Graduate MLC Elections : ఎమ్మెల్సీ కోటా: రెండూ టీడీపీకే.. సమీకరణాలివీ.. ఈసారి పిఠాపురం వర్మకు ఖాయమా?

అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన ఐదు నెలల తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో మరో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగనున్నాయ. రెండు స్థానాల్లో టీడీపీ అభ్యర్థులే బరిలో దిగనున్నారు.

Written By: Dharma, Updated On : October 21, 2024 11:58 am

Graduate MLC Elections

Follow us on

Graduate MLC Elections : ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు ముగిసి ఐదు నెలలు గడిచింది. ఈ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది. చంద్రబాబునాయుడు నేతృత్వంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. దీంతో ఆయన నామినేషన్‌ పదవులను భర్తీ చేశారు. ఈ పదవుల్లో టీడీపీతోపాటు మిత్ర పక్షాలకూ ప్రాధాన్యం ఇచ్చారు. ఇక ఐదు నెలల పాలన తర్వాత కూటమి ప్రభుత్వం ఎమ్మెల్సీ ఎన్నికలు ఎదుర్కొనబోతోంది. ఏపీలోని రెండు గ్రాడ్యుయేట్‌ నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికలను ఎదుర్కొనబోతోంది. ఈ ఎన్నికల్లో టీడీపీనే ఇద్దరు అభ్యర్థులను బరిలో దించాలని నిర్ణయించింది. ఈమేరకు ఇద్దరు అభ్యర్థుల పేర్లును అధికారికంగా ప్రకటించింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే టికెట్‌ దక్కని వర్మకు ఈసారి ఎమ్మెల్సీగా అవకాశం వస్తుందని అందరూ భావించారు. కానీ ఈసారి కూడా నిరాశ తప్పలేదు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా తూర్పు గోదావరి నుంచే అభ్యర్థిని ప్రకటించింది.

మిత్రపక్షాల మద్దతు..
నామినేటెడ్‌ పదవుల్లో సీఎం చంద్రబాబు మిత్రపక్షాలకు ప్రాధాన్యం ఇచ్చారు. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం టీడీపీ నేతలనే నిలపాలని నిర్ణయించారు. ఈమేరకు మిత్రపక్షాలైన జనసేన, బీజేపీకి సమాచారం ఇచ్చారు. మిత్రపక్షాలు కూడా టీడీపీకి మద్దతు ఇచ్చాయి. దీంతో రెండు స్థానాలకు సీఎం అభ్యర్థులను అధికారికంగా ప్రకటించారు. గుంటూరు, కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ను ప్రకటించారు. ఇదే విధంగా తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖర్‌ పేరును ఖరారు చేశారు.

ఇద్దరూ టికెట్‌ త్యాగం చేసినవారే..
ఇదిలా ఉంటే.. టీడీపీ ప్రకటించిన ఇద్దరు ఎమ్మెల్సీ అభ్యర్థులు అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే టికెట్‌ త్యాగం చేసినవారే ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ జనసేన నేత నాదెండ్ల మనోహర్‌ క ఓసం తెనాలి టికెట్‌ వదులుకున్నారు. ఇక పేరాబత్తుల రాజశేఖర్‌ కూడా అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ టికెట్‌ ఆశించారు. కోనసిమ జిల్లా ఐపోలవరం మండానికి చెందిన ఆయన ఎంపీపీగా, జెడ్పీటీసీగా పనిచేశారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు కార్యక్రమాల కమిటీ పర్యవేక్షకుడిగా వ్యవహరించారు. కాకినాడ రూరల్‌ టికెట్‌ ఆశించారు. అయితే ఆ సీటు పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించారు. దీంతో ఇప్పుడు ఎమ్మెల్సీ టికెట్‌ దక్కింది.

వర్మకు దక్కేది?
ఇక పిఠాపురం టికెట్‌ త్యాగం చేసిన వర్మకు ఎమ్మెల్సీ టికెట్‌ వస్తుందని అంతా ఆశించారు. కానీ, ఈసారి కూడా నిరాశే మిగిలింది. నామినేటెడ్‌ పదవుల్లో కూడా వర్మ పేరు కనిపించలేదు. దీంతో ఆయనకు మరో కీలక పదవి దక్కవచ్చన్న చర్చ టీడీపీలో జరుగుతోంది. పవన్‌ కళ్యాణ్‌ గెలుపులో వర్మ కీలకంగా వ్యవహరించారు. ప్రస్తుతం సొంత నియోజకవర్గంలో వర్మకు ప్రాధాన్యం తగ్గిందనే వాదన ఉంది. అందుకే వర్మకు పదవి విషయంలో తాత్సారం చేస్తున్నారన్న చర్చ కూడా జరుగుతోంది.