TDP Press Meets : ఎలుక దూరిందని ఇంటినే తగలబెట్టుకున్నట్టుంది తెలుగుదేశం పార్టీ దుస్థితి. మద్యం బ్రాండ్ల అమ్మకాలు విషయంలో ఏపీ సర్కారు వైఫల్యాన్ని ఎలుగెత్తి చాటాలన్న ప్రయత్నం వికటించింది. నాసిరకం బ్రాండ్లతో మందుబాబుల ఆరోగ్యంతో ఆటలాడుకుంటున్నారని.. అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నారంటూ గత కొన్నేళ్లుగా జగన్ సర్కారుపై టీడీపీ ఆరోపణలు చేస్తూ వస్తోంది. అయితే అవి పెద్దగా వర్కవుట్ అవ్వకపోయేసరికి టీడీపీ నేతలు వినూత్న ఆలోచన చేశారు. ఒక వైపు టీడీపీ హయాంలో లభించిన మద్యం సీసాలను ఉంచి.. మరోవైపు ప్రస్తుతం జగన్ సర్కారు విక్రయిస్తున్న నాసిరకం మద్యం బ్రాండ్లతో పరేడ్ నిర్వహించారు. విలేఖర్ల సమావేశం పెట్టి వివరించే ప్రయత్నం చేశారు. అయితే ప్రజల నుంచి మాత్రం పెద్దగా మద్దతు దొరకలేదు సరికదా.. ఇదేం తీరని తిట్ల దండకం అందుకున్న వారూ ఉన్నారు.
ఆ మధ్యన టీడీపీ సీనియర్ నాయకుడు బొండా ఉమా పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేఖర్ల సమావేశం నిర్వహించారు. హైకమాండ్ ఆదేశాలో.. లేకుంటే తనకు వచ్చిన ఆలోచనో తెలియదు కానీ.. ఏకంగా మందు బాటిళ్లు ముందుపెట్టి విలేఖర్ల సమావేశం నిర్వహించారు. ఏపీలోనే కాదు దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కడా చూడనటువంటి హానికరమైన బ్రాండ్స్ ను తన జె -ట్యాక్స్ కోసం జగన్ రెడ్డి ప్రభుత్వం విక్రయిస్తోందని, ‘హైదరాబాద్ లో పేమెంట్.. తాడేపల్లిలో ఇండెంట్ జరుగుతోందని విమర్శించారు. కేవలం, మద్యంపైనే జగన్ ప్రభుత్వం రూ.300 కోట్ల పైచిలుకు కమీషన్లు కొట్టేసిందని ఆరోపించారు. ప్రజల ఆరోగ్యాలతో ఆటలు ఆడుకుంటూ జగన్ ప్రభుత్వం అవినీతి చేస్తోందని విమర్శించారు. ఇదే తరుణంలో తెలుగుదేశం పార్టీ హయాంలో అందుబాటులోకి వచ్చిన ధరలను.. ప్రస్తుతం వైసిపి అందుబాటులో ఉన్న ధరలను వాటికి సంబంధించిన వివరాలను మీడియాకు చూపించారు. మరో సీనియర్ నాయకుడు ఆనం కూడా ఇదే రీతిని ప్రెస్ మీట్ పెట్టి తనదైన పంచులతో రక్తికట్టించారు.
అయితే టీడీపీ నేతల వినూత్న ఆలోచనను నెటిజన్లు తమదైన రీతిలో రిప్లయ్ ఇస్తున్నారు. మందు ముందుపెట్టి ఈ ప్రెస్ మీట్ లు ఏంటని ప్రశ్నిస్తున్నారు. అచ్చం మందు షాపుల్లో సేల్స్ మేన్లుగా ఉన్నారంటూ కొందరు ఎద్దేవా చేస్తున్నారు. కళ్లు తాగిన కోతిలా టీడీపీ నేతలు ప్రవర్తిస్తున్నారని మరికొందరు సెటైర్లు వేస్తున్నారు. అది టీడీపీ కార్యాలయమా? లేకుంటే మద్యం దుకాణమా? అని ప్రశ్నిస్తున్న వారూ ఉన్నారు. అయితే ఇదే అదునుగా వైసీపీ సోషల్ మీడియా సైతం రెచ్చిపోతోంది. టీడీపీ నేతల మద్యం సీసాల ప్రెస్ మీట్ల ఫొటొలతో..టీడీపీ అంటే తెలుగు డ్రామా పార్టీగా అభివర్ణిస్తున్నారు. మద్యం అమ్మకాల గురించి సీసాలను ప్రదర్శించారు… మరి అదే వ్యభిచారం గురించి చెప్పాలనుకుంటే ఏంచేస్తారని సెటైర్లు వేస్తున్నారు. ఇటువంటి అల్లరి, చిల్లరి చేష్టలు పార్టీకి నష్టం చేస్తాయని టీడీపీ శ్రేణులు సైతం తమ ఆవేదనను వెలిబుచ్చుతున్నాయి.
అది మీ ఇమాజినేషన్ కే వదిలేస్తున్నా https://t.co/VK9M0GWMpY pic.twitter.com/faiG2K8v5X
— Political Punch (@PoliticalPunch9) June 30, 2023