువ మంది అభ్యర్థులకు అవకాశం కల్పిస్తుందని అధికారులు తెలిపారు.
Also Read : తెలంగాణలో ఉద్యోగాల జాతర.. 55,418 పోస్టుల భర్తీకి సీఎం ఆదేశం
నోటిఫికేషన్ విడుదలకు సన్నాహాలు
మెగా డీఎస్సీ 2025 నోటిఫికేషన్ విడుదలకు మార్గం సుగమమైంది. ఎస్సీ వర్గీకరణ పూర్తయిన నేపథ్యంలో, గవర్నర్ ఆర్డినెన్స్‌కు ఆమోదముద్ర వేశారు. రాబోయే రెండు రోజుల్లో నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఈసారి 16,347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నారు, ఇందులో 80% స్థానికులకే కేటాయించనున్నారు.
దరఖాస్తు ప్రక్రియలో కీలక మార్పులు
డీఎస్సీ 2025 దరఖాస్తు విధానంలో సరికొత్త మార్పులు అమలవుతున్నాయి. దరఖాస్తు ప్రక్రియను రెండు విభాగాలుగా (పార్ట్ ఏ, పార్ట్ బీ) విభజించారు. అభ్యర్థులు దరఖాస్తు సమయంలో ప్రభుత్వ, పురపాలక, ఆదర్శ పాఠశాలలు, సంక్షేమ శాఖల యాజమాన్యాలను ఎంచుకోవాలి. అలాగే, పార్ట్ బీలో సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ ముందస్తు సమాచార సేకరణ నియామక ప్రక్రియను వేగవంతం చేయడానికి ఉద్దేశించింది.
పోస్టుల విభజన వివరాలు
మెగా డీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్న పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి:
పాఠశాల విద్యా శాఖ: 13,661 పోస్టులు
ఎస్సీ సంక్షేమ శాఖ: 439 పోస్టులు
బీసీ సంక్షేమ శాఖ: 170 పోస్టులు
ఎస్టీ సంక్షేమ శాఖ: 2,024 పోస్టులు
విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ: 49 పోస్టులు
బాల నేరస్తుల విద్యా బోధన: 15 పోస్టులు
నియామకాలకు సమయపాలన
ప్రభుత్వం జూన్ నాటికి పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యే సమయానికి నియామక ప్రక్రియను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ దిశగా ముందస్తు సమాచార సేకరణ, స్థానికులకు ప్రాధాన్యత వంటి చర్యలు చేపట్టింది.
ఏపీ మెగా డీఎస్సీ 2025 నోటిఫికేషన్ రాష్ట్ర నిరుద్యోగ యువతకు కొత్త ఆశలను రేకెత్తిస్తోంది. వయోపరిమితి పెంపు, నియామక ప్రక్రియలో సంస్కరణలతో, ఈ డీఎస్సీ ఎక్కువ మందికి అవకాశాలను అందించనుంది.
Also Read : RRB అసిస్టెంట్ లోకో పైలట్ జాబ్స్.. నోటిఫికేషన్ అప్‌డేట్..