AP BJP: ఏపీలో ( Andhra Pradesh)విచిత్ర రాజకీయాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా కూటమి పార్టీల్లో ఇప్పుడిప్పుడే సమన్వయ లోపం కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీతో వైసిపికి చిరకాల శత్రుత్వం ఉంది. ఆ రెండు పార్టీలు విపరీతంగా ఒకరిపై ఒకరు ద్వేషించుకుంటాయి. అయితే ఇప్పుడు వైసీపీ ఓడిపోయింది. టిడిపి అధికారంలోకి వచ్చింది. గత ఐదేళ్లలో ఇబ్బంది పడిన టిడిపి నుంచి అదే స్థాయిలో తమకు ఇబ్బందులు వస్తాయని వైసీపీకి తెలుసు. అందుకే ఆ పార్టీ నేతలు ఇప్పుడు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. బిజెపితో పాటు జనసేనలో చేరేందుకు సిద్ధపడుతున్నారు. స్థానికంగా ఉన్న పరిస్థితులకు అనుగుణంగా బిజెపి, జనసేన ఎమ్మెల్యేలు ఉన్నచోట వైసిపి ద్వితీయ శ్రేణి నాయకత్వం ఇట్టే చేరిపోతుంది. అయితే గత ఐదేళ్లలో వారితోనే ఇబ్బంది పడ్డామని.. ఇప్పుడు వారినే కలుపుకుంటే తమ పరిస్థితి ఏంటని టిడిపి ప్రశ్నిస్తోంది. ఇది అంతిమంగా కూటమిలో సమన్వయ లోపానికి కారణమవుతోంది.
* ఐదేళ్ల వైసిపి పాలనలో అనంతపురంలో( Ananthapuram district ) ధర్మవరం నియోజకవర్గం కీలకమైనది. గత ఐదేళ్లపాటు అక్కడ కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరిట వినూత్న కార్యక్రమం చేపట్టారు. అదే స్థాయిలో టిడిపిని కూడా వెంటాడారన్న విమర్శ ఆయనపై ఉంది. ఆయనను తట్టుకోలేక వరదాపురం సూరి టిడిపి నుంచి బిజెపిలోకి వెళ్లిపోయారు. దీంతో చంద్రబాబు ఆదేశాల మేరకు పరిటాల శ్రీరామ్ ఆ బాధ్యతలు తీసుకున్నారు. గత ఐదు సంవత్సరాలు పాటు పార్టీ శ్రేణులకు అండగా నిలిచారు. పెద్ద ఎత్తున పార్టీ కార్యక్రమాలను నిర్వహించారు. అయితే ఎన్నికలకు ముందు వరదాపురం సూరి టిడిపిలో చేరాలని భావించారు. శ్రీరామ్ అడ్డుకోవడంతో ఆయన చేరలేకపోయారు. అయితే చివరి నిమిషంలో బిజెపి అభ్యర్థిగా సత్య కుమార్ యాదవ్ వచ్చారు. ఆయన గెలుపునకు కృషి చేశారు పరిటాల శ్రీరామ్.
* బిజెపిలోకి వైసీపీ శ్రేణులు
సత్య కుమార్ యాదవ్( Satya Kumar Yadav) బిజెపి తరఫున ఇక్కడ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మంత్రి కూడా అయ్యారు. అయితే గత ఐదేళ్లుగా రెచ్చిపోయిన వైసీపీ నేతలు హవాకు బ్రేక్ పడింది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి సైతం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అయితే ఇక్కడ కూటమిలో సమన్వయ లోపాన్ని వైసిపి వినియోగించుకుంటోంది. వైసీపీ నుంచి యాక్టివ్ నాయకులంతా బిజెపిలో చేరుతున్నారు. అయితే వీరంతా కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి డైరెక్షన్ లోనే బిజెపిలో చేరుతున్నట్లు తెలుస్తోంది. అయితే బిజెపి బలోపేతం అవుతుందన్న రీతిలో సత్య కుమార్ యాదవ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. అయితే ఇలా బిజెపిలో చేరుతున్న నేతలు టిడిపి నాయకులపై టార్గెట్ చేయడం ప్రారంభించారు. దాడులు చేస్తున్నారు. దీంతో లబోదిబోమనడం టిడిపి శ్రేణుల వంతు అవుతోంది.
* ఐదేళ్లుగా ఎన్నో కేసులు
గత ఐదేళ్ల వైసిపి( YSR Congress ) పాలనలో ధర్మవరం నియోజకవర్గాన్ని కాపాడుకుంటూ వచ్చారు పరిటాల శ్రీరామ్. నిత్యం వివాదాలు జరుగుతూ ఉండేవి. కేసులతోపాటు పోలీసుల హెచ్చరికలను తట్టుకుని మరి పార్టీ శ్రేణులకు అండగా నిలవగలిగారు శ్రీరామ్. అయితే ఎన్నికల్లో పొత్తుల వేళ సమీకరణలు మారాయి. ఆ సమయంలో హై కమాండ్ ఆదేశించడంతో పక్కకు తప్పుకున్నారు శ్రీరామ్. బిజెపి అభ్యర్థి సత్య కుమార్ యాదవ్ గెలుపు కోసం కృషి చేశారు. టిడిపి శ్రేణులు సైతం సమన్వయంతో పనిచేసి సత్య కుమార్ యాదవ్ విజయంలో పాలుపంచుకున్నాయి. కానీ వైసీపీకి పనిచేసిన క్యాడర్ అంతా ఇప్పుడు బిజెపిలోకి వచ్చి.. తమపై పెత్తనం చేయడానికి మాత్రం సహించుకోలేకపోతున్నాయి టిడిపి శ్రేణులు. దీనిపై హై కమాండ్ కు ఫిర్యాదు చేసిన ఫలితం లేకపోవడంతో నిరాశలో మునిగిపోయాయి. అటు శ్రీరామ్ సైతం ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు. మరి పార్టీ హై కమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.