https://oktelugu.com/

Kadapa: కడప కార్పొరేషన్ లో ‘కుర్చీ’ ఆట.. ఎమ్మెల్యే వర్సెస్ మేయర్!

వైయస్సార్.. ఈ పేరు చెబితేనే గుర్తొచ్చేది కడప. దశాబ్దాలుగా ఆ కుటుంబ మార్కు నడుస్తోంది ఆ జిల్లాలో. కానీ ఈ ఎన్నికల్లో అదంతా కొట్టుకుపోయింది. కడప నగరంలో టిడిపి సవాల్ చేసే స్థితికి చేరుకుంది.

Written By:
  • Dharma
  • , Updated On : December 24, 2024 / 01:25 PM IST

    Kadapa

    Follow us on

    Kadapa: ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి ఏడు నెలలు అవుతోంది. ఎన్నికల్లో కూటమి ఏకపక్ష విజయం సాధించింది. చివరకు వైసీపీ బలంగా ఉండే రాయలసీమలో సైతం సత్తా చాటింది. కడపలో అయితే ఏకంగా ఏడు అసెంబ్లీ స్థానాలను గెలుచుకొని వైసీపీని మట్టికరిపించింది. కడప నగరంలో సైతంటిడిపి ఘనవిజయం సాధించింది.అయితే ఇదే పట్టు కొనసాగించేందుకు టిడిపి కూటమి ప్రయత్నిస్తోంది.అయితే ముఖ్యంగా కడప నుంచి ఎన్నికైన ఎమ్మెల్యే మాధవి రెడ్డి వైసీపీకి చుక్కలు చూపించడం విశేషం. ముఖ్యంగా మేయర్ సురేష్ బాబు చుట్టూ ఎమ్మెల్యే రాజకీయ వ్యూహం అల్లుతున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే వర్సెస్ మేయర్ అన్నట్టు పరిస్థితి మారింది. ఎలాగైనా కడప నగరపాలక సంస్థపై టిడిపి జెండా ఎగురువేయాలని ఎమ్మెల్యే మాధవి రెడ్డి భావిస్తున్నారు. ఇప్పటికే వైసీపీకి చెందిన ఎనిమిది మంది కార్పొరేటర్లు టిడిపి వైపు వచ్చారు. మరింత మంది వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ క్రమంలో నగరపాలక సమావేశంలో ఎమ్మెల్యే కుర్చీ లేకుండా చేశారు మేయర్ సురేష్ కుమార్. దీంతో మరోసారి రచ్చ జరిగింది. గత సమావేశంలోనూ ఇదే విధంగా జరగడంతో ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి అదే పరిస్థితి జరగడంతో తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

    * టిడిపి వైపు ఎనిమిది మంది వైసీపీ కార్పొరేటర్లు
    కొద్దిరోజుల కిందట కడప కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఆ సమావేశానికి ఎమ్మెల్యే మాధవి రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. అయితే ఆమె కోసం ప్రత్యేక కుర్చీ అంటూ ఏర్పాటు చేయలేదు. దీంతో ఆమె తీవ్ర ఆగ్రహంతో రగిలిపోయారు. ఎక్స్ అఫీషియో సభ్యురాలిగా ఉన్న ఎమ్మెల్యేను అగౌరవ పరుస్తారా అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే తెలుగుదేశం పార్టీకి కార్పొరేషన్ లో బలం లేదు. ఆ పార్టీ తరఫున ఒకే ఒక్క కార్పొరేటర్ ఉన్నారు. ఈ తరుణంలో మేయర్ సురేష్ బాబు రెచ్చిపోతుండడంతో.. ఆగ్రహంతో రగిలిపోయారు మాధవి రెడ్డి. అందుకే వైసిపిలో అసంతృప్తిగా ఉన్న కార్పొరేటర్ లను చేరదీశారు. 8 మంది కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. చంద్రబాబు సమక్షంలో టిడిపిలో చేరారు. మరికొందరు సైతం టిడిపిలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది.

    * తీవ్ర వాగ్వవాదం
    తాజాగా ఈరోజు కడప కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం జరిగింది. టిడిపిలో చేరిన కార్పొరేటర్లతో కలిసి ర్యాలీగా వచ్చారు ఎమ్మెల్యే మాధవి రెడ్డి. అయితే కార్పొరేషన్ గేటు వద్ద టీడీపీ శ్రేణులను అడ్డుకున్నారు పోలీసులు. దీంతో వారి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ తరుణంలో టిడిపి కార్పొరేటర్లతో లోపలికి ప్రవేశించిన ఎమ్మెల్యే మాధవి రెడ్డికి ఈరోజు కూడా కుర్చీ కేటాయించలేదు. దీంతో ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఎక్కడ తన కుర్చీ లాగేస్తారో అనే భయంతోనే మేయర్ సురేష్ కుమార్ ఇలా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే మాధవి విమర్శించారు. లుంగీ కట్టుకుని ఇంట్లో కూర్చోవడం బెటర్ అంటూ విరుచుకుపడ్డారు. అయితే తొలి సమావేశంలో కుర్చీ కేటాయించకపోవడంతో.. 8 మంది వైసీపీ ఎమ్మెల్యేలు టిడిపిలో చేరిపోయారు. ఇప్పుడు మరోసారి అదే అవమానం జరగడంతో మరింతమంది కార్పొరేటర్లు టిడిపిలో చేరుతారో అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. మరి కడప కార్పొరేషన్ లో ఏం జరుగుతుందో చూడాలి.