TDP: నాలుగు దశాబ్దాల తర్వాత జీవీఎంసీ( Greater Vishakha Municipal Corporation ) మేయర్ గా టిడిపి నేత పిలా శ్రీనివాస్ ఎన్నిక కానున్నారు. ఇటీవల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మేయర్ పై పెట్టిన అవిశ్వాసం నెగ్గిన సంగతి తెలిసిందే. దీంతో ఈరోజు కొత్త మేయర్ ఎన్నికకు నిర్ణయించారు. కూటమికి స్పష్టమైన బలం ఉండడంతో ఆ పార్టీ అభ్యర్థి విజయం సాధించనున్నారు. టిడిపి కూటమి నుంచి అభ్యర్థిగా పీలా శ్రీనివాస్ ని టిడిపి హై కమాండ్ ఎంపిక చేసింది. ఇప్పటికే ఆయనకు బీఫారం అందజేసింది. ఆయన మేయర్ గా ఎన్నిక లాంఛనమే. మొత్తం జీవీఎంసీలో 97 మంది కార్పొరేటర్లు, 14 మంది ఎక్స్ అఫీషియో సభ్యులు ఉన్నారు. మేయర్ ని ఎన్నుకునేందుకు 56 మంది మద్దతు ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మూడింట రెండు వంతుల మెజారిటీ కూటమికి ఉంది. దీంతో సునాయాసంగా మేయర్ పీఠం టిడిపి కైవసం చేసుకునే పరిస్థితి కనిపిస్తోంది.
Also Read: రెడ్డి వర్సెస్ కమ్మ వర్సెస్ బిసి.. ఏపీ బిజెపి కొత్త అధ్యక్షుడు ఆయనే!
* పీలా శ్రీనివాస్ ఎన్నిక లాంఛనమే..
టిడిపి నాయకత్వం వ్యూహాత్మకంగా గవర సామాజిక వర్గానికి చెందిన పీలా శ్రీనివాస్( Peela Shrinivas) ను ఎంపిక చేసింది. 2021లో గ్రేటర్ ఎన్నికల సమయంలో గవర సామాజిక వర్గానికి చెందిన పీలా శ్రీనివాస్ ను మేయర్ అభ్యర్థిగా బరిలో దింపింది టిడిపి అధినాయకత్వం. అప్పట్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉండడంతో.. గ్రేటర్ విశాఖ నగర ప్రజలు అధికార పార్టీ వైపు మొగ్గు చూపారు. అయితే 29 స్థానాలతో ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది తెలుగుదేశం పార్టీ. టిడిపి ఫ్లోర్ లీడర్ గా పీలా శ్రీనివాస్ ఎంపికయ్యారు. గత నాలుగేళ్లుగా సమర్థవంతంగా పనిచేస్తూ వచ్చారు. అందుకే టిడిపి అధినాయకత్వం సైతం పీలా శ్రీనివాస్ కు అవకాశం కల్పించింది. టిడిపి కూటమికి ఏకపక్ష బలం ఉండడంతో.. పీలా శ్రీనివాస్ ఎన్నిక లాంచనమేనని తెలుస్తోంది.
* తొలిసారిగా గవర సామాజిక వర్గానికి..
జీవీఎంసీ చరిత్రలోనే రెడ్డి, బ్రాహ్మణులు, వెలమ, యాదవ, మత్స్యకార వర్గాల నుంచి మేయర్లుగా ఎన్నికయ్యారు. అయితే జీవీఎంసీలో గవర్లు( gavara caste ) కూడా ఒక ప్రధాన సామాజిక వర్గం. ఆ సామాజిక వర్గానికి చెందిన నేతకు వ్యూహాత్మకంగా తెలుగుదేశం పార్టీ ఎంపిక చేసింది. అయితే వైయస్సార్ కాంగ్రెస్ మేయర్ గొలగాని వెంకట హరి కుమారి యాదవ సామాజిక వర్గానికి చెందిన మహిళా నేత. ఆ సామాజిక వర్గం నుంచి వ్యతిరేకత వస్తుందనుకున్న తరుణంలో అదే సామాజిక వర్గానికి చెందిన నేతను ఎంపిక చేయాలి. అయితే టిడిపి మాత్రం గవర సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇచ్చింది. తద్వారా విశాఖ జిల్లాలో గవర్లు ప్రభావితం చూపే నియోజకవర్గాల్లో సానుకూలత వ్యక్తం అవుతోందని టిడిపి నేతలు చెబుతున్నారు.
* జనసేనకు డిప్యూటీ మేయర్ పదవి..
ఇక రెండు డిప్యూటీ మేయర్( Deputy Mayor) పదవులు భర్తీ కానున్నాయి. మేయర్ ఎన్నిక తరువాత డిప్యూటీ మేయర్ పదవులకు ఎన్నిక జరగనుంది. అయితే ఒక డిప్యూటీ మేయర్ పోస్టును జనసేనకు విడిచి పెట్టాలని నిర్ణయించినట్లు సమాచారం. జనసేన మూడు స్థానాల్లో విజయం సాధించగా.. ఎన్నికల ఫలితాల తర్వాత చాలామంది కార్పొరేటర్లు ఆ పార్టీలో చేరారు. ఆ పార్టీకి పెరిగిన బలం దృష్ట్యా డిప్యూటీ మేయర్ పోస్టు కేటాయించాలన్న డిమాండ్ వచ్చింది. దానిపై టిడిపి నాయకత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.