TDP And Janasena Alliance: చంద్రబాబు అరెస్టు పుణ్యమా అని ఫుల్ క్లారిటీ వచ్చింది. వచ్చే ఎన్నికల్లో పొత్తులు పొరలు విచ్చుకుంటూ బయటపడుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో కలిసే పోటీ చేస్తామని పవన్ బాహటంగానే ప్రకటించారు. తన మాటే ఫైనల్ అని తేల్చి చెప్పారు. అయితే ఇప్పుడు బీజేపీ పరిస్థితి ఏమిటి అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. బిజెపి మిత్రపక్షమైన జనసేన టిడిపికి స్నేహ హస్తం అందించింది. కానీ బిజెపి విషయంలో క్లారిటీ లేకుండా పోతోంది. అసలు ఆ పార్టీ కలిసి వస్తుందా? లేదా? అన్నది తెలియడం లేదు. అయితే కూటమిలోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తానని పవన్ ప్రకటించడం విశేషం. అయితే పవన్ కు ఆ మేరకు సంకేతాలు వచ్చాయా? లేకుంటే పవన్ చొరవ చూపి ఆ ప్రకటన చేశారా? అన్నది మాత్రం తెలియడం లేదు.
వచ్చే ఎన్నికల్లో టిడిపి, జనసేన, బిజెపి కలిసి వెళతాయని ప్రచారం జరిగింది. మూడు పార్టీల నాయకులు సైతం ఇదే చెప్పుకొచ్చారు. అటు వైసీపీ సైతం అనుమానం వ్యక్తం చేయడంతో పాటు ప్రచారం కూడా చేసింది. అయితే ఆది నుంచి తెలుగుదేశం పార్టీతో పొత్తు అంటే బిజెపి విముఖత గానే ఉండేది. గత అనుభవాల దృష్ట్యా, ఎన్నికల ముందు చంద్రబాబు వ్యవహార శైలి తదితర కారణాలతో బిజెపి పెద్దలు సైతం పెద్దగా ఆసక్తి చూపలేదు. అయితే ఎన్నికల తర్వాత బిజెపిలో చేరిన చంద్రబాబు అండ్ కో పొత్తుల కోసం గట్టి ప్రయత్నాలు చేసింది. అయినా సరే సానుకూల ఫలితాలు రాలేదు. అటు తరువాత చంద్రబాబు ఢిల్లీ వెళ్లి అమిత్ షా తో చర్చలు జరపడంతో పొత్తులపై ఫుల్ క్లారిటీ వస్తుందని భావించారు. కానీ అప్పటివరకు పొత్తులపై ఆశాభావం వ్యక్తం చేసిన చంద్రబాబు సైతం సైలెంట్ అయ్యారు.
అటు తర్వాత బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలుగా దగ్గుబాటి పురందేశ్వరి నియమితులయ్యారు. అప్పటివరకు టిడిపి తో పొత్తును వ్యతిరేకిస్తున్న సోము వీర్రాజును హై కమాండ్ పక్కకు తప్పించింది. దీంతో పొత్తులకు మార్గం సుగమం అవుతుందని అంతా భావించారు. అందుకు తగ్గట్టుగానే పురందేశ్వరి టిడిపికి అనుకూలంగా మాట్లాడడం ప్రారంభించారు. కేవలం వైసీపీ నే టార్గెట్ చేసుకున్నారు. సొంత అజెండాతో వ్యవహరిస్తున్నారన్న అపవాదును స్వల్ప కాలంలోనే మూట కట్టుకున్నారు. జగన్ సర్కార్ పై పోరాటాన్ని ప్రారంభించడంతో పాటు కేంద్రానికి సైతం ఫిర్యాదు చేశారు. అయినా కేంద్రం నుంచి సానుకూలత వ్యక్తం కాలేదు. చాలా విషయాల్లో జగన్ సర్కార్ కు కేంద్రం ఇతోధికంగా సాయపడుతూ వస్తోంది. తెలుగుదేశం పార్టీతో నాటి దూరాన్నే కేంద్ర పెద్దలు కొనసాగిస్తూ వచ్చారు.
వచ్చే ఎన్నికల్లో ఏపీలో ఎవరితో కలిసి వెళ్తే ప్రయోజనం అని బిజెపి గట్టిగా ఆలోచిస్తోంది. ఈ క్రమంలో పవన్ ను ఒప్పించి జనసేన,బిజెపిమాత్రమే కలిసి పోటీ చేస్తే ఫలితాలు ఆశాజనకంగా వస్తాయని కేంద్ర పెద్దలు ఆలోచిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే పవన్ మాత్రం ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి.. అంతిమంగా వైసిపికి ప్రయోజనం చేకూరుతుందని భావించినట్లు తెలుస్తోంది. అందుకే కేంద్ర పెద్దల సూచనను లైట్ తీసుకున్నారు. మరోవైపు జగన్కు కేంద్రం అన్ని విధాల అండదండలు అందిస్తోంది. అలాగని వైసీపీతో రాజకీయంగా వెళ్లలేని పరిస్థితి.ఇటువంటి పరిస్థితుల్లో బిజెపి అగ్ర నేతలు వ్యూహాత్మకంగా మౌనాన్ని ఆశ్రయించారు. ఏపీలో జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నారు.
ఇటువంటి తరుణంలో చంద్రబాబును జగన్ సర్కార్ అరెస్టు చేసింది. ఇది సంచలనం గా మారింది. ఏపీలో వైసీపీకి మినహాయించి అన్ని పార్టీలు చంద్రబాబు అరెస్టును ఖండించాయి. చివరకు భారతీయ జనతా పార్టీ సైతం స్పందించక తప్పలేదు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో కలిసి నడవాలనుకున్న జనసేన,టిడిపి వెంట వెళ్లాలని నిర్ణయం తీసుకుంది.ఇది బిజెపికి మింగుడు పడని విషయం. ప్రస్తుతం బిజెపి ఏపీలో ఒంటరిగా మిగిలింది. వైసీపీతో స్నేహం ఉన్న కలిసి వెళ్లలేని పరిస్థితి. కాంగ్రెస్, వామపక్షాలు ఉన్నా సైదాంతిక విభేదాలతో కలవలేని దుస్థితి. ఈ తరుణంలో బిజెపి సైతం కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. మరో ఆరు నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. రాజ్యసభలో కీలక బిల్లులు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. వాటికి ఆమోదం దక్కాలంటే వైసిపి అవసరం. అప్పటివరకు తాత్సారం చేసి.. తరువాత టిడిపి, జనసేన లతో కలిసి నడిచే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.