Transgender: ఈ ఎన్నికల్లో చిత్రవిచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. టిక్కెట్లు దక్కని నేతలు పక్క పార్టీల్లో చేరుతున్నారు. కొందరు ఇండిపెండెంట్ గా పోటీ చేసేందుకు సిద్ధపడుతున్నారు. తాజాగా ట్రాన్స్ జెండర్ ఓ పార్టీ తరఫున పోటీకి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి సూరాడ ఎల్లాజీ అనే ట్రాన్స్ జెండర్ ను పోటీలో పెట్టేందుకు సమాజ్ వాది పార్టీ నిర్ణయించింది. ఎల్లాజీ గత కొద్దిరోజులుగా సమాజ్ వాది పార్టీలో యాక్టివ్ గా పని చేస్తున్నారు. స్థానిక సమస్యలపై సమగ్ర అవగాహన ఉంది. దీంతో ఎన్నికల్లో దక్షిణ నియోజకవర్గ సమాజ్ వాది పార్టీ అభ్యర్థిగా ఎల్లాజీ పేరును ఆ పార్టీ నేతలు ప్రతిపాదించారు. సమాజ్ వాది పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు జాలాది విజయ ఈ విషయాన్ని వెల్లడించారు. ఇదో చారిత్రాత్మక నిర్ణయంగా అభివర్ణించారు.
ఎన్నికల్లో పోటీకి సంబంధించిట్రాన్స్ జెండర్స్కు అవకాశం కల్పిస్తూ గత టిడిపి ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులు జారీచేసింది. అప్పటివరకు ఏపీలో థర్డ్ జెండర్ పోటీకి అవకాశం లేకుండా పోయింది. కానీ అప్పటి టిడిపి ప్రభుత్వం ఎన్నికల్లో పోటీకి అనుమతించింది. వాస్తవానికి చాలా రాష్ట్రాల్లో ట్రాన్స్ జెండర్స్ కు ఎన్నికల్లో పోటీకి అవకాశం ఇచ్చారు. చాలామంది పోటీ చేసి విజయం సాధించారు కూడా. తమిళనాడు స్థానిక సంస్థల ఎన్నికల్లో చాలామంది ట్రాన్స్ జెండర్స్ ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యారు. అయితే సమాజంలో వివక్షకు గురవుతున్న ట్రాన్స్ జెండర్స్ కు టికెట్లు ఇచ్చేందుకు రాజకీయ పార్టీలు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. అందుకే వారు ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఎక్కడికి అక్కడే సత్తా చాటుతున్నారు.
గత ఎన్నికల్లో కూడా ట్రాన్స్ జెండర్ పోటీ చేశారు. లోకేష్ పోటీ చేసిన మంగళగిరి నియోజకవర్గంలో ఇండిపెండెంట్ గా బరిలో దిగారు. తమన్నా అనే ట్రాన్స్ జెండర్ అప్పట్లో నామినేషన్ దాఖలు చేశారు. అప్పట్లో ఆమె జనసేన టికెట్ కోసం ప్రయత్నాలు చేశారు. దరఖాస్తు కూడా చేసుకున్నారు. టికెట్ దక్కక పోయేసరికి ఇండిపెండెంట్ గా పోటీ చేశారు. ఇప్పుడు మరోసారి ట్రాన్స్ జెండర్ ఎన్నికల్లో పోటీకి ముందుకు రావడం విశేషం.