TDP VS YCP : ప్రతి ఒక్కరికి గుర్తుండి పోయేలా కొన్ని తేదీలు ఉంటాయి. సెంటిమెంట్ గా విజయాన్ని అందించే రోజులు ఉంటాయి. ఏపీలో అధికార టిడిపి తో పాటు విపక్ష వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మే 13 ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. అందుకే ఆ రెండు పార్టీల నేతలు ఇప్పుడు సోషల్ మీడియాలో( social media ) ట్వీట్లు పెడుతున్నారు. ఈరోజు గొప్పతనాన్ని తెలియజేపుతున్నారు. ఇదే స్ఫూర్తితో ముందుకు వెళ్తామని చెబుతున్నారు. ఇంతకీ మే 13 ప్రత్యేకత ఏమిటి అన్నది మీ ప్రశ్న కదా. ఆ రెండు పార్టీల విజయానికి మే 13 తో లింక్ ఉంది. దానిని గుర్తు చేస్తూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి ఆ రెండు పార్టీలు. ఇప్పుడు ఏపీ అంతటా ఇదే హాట్ టాపిక్ అవుతోంది.
Also Read : రేపు ఉండిలో భారీ నిరసన..ఆర్ఆర్ఆర్ షాకింగ్ నిర్ణయం.. ఆందోళనలో కూటమి
* ఏడాది కిందట టిడిపి ఘన విజయం
సరిగ్గా ఏడాది కిందట.. 2024, మే 13న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి కూటమి( TDP Alliance ) ఘనవిజయం సాధించింది. వై నాట్ 175 అన్న నినాదంతో బరిలో దిగిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని కూటమి మట్టికరిపించింది. కూటమి ధాటికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నిలవలేకపోయింది. కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితం అయింది. 175 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఏపీలో 164 సీట్లతో ఘన విజయం సాధించింది కూటమి. తెలుగుదేశం పార్టీ ఒంటరిగానే 134 సీట్లలో సత్తా చాటింది. జనసేన 21 అసెంబ్లీ సీట్లకు పోటీ చేసి.. శత శాతం విజయాన్ని సొంతం చేసుకుంది. భారతీయ జనతా పార్టీ సైతం ఓట్లతో పాటు సీట్లను పెంచుకుంది. 8 అసెంబ్లీ సీట్లను గెలుచుకొని.. కూటమిలో భాగస్వామ్య పార్టీగా అవతరించింది.
* హోంమంత్రి ట్వీట్..
సరిగ్గా ఏడాది కిందట విజయాన్ని గుర్తు చేస్తూ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత( home minister vangalapudi Anitha ) ఓ ట్వీట్ చేశారు.’ చంద్రబాబు గారి నేతృత్వంలో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించింది. 175 అసెంబ్లీ సీట్లకు గాను 93 స్ట్రైక్ రేటు తో 164 సీట్లను గెలుచుకుంది. టిడిపి సొంతంగా 135 సీట్లను కైవసం చేసుకుంది. ఇది చరిత్రలో నిలిచిన రోజు అంటూ ట్వీట్ చేశారు వంగలపూడి అనిత. మరోవైపు తెలుగుదేశంతో పాటు కూటమి నేతలు ఇదే విషయాన్ని గుర్తు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. వాటినే వైరల్ చేస్తున్నారు.
* వైసిపి తొలి విజయం
మరోవైపు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ( YSR Congress party) శ్రేణులు సైతం మే 13ను గుర్తుపెట్టుకున్నాయి. సరిగ్గా 11 సంవత్సరాల క్రితం కడప పార్లమెంట్ స్థానంతో పాటు పులివెందుల అసెంబ్లీ స్థానాన్ని వైసీపీ కైవసం చేసుకున్న విషయాన్ని గుర్తు చేసుకుంటున్నాయి. 2011 మే 13న ఢిల్లీ పీఠం దద్దరిల్లింది. కడప పార్లమెంట్ స్థానం నుంచి జగన్మోహన్రెడ్డి ఐదు లక్షల 45 వేలకు పైగా ఓట్లతో విజయం సాధించారు. వైయస్ విజయమ్మ పులివెందుల నుంచి 81 వేల కు పైగా ఓట్లతో గెలుపొందారు. తెలుగోడి సత్తా ఢిల్లీని తాకిన వేళ అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటున్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీకి దక్కిన ఘన విజయాన్ని గుర్తుచేస్తూ సోషల్ మీడియాలో ఆ పార్టీ నేతలు పోస్టులు పెడుతున్నారు. దీంతో టీడీపీ వర్సెస్ వైసీపీ అన్నట్టు సోషల్ మీడియాలో ఈ పోస్టులు దర్శనం ఇస్తుండడం విశేషం.