TDP Membership Registration: తెలుగుదేశం పార్టీ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది సభ్యత్వ నమోదులో దూసుకుపోతోంది. ఇప్పటివరకు దాదాపు 94 లక్షల మంది పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా సభ్యత్వ నమోదుకు విశేష ఆదరణ కనిపిస్తోంది. ఈ ఏడాది అక్టోబర్ 26న టిడిపి సభ్యత్వ నమోదు ప్రారంభం అయ్యింది. పార్టీ అధినేత చంద్రబాబు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గత 63 రోజుల్లో ప్రతిరోజు సగటున లక్షన్నర మంది సభ్యత్వం తీసుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. డిసెంబర్ 31 తో సభ్యత్వ నమోదు ప్రక్రియ ముగిసింది. కానీ సంక్రాంతి వరకు పొడిగించాలని అధినేత చంద్రబాబు తో పాటు లోకేష్ కు పార్టీ శ్రేణుల నుంచి వినతులు అందాయి. పార్టీ క్యాడర్ తో పాటు ప్రజల నుంచి వస్తున్న స్పందనతో మరో 15 రోజులపాటు సభ్యత్వ నమోదు గడువు పెంచాలని హై కమాండ్ నిర్ణయం తీసుకుంది. గతానికి భిన్నంగా ఈసారి పూర్తి డిజిటల్ విధానంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు.
* గత ఐదేళ్లుగా
2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఘోర పరాజయం ఎదురయింది. దీంతో పార్టీ పని అయిపోయిందని అంతా భావించారు. కానీ నారా లోకేష్ మాత్రం పార్టీ పటిష్టత కోసం చాలా రకాల చర్యలు చేపట్టారు. గత ఐదేళ్ల కాలంలో కార్యకర్తల సంక్షేమం కోసం రూ.138 కోట్లు ఖర్చు చేశారు. సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికీ ఐదు లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తున్నారు. సభ్యత్వ నమోదులో నెల్లూరు సిటీ నియోజకవర్గం మొదటి స్థానంలో నిలిచింది.
* సభ్యత్వ నమోదులో తొలి పది స్థానాలు సాధించిన నియోజకవర్గాలు
1, నెల్లూరు సిటీ- 1,46, 966
2. పాలకొల్లు- 1,44,992
3. ఆత్మకూరు- 1,34, 584
4. రాజంపేట- 1,29,783
5. కుప్పం- 1,28, 496
6. ఉండి- 1,14, 443
7. గురజాల- 1,08,839
8. వినుకొండ- 1,05,158
9. మంగళగిరి- 1,04, 122
10. కళ్యాణదుర్గం- 1,00,325 సభ్యత్వాలతో ముందు వరుసలో ఉన్నాయి.