Ambati Rambabu arrest: ఏపీలో( Andhra Pradesh) రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. మాజీమంత్రి అంబటి రాంబాబు అరెస్ట్, రిమాండ్ తో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా టిడిపి శ్రేణులు అంబటి రాంబాబు పై పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేశారు. దీంతో 16 కేసులు నమోదయ్యాయి. మరోవైపు లోకేష్ పై మాజీ మంత్రి జోగి రమేష్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆయనపై సైతం పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. కేసులు నమోదు అవుతుండడంతో ఆయన అరెస్టు ఉంటుందని ప్రచారం నడుస్తోంది. అయితే ఆ ఇద్దరు మాజీ మంత్రుల ఇళ్లపై దాడులు జరగడం, ఇంట్లో ఉన్న సామాన్లు ధ్వంసం కావడం సంచలనంగా మారింది. అయితే ఈ విషయంలో టిడిపి శ్రేణులు ఒక ఆలోచన చేస్తేనే మంచిది. లేకుంటే వైసిపి గాటిలోనే టిడిపిని కట్టే అవకాశం ఉంది.
మారిన రాజకీయాలు..
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ హయాంలో ఒక రకమైన భిన్న వాతావరణం ఉండేది. అప్పటివరకు ఉన్న రాజకీయ పరిస్థితులను పూర్తిగా మార్చేసింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. అప్పట్లో నేరుగా టిడిపి ప్రధాన కార్యాలయం పై దాడి చేసే పరిస్థితికి దారితీసింది. ఏకంగా ఓ మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇంటిపై దండయాత్ర చేసే ఘటనలు కూడా జరిగాయి. టిడిపి నేత పట్టాభి ఇంటిపై దాడి చేసి.. ఇంట్లో ఉన్న పిల్లలను సైతం భయాందోళనకు గురి చేశారు. అప్పట్లో ఈ ఘటనలను సీఎం గా ఉన్న జగన్మోహన్ రెడ్డి సమర్ధించుకున్నారు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న తనపై ఆరోపణలు, విమర్శలు చేస్తే అభిమానులకు బిపి వచ్చి ఉంటుందని… అందుకే దాడి చేశారంటూ సమర్ధించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే వీటిని ప్రజలు ఎంత మాత్రం సహించలేదు. దాని ఫలితమే 2024 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓటమి.
ప్రజల మధ్యకు తీసుకెళ్లాలి..
విలువలతో కూడిన రాజకీయం చేస్తామని టిడిపి నేతలతో పాటు కూటమి నాయకులు ఈ రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చారు. ప్రజలు వారి మాటలను విశ్వసించారు. అయితే ఇటీవల జరుగుతున్న పరిణామాల విషయంలో ఈ హామీ కట్టు దాటుతున్న పరిస్థితి ఉంది. అంబటి రాంబాబు( ambati Rambabu) దారుణంగా మాట్లాడారు. చంద్రబాబు విషయంలో బూతు మాట దొర్లింది. అయితే అంతకుమించి జోగి రమేష్ పదేపదే లోకేష్ ను ఉద్దేశించి జుగుప్సాకరమైన పదాలను వాడారు. అయితే ఇది ఎంత మాత్రం సహించదగ్గ విషయం కాదు. అయితే వారి ఇళ్ల పై దాడులు, నిప్పు పెట్టడం వంటివి మాత్రం సహేతుకం కాదు. ఎంత మాత్రం ఆమోదించదగ్గ విషయం కూడా కాదు. ఎందుకంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై ఈ ముద్ర ఉంది. ప్రజలు కూడా దీనిని గుర్తించారు. అయితే ఎంతో కొంత విలువలు పాటిస్తుంది అనేది టిడిపి తో పాటు చంద్రబాబుపై ఈ రాష్ట్ర ప్రజలకు ఒక అభిప్రాయం ఉంది. అందుకే కేసులు వరకు ఓకే కానీ దాడులు అంటే మాత్రం సహేతుకం కాదు. బూతు మాటలతో, తమ హావభావాలతో రెచ్చిపోతున్న వైసీపీ నేతల విషయాన్ని ప్రజల మధ్యకు తీసుకెళ్లాలి. ప్రజలకు వారి స్వభావాన్ని చూపించే ప్రయత్నం చేయాలి. అప్పుడే వైసిపి మరింతగా ప్రజల్లో దిగజారుతుంది. ఈ విషయంలో మాత్రం టిడిపి నేతలతో పాటు చంద్రబాబు ఆలోచన చేయకపోతే కష్టం.