Tammineni Seetharam: శ్రీకాకుళం జిల్లాలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. మొన్నటి వరకు ఆయన శాసనసభ స్పీకర్గా వ్యవహరించారు. అయితే ఆయనతోపాటు కుటుంబ సభ్యులను నకిలీ పత్రాలతో భూకబ్జా కేసు వెంటాడుతోంది. ఈ క్షణం అయినా అరెస్ట్ జరుగుతుందన్న ఆలోచనతో తమ్మినేని ఫ్యామిలీతో సహా పరారీ అయ్యారు. వారికోసం పోలీస్ ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఆ ఒక్క కబ్జా వ్యవహారమే కాదు.. ఆయన స్పీకర్ గా ఉన్న సమయంలో జిల్లాలో అక్రమాల పర్వానికి తెర లేపారు అన్న విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు బాధితులు ఒక్కొక్కరు బయటకు వస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో తమ్మినేని ఫ్యామిలీ అక్రమాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
* గ్రీవెన్స్ లో వృద్ధ దంపతుల ఫిర్యాదు..
కొద్దిరోజుల కిందట ఓ వృద్ధ దంపతులు తమ్మినేని కుటుంబ సభ్యులపై ఏకంగా కలెక్టరేట్ గ్రీవెన్స్ లోనే ఫిర్యాదు చేశారు. ఆమదాలవలస టిఎస్ఆర్ కళాశాలకు సమీపంలో ఓ వృద్ధ దంపతులకు 8 సెంట్లు స్థలం ఉంది. అయితే ఆ స్థలాన్ని తమ్మినేని కుటుంబం ఆక్రమించేందుకు ప్రయత్నాలు చేసిందంటూ ఆ వృద్ధ దంపతులు సీఎంవో తో పాటు ఎస్పీ నిర్వహించిన ప్రజా పరిష్కార వేదికలో ఫిర్యాదు చేశారు. దీంతో డిఆర్ఓ విశ్వేశ్వరరావు, ఆమదాలవలస తహసిల్దార్, సర్వే అధికారులు వెళ్లి స్థలాన్ని బాధితులకు అప్పగించారు. అయితే ఇది జరిగి వారం రోజుల వ్యవధి కూడా కాలేదు.. శ్రీకాకుళం లో నాలుగు కోట్ల విలువైన భూమిని అక్రమ మార్గంలో స్వాధీనం చేసుకోవడం వెలుగులోకి వచ్చింది.
* బలమైన ఆరోపణలు…
మరోవైపు టెక్కలి మండలం చింతామణి గ్రామంలో ఏకంగా 23 ఎకరాల భూమిని తన కుమారుడి పేరుతో బలవంతంగా రాయించుకున్నారన్న ఆరోపణలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. తమ్మినేని సీతారాం స్పీకర్ గా ఉన్న సమయంలోనే చింతామణి గ్రామంలోని 324 సర్వే నెంబర్ లో భూమిపై ఆయన కన్ను పడినట్లు తెలుస్తోంది. గ్రామస్తులను భయపెట్టి మరి బలవంతంగా రాయించుకున్నారని శ్రీకాకుళం రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. గతంలో ఆమదాలవలసకు చెందిన ఓ వ్యక్తి తమ్మినేని కుటుంబంతో ఎంతో సన్నిహితంగా ఉండేవారు. అయితే ఆయన మరణించిన తర్వాత వారసులు మధ్య గొడవలు జరిగాయి. అయితే వారి ఇల్లును తమ్మినేని సీతారాం భార్య వాణి బలవంతంగా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆమదాలవలసకు చెందిన ఓ పోలీస్ కానిస్టేబుల్ అనారోగ్యంతో చనిపోయారు. అయితే తమకు కొంత మొత్తం అప్పుగా ఉన్నారని చెప్పి.. ఆయన కుటుంబాన్ని బెదిరించి ఒక ఇల్లును బలవంతంగా లాక్కున్నారని ఆరోపణ కూడా ఇప్పుడు వినిపిస్తోంది. ఇప్పుడు బాధితులు ఒక్కొక్కరు ముందుకు వచ్చి ఫిర్యాదులు చేస్తుండడంతో తమ్మినేని ఫ్యామిలీ చుట్టూ ఉచ్చు బిగిస్తోంది.


