TDP MLAs: ప్రత్యర్థులే కాదు.. సొంత వారి చర్యలపై దృష్టి పెట్టి ఉండాలంటారు పెద్దలు. ఎందుకంటే తమ వెంటే ఉండి తప్పులు చేసిన వారు ఉంటారు. అటువంటి వారితో చెడ్డ పేరు రావడం ఖాయం. ఇప్పుడు ఈ విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ జాగ్రత్తలు పడుతున్నారు. వరుసగా వారు చేస్తున్న ప్రకటనలు ఇప్పుడు కూటమిలో వస్తున్న మార్పులను తెలియజేస్తోంది. రానున్న కాలంలో సంక్లిష్ట పరిస్థితులు ఎదురవుతాయని గ్రహించి ముందుగానే వారు ఇప్పుడు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. పనిచేయని ఎమ్మెల్యేలను క్లాస్ పీకుతున్నారు. సొంత చరిష్మాతో గెలిచాం అనుకుంటున్న ఎమ్మెల్యేలు బయటకు వెళ్ళిపోవచ్చు అని చంద్రబాబు సూచించారు. తొలిసారి ఎన్నికైన ఎమ్మెల్యేలు చాలామంది వ్యవహార శైలి బాగాలేదని.. అటువంటివారు పనితీరు మార్చుకోవాలని లోకేష్ హెచ్చరించారు. ప్రజలు ఎంతో నమ్మకంతో అవకాశం ఇస్తే.. వారి నమ్మకాన్ని వమ్ము చేసుకోకూడదని పవన్ కళ్యాణ్ గట్టిగానే ఎమ్మెల్యేలకు హెచ్చరికలు పంపారు. తద్వారా మున్ముందు గట్టి మార్పులే ఉంటాయని సంకేతాలు పంపారు.
* పరిస్థితి చేయి దాటుతుండడంతో..
చంద్రబాబుతో పాటు పవన్ రెక్కల కష్టంపై కూటమి అధికారంలోకి వచ్చింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకత తోడు వీరి కృషి ఉంది. ఆపై లోకేష్ పట్టుదల కూడా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో కూటమి ఎమ్మెల్యేల పనితీరుతో చెడ్డ పేరు వస్తుందని నేరుగా గ్రహించారు. ముఖ్యంగా టిడిపిలో పరిస్థితి చేయి దాటుతుందన్న అనుమానాలు ఉన్నాయి. 1995లో పార్టీ బాధ్యతలు తీసుకున్నారు చంద్రబాబు. చాలామంది తటస్థులను సైతం రాజకీయాల్లోకి తీసుకొచ్చి అవకాశాలు కల్పించారు. దాని ద్వారా ఆయనకు రాజకీయ ప్రయోజనం దక్కిందే కానీ.. ఇప్పటిలా ఇబ్బందులు ఎదురు కాలేదు. కూటమి ప్రభంజనంలో వైసీపీ బలమైన నియోజకవర్గాలను సైతం చాలామంది అలవోకగా గెలవగలిగారు. అయితే అటువంటి వారు తమ సొంత చరిష్మాతో గెలిచామని భావిస్తున్నారు. వారితోనే ఇప్పుడు ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నాయి. టిడిపి ఎమ్మెల్యేల పనితీరు ప్రభావం కూటమిపై పడుతోంది. చంద్రబాబులో అదే కలవరం.
* ఎన్నడూ లేని విధంగా సంక్లిష్టత..
మూడు దశాబ్దాలుగా పార్టీ బాధ్యతలు చూస్తున్నారు చంద్రబాబు. అధికారంలో ఉన్నారు. విపక్షంలో సైతం కొనసాగారు. కానీ ఈసారి విచిత్రంగా కొత్తవారు గెలిచారు. అటువంటి వారి నుంచి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎలా బయటపడాలో కూడా చంద్రబాబుకు తెలియడం లేదు. కొలికపూడి శ్రీనివాసరావు, బొజ్జల సుధీర్ రెడ్డి, రెడ్డప్ప గారి మాధవి, కావ్య కృష్ణారెడ్డి, జయ చంద్రారెడ్డి వంటి వారితో ఎప్పటికప్పుడు ఇబ్బందులు వస్తూ వచ్చాయి. ఇలానే వదిలేస్తే తెలుగుదేశం పార్టీతో పాటు కూటమికి ఇబ్బందులు ఎదురవుతాయి. అందుకే చంద్రబాబు ఎలా గాడిలో పెట్టాలన్న ఆలోచనతో ఉన్నారు. అయితే వివాదాస్పద ఎమ్మెల్యేల చుట్టూ ఇప్పుడు టిడిపి అనుకూల మీడియా వాచ్ ఉంటుంది. ఆపై నిఘా వర్గాలు కూడా ఉంటాయి. అటువంటి ఎమ్మెల్యేలను వదులుకోవాలంటే.. వారిపై ఒక రకమైన ముద్ర వేసి విడిచి పెడతారు. రాజకీయాల్లో రాణించలేని పరిస్థితి ఉంటుంది. అదే విషయాన్ని ఈ ఎమ్మెల్యేలకు చెబుతోంది అత్యున్నత కమిటీ. వివాదాస్పద ఎమ్మెల్యేల తీరు రోజురోజుకు జఠిలం అవుతున్న తరుణంలో.. ఓ కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. మారుతారా? మారరా? మారకపోతే ఇన్ని ఇబ్బందులు ఉంటాయి? ఇది ఇబ్బందులు పడాల్సి ఉంటుంది అంటూ ఆ కమిటీ స్పష్టం చేస్తుంది. వినకపోతే వారి విషయంలో సీరియస్ యాక్షన్ మొదలు అవుతుంది.