AP CM YS Jagan Vs TDP : రాజకీయాల్లో హత్యలుండవు… అంతా ఆత్మహత్యలే అంటారు. తప్పుడు నిర్ణయాలు తీసుకున్నప్పుడు, దాని పర్యవసానాలు ప్రతికూల ఫలితాలు చూపినప్పుడు ఈ తరహా నిర్వచనాలిస్తుంటారు. ఇప్పుడు చంద్రబాబు విషయంలో కూడా ఇది గుర్తుకొస్తుంది. జగన్ కు మించి సంక్షేమ పథకాలు ఇస్తే కానీ.. ప్రజలు నమ్మరని భావించిన చంద్రబాబు మేనిఫెస్టో ప్రకటించారు. భారీగా తాయిలాలు ప్రకటించారు. కానీ విజనరీ నేతగా ఉన్న ముద్రను కాదని సంక్షేమం వైపు అడుగులేసిన చంద్రబాబు ప్రకటనలు పెద్దగా జనాల్లోకి వెళ్లలేదు.
2014 ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ మధ్య గట్టిపోటీ నెలకొంది. నెక్ అండ్ నెక్ ఫైట్ నడిచింది. కానీ చివరకు టీడీపీయే గెలుపొందింది. అప్పట్లోనే జగన్ సంక్షేమ పథకాలు ప్రకటించి ఉంటే ఫలితం వైసీపీకి అనుకూలంగా ఉండేదన్న విశ్లేషణలున్నాయి. కానీ ఆ ఎన్నికల్లో చంద్రబాబు సంక్షేమ పథకాలు ప్రకటించి అధికారంలోకి వచ్చిన తరువాత అమలుచేయకపోవడం జగన్ కు ప్లస్ అయ్యింది. అవశేష ఏపీకి దారిచూపానని.. నిర్మాణాత్మకంగా ముందుకెళుతున్న దృష్ట్యా సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వకపోయినా పర్వాలేదని బాబు భావించారు. అది జగన్ కు ప్లస్ అయ్యింది. గత ఎన్నికలకు ముందు నవరత్నాల రూపంలో భారీగా సంక్షేమ పథకాలు ప్రకటించడంతో ప్రజలు జగన్ కు పట్టం కట్టారు.
అయితే ఇప్పుడు జగన్ బాటలో చంద్రబాబు వచ్చారు. మినీ మేనిఫెస్టోను ప్రకటించారు. కానీ అది ఆశించిన స్థాయిలో జనాల్లోకి వెళ్లలేదు. దీనికి కారణం జగన్ వ్యూహాత్మక మౌనం. సంక్షేమం విషయంలో చంద్రబాబు పేలవ ప్రదర్శన. విజనరీ వరకూ చంద్రబాబు ఓకే. కానీ సంక్షేమంలో మాత్రం పూర్. బాబు ప్రకటించిన సంక్షేమ పథకాల అమలు అసాధ్యం అని కానీ.. లేకుంటే తానే అమలుచేసి చూపిస్తానని కానీ జగన్ చెప్పడం లేదు. మొన్నటికి మొన్న కేబినెట్ లో టీడీపీ మేనిఫెస్టో అంశాలు చర్చకు వస్తాయని భావించారు. కానీ జగన్ సైలెంట్ గా ఉన్నారు.
ఒక వేళ జగన్ టీడీపీ మేనిఫెస్టోపై ఏదైనా ప్రకటన చేసి ఉంటే.. దాని చుట్టూ కథలు అల్లి చంద్రబాబు ప్రచారం చేసుకునేందుకు మొగ్గుచూపేవారు. కానీ ఆ పరిస్థితిని జగన్ కల్పించలేదు. అటు వైసీపీ నేతలు సైతం లైట్ తీసుకున్నారు. మేనిఫెస్టోపై అంతంతమాత్రంగానే స్పందించి వదిలేశారు. ఆశించిన స్థాయిలో మేనిఫెస్టోకు ప్రచారం దక్కకపోవడంతో టీడీపీలో సైతం ఓ రకమైన ఆందోళన వాతావరణం నెలకొంది.