TDP Media – Pawan Kalyan : ఏపీలో తెలుగుదేశం పార్టీది పవర్ ఫుల్ మీడియా. జగన్ కు సొంత మీడియా ఉన్నా పెద్దగా వర్కవుట్ అయ్యింది తక్కువే. అదే నిజమైతే 2014 ఎన్నికల్లోనే వైసీపీ విజయం సాధించేది. సాధారణంగా అధికారం ఎవరి చేతుల్లో ఉంటే కొంతవరకూ వారికే మీడియా అనుకూలంగా ఉంటుంది. కానీ తెలుగుదేశం పార్టీ విషయంలో అలా కాదు. ఆ పార్టీ పవర్ లో ఉన్నా.. లేకున్నా పనిచేసే మీడియా సొంతం. అందుకే వాటికి ముచ్చటగా ఎల్లో మీడియా అని పేరు పెట్టారు. దానిని తిప్పికొట్టడంలో భాగంగా వైసీపీకి అనుకూలంగా ఉండేవాటికి నీలి మీడియా అని పేరు పెట్టారు. రాజకీయ పార్టీల కంటే ప్రత్యర్థులను దుమ్మెత్తిపోయడంలో ఎల్లో, నీలి మీడియా దొందుకు దొందే అన్న పేరును మూటగట్టుకున్నాయి.
అయితే ఇప్పుడు పవన్ వారాహి విషయంలో రెండు మీడియాల వ్యవహార శైలి చర్చనీయాంశమవుతోంది. ప్రధానంగా ఎల్లో మీడియా తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏదో ఇచ్చి ఇవ్వనట్టు మీడియా కవరేజ్ చేస్తున్నారు. యాత్ర ప్రారంభానికి ముందు కర్టెన్ రైజర్ గా నిర్వహించిన కార్యక్రమాలకు విశేష ప్రచారం కల్పించారు. పవన్ మాటల్లో మార్పు రావడంతో క్రమేపీ కవరేజ్ తగ్గుముఖం పట్టింది. జనసేనను గెలిపించాలని…సీఎంగా తనకు ఒక చాన్స్ ఇవ్వాలని కోరడంతో ఎల్లో మీడియా వైఖరి మార్చుకుంది. అటువంటి కామెంట్స్ ను తొలగించి కేవలం జగన్ సర్కారుపై పవన్ ఆరోపణలు చేస్తుంటే.. వాటినే హైలెట్ చేస్తోంది.
ఒక్క వారాహి యాత్రలోనే కాదు. చాలా సందర్భాల్లో ఎల్లో మీడియా ఇదే విధంగా ప్రవర్తించింది. చాలాసార్లు పవన్ ను అవమానించింది కూడా. వారికి టీడీపీ, చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యం. అందుకు ఎందాకైనా తెగించేందుకు ఆ సెక్షన్ ఆఫ్ మీడియా సిద్ధంగా ఉంటుంది. అచేతనంగా ఉన్న టీడీపీకి పవన్ వరంలా మారారు. పొత్తులకు సంకేతాలిచ్చారు. ఆ సమయంలో పవన్ ఎల్లో మీడియాకు మహా వృక్షంలా కనిపించారు. కానీ తన పార్టీ ప్రయోజనాల కు అనుగుణంగా నడిచినప్పడు మాత్రం మొక్కలా కనిపిస్తున్నారు.
అలాగని కవరేజ్ ఇవ్వలేదని చెప్పలేం. కానీ ఆశించిన స్థాయిలో, పూర్తిస్థాయిలో మాత్రం ఇవ్వడం లేదు. జన తాకిడిని కూడా పూర్తిగా చూపించడం లేదు. పవన్ బలం పెరిగిందని చూపితే పొత్తుల్లో ఎక్కువ స్థానాలు ఇవ్వాల్సి ఉంటుంది. అదే జరిగితే టీడీపీకి స్థానాలు తగ్గుతాయి. నష్టం జరుగుతుంది. అందుకే వారాహి యాత్రకు కవరేజ్ ఇవ్వడం లేదు. అయితే తమకు సోషల్ మీడియా బలం ఉందని.. ప్రతి జన సైనికుడు తమ పార్టీ ప్రచార కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యతను తీసుకుంటున్నారు. ఎల్లో మీడియా వైఖరిని తప్పుపడుతున్నారు.