Visakha : టీడీపీ ఉత్తరాంధ్రకు కంచుకోట. ఆ పార్టీ ఆవిర్భావం నుంచి మంచి విజయాలే సొంతం చేసుకుంది. 2019 ఎన్నికల్లో 23 స్థానాలకే పరిమితమైనా.. ఉత్తరాంధ్రలో మాత్రం అరడజను సీట్లు సాధించింది. జగన్ ప్రభంజనాన్నిసైతం తట్టుకోని ఆరుగురు టీడీపీ తరుపున ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. టీడీపీ ఆవిర్భావం తరువాత గత ఎన్నికల్లో ఎదురైన ఓటమి ఎప్పుడూ ఎదురుకాలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దాంతో సమానంగా సీట్లు సాధించేది టీడీపీ. మంచి ట్రాక్ రికార్డే ఉంది. కానీ విశాఖ పార్లమెంట్ స్థానం విషయంలో మాత్రం టీడీపీకి అసంతృప్తే. టీడీపీ ఆవిర్భావం తరువాత జరిగిన పది ఎన్నికల్లో.. కేవలం మూడు సార్లు మాత్రం పసుపు జెండా ఎగిరింది. విశాఖ లోక్ సభ స్థానాన్ని టీడీపీ గెలిచి పాతికేళ్లవుతోంది.
1983లో టీడీపీ ఆవిర్భవించింది. 1994 ఎన్నికల్లో ఉమ్మడి ఏపీలో కంటెస్ట్ చేసింది. కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చిన రాజకీయ కురు వృద్ధుడు భాట్టం శ్రీరామమూర్తిని ఎంపీ అభ్యర్థిగా బరిలో దించడంతో ఆయన ఘన విజయం సాధించారు. అటు తరువాత ఎంవీవీఎస్ మూర్తి రూపంలో మరో రెండు సార్లు ఎంపీ సీటు దక్కింది. టోటల్ గా చూస్తే ఇప్పటికి పది సార్లు పార్లమెంట్ కి ఎన్నికలు జరిగితే తెలుగుదేశం మూడంటే మూడేసార్లు గెలవడం విశేషం. టీడీపీ పుట్టాక విశాఖ ఎంపీ సీటులో కాంగ్రెస్ అయిదు సార్లు గెలిస్తే బీజేపీ ఒకసారి. వైసీపీ ఒకసారి గెలిచాయి.
సాగర నగరంలో ఉత్తరాధి రాష్ట్రాల ప్రభావం ఎక్కువ. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఎక్కువగా ఉండడమే అందుకు కారణం. అర్బన్ ఓటర్లు అధికంగా ఉంటారు. వారు జాతీయ పార్టీలకు మొగ్గుచూపుతారు. విశాఖ ఎంపీ సీటు అనేసరికి కాంగ్రెస్ పార్టీ ట్రాక్ రికార్డు ఉంది. అత్యధిక సారు ఆ పార్టీయే ఎంపీ సీటుని గెలుచుకుంది. 1999లో చివరిసారిగా టీడీపీ ఇక్కడ నుంచి గెలిచింది. ఎంవీవీఎస్ మూర్తి రెండవసారి అప్పట్లో విజయం సాధించారు. అయితే వలస నాయకులను గెలిపించడం, అది కాంగ్రెస్ పార్టీయే కావడం గమనార్హం. టి.సుబ్బరామిరెడ్డి రెండు సార్లు గెలిస్తే, మాజీ సీఎం నేదురుమల్లి జనార్ధనరెడ్డి ఒకసారి, దగ్గుబాటి పురంధేశ్వరి ఒకసారి గెలిచారు 2014లో టీడీపీ మద్దతుతో బీజేపీ గెలిచింది. హరిబాబు ఎంపీగా గెలిచారు. 2019లో టీడీపీని ఓడించి నాలుగు వేల ఓట్ల తేడాతో వైసీపీ గెలిచింది.
25 సంవత్సరాలు విశాఖ లోక్ సభ స్థానాన్ని గెలవని టీడీపీ.. వచ్చే ఎన్నికల్లో కైవసం చేసుకుంటుందా? అంటే దానికి సమాధానం లేదు. వచ్చే ఎన్నికల్లో పొత్తులు ఖాయమన్న సంకేతాలు వెలువడుతున్నాయి. టీడీపీ, జనసేన, కలిసి వస్తే బీజేపీని కలుపుకెళతామని చంద్రబాబు, పవన్ భావిస్తున్నారు. అదే జరిగితే పొత్తుల్లో భాగంగా బీజేపీ కోరే తొలి ఎంపీ స్థానం విశాఖ అవుతుంది. 2014 రికార్డును చూపి ఈ సీటును కోరే అవకాశముంది. అటు జనసేన సైతం గత ఎన్నికల్లో గణనీయమైన ఓట్లు సాధించింది. సో మరోసారి పొత్తుల్లో భాగంగా విశాఖ లోక్ సభ స్థానం దూరమైతే మూడు దశాబ్దాల పాటు టీడీపీ వదులుకున్నట్టవుతుంది.