TDP Second List: టిడిపి సెకండ్ లిస్ట్ రెడీ

బిజెపి కోసం తాము వెంపర్లాడడం లేదని టిడిపి చెప్పే ప్రయత్నం చేస్తోంది. జనసేనకు బిజెపి మిత్రపక్షం. జనసేనతో పొత్తు పెట్టుకోవడం వల్ల ఆ పార్టీనిర్ణయాలను గౌరవించాల్సి ఉంటుంది. ఆ పార్టీ కోరిక మేరకే బిజెపిని కూటమిలో కలుపుకునేందుకు సిద్ధపడినట్లు టిడిపి చెపుతోంది.

Written By: Dharma, Updated On : March 7, 2024 10:47 am

TDP Second List

Follow us on

TDP Second List: తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టింది.జనసేనతో పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో ఆ రెండు పార్టీలు తొలి జాబితాను విడుదల చేసిన సంగతి తెలిసిందే. పొత్తులో భాగంగా జనసేనకు 24 అసెంబ్లీ స్థానాలు, మూడు పార్లమెంటు స్థానాలను కేటాయించారు. టిడిపి 94 మంది , జనసేన ఐదుగురు అభ్యర్థుల పేర్లను ఖరారు చేస్తూ తొలి జాబితాను ప్రకటించారు. ఇంకా జనసేన 19 మంది అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. అటు బిజెపి కోసం ఆ రెండు పార్టీలు వెయిట్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రెండో జాబితాను విడుదల చేసేందుకు చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. దీంతో పెద్ద ఎత్తున ఆశావహులు చంద్రబాబును కలుస్తుండడంతో ఆయన స్వగృహం రద్దీగా మారింది.

బిజెపి కోసం తాము వెంపర్లాడడం లేదని టిడిపి చెప్పే ప్రయత్నం చేస్తోంది. జనసేనకు బిజెపి మిత్రపక్షం. జనసేనతో పొత్తు పెట్టుకోవడం వల్ల ఆ పార్టీనిర్ణయాలను గౌరవించాల్సి ఉంటుంది. ఆ పార్టీ కోరిక మేరకే బిజెపిని కూటమిలో కలుపుకునేందుకు సిద్ధపడినట్లు టిడిపి చెపుతోంది. ఒకవేళ బిజెపి రాకుంటే జనసేనతో కలిసి అభ్యర్థులను ప్రకటిస్తామని టిడిపి చెప్పుకొస్తోంది. అయితే ఈ మాటలన్నీ బిజెపిని ఒత్తిడిలో పెట్టే భాగమేనని తెలుస్తోంది. మరోవైపు బిజెపి పిలుపుమేరకు చంద్రబాబు ఈరోజు ఢిల్లీ పయనమవుతారని ప్రచారం జరుగుతోంది.

బిజెపితో పని లేకుండా టిడిపి రెండో జాబితాను ప్రకటించే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో చాలామంది ఆశావహులు, మాజీ మంత్రులు నేరుగా చంద్రబాబును కలుస్తుండడం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా చాలామంది నాయకులు చంద్రబాబును కలిసి వెళుతున్నారు. మరోవైపు చంద్రబాబుతో పవన్ భేటీ అయ్యారు.అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టారు. అటు జనసేన అభ్యర్థులు సైతం ఖరారు అయినట్లు తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన.. ప్రతి జిల్లాలో జనసేనకు ప్రాతినిధ్యం కల్పిస్తూ టికెట్లు కేటాయించినట్లు సమాచారం. ఈ పరిణామాల క్రమంలోనే చంద్రబాబు రెండో జాబితాను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. తద్వారా బీజేపీపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. అయితే చంద్రబాబు ఢిల్లీ వెళ్లే ముందు రెండో జాబితా ప్రకటిస్తారా? ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత ప్రకటిస్తారా? అన్నది చూడాలి.