Ramoji Rao Funeral: రామోజీరావుతో చంద్రబాబుకు ఉన్న అనుబంధం గురించి అందరికీ తెలిసిన విషయమే. ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి రావడం, తాను ప్రమాణస్వీకారం చేయకుండానే రామోజీ రావు మృతి చెందడాన్ని చంద్రబాబు జీర్ణించుకోలేకపోయారు. అంతిమయాత్రలో పాల్గొన్న చంద్రబాబు భావోద్వేగానికి గురయ్యారు. పాడే మోశారు. కడసారి కన్నీటి వీడ్కోలు పలికారు. రామోజీ కుటుంబ సభ్యులను ఓదార్చారు.
అనారోగ్యంతో రామోజీరావు నిన్న వేకువ జామున మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన అంత్యక్రియలు రామోజీ ఫిలిం సిటీ లోనే స్మృతి వనంలో ఆదివారం జరిగాయి. తెలంగాణ, ఏపీ నుంచి సినీ, రాజకీయ ప్రముఖులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మృతదేహం వద్ద అంజలి ఘటించారు. తెలుగు సమాజం ఒక అక్షర యోధుడిని కోల్పోయిందంటూ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున సంతాప సభలు కొనసాగాయి. ఆదివారం ఉదయం రామోజీ ఫిలిం సిటీ లోనే ఆయన నివాసం నుంచి అంతిమయాత్ర ప్రారంభమైంది. ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. అంతిమయాత్రలో పాల్గొన్నారు.
ఫిలిం సిటీ లో తనకోసం ముందుగానే స్మృతి వనాన్ని రూపొందించుకున్నారు రామోజీరావు. అదే చోట శాస్త్రోక్తంగా ఆయన అంత్యక్రియలు కొనసాగాయి. చంద్రబాబుతో పాటు ఆయన కుమారుడు లోకేష్ హాజరయ్యారు. చంద్రబాబు రామోజీ పాడే మోశారు. ఈ సందర్భంగా భావోద్వేగానికి గురయ్యారు. కళ్ళు సైతం చెమర్చాయి. అనంతరం రామోజీ కుటుంబ సభ్యులకు చంద్రబాబు ఓదార్చారు. తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి చేసింది. తుమ్మల నాగేశ్వరరావు తో పాటు పలువురు మంత్రులు కూడా హాజరయ్యారు.