Talliki Vandanam refund: ఏపీ ప్రభుత్వం( AP government ) ప్రతిష్టాత్మకంగా తల్లికి వందనం పథకం అమలు చేసింది. రెండు విడతల్లో విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేసింది. తాము అధికారంలోకి వస్తే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం పథకం అమలు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ హామీకి తగ్గట్టుగానే ఈ ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభం రోజున తల్లికి వందనం పథకం నిధులను విడుదల చేశారు. లక్షలాది మంది తల్లుల ఖాతాల్లో నిధులు జమ అయ్యాయి. అయితే వివిధ కారణాలతో నిధులు జమ కాని వారి కోసం ప్రత్యేకంగా గ్రీవెన్స్ అవకాశం ఇచ్చారు. వారు అర్హత నిరూపించుకోవడంతో వారికి సైతం నిధులు జమ చేశారు. మరోవైపు ఒకటో తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశం పొందిన విద్యార్థుల తల్లుల ఖాతాలో సైతం రెండో విడత నిధులు జమ చేశారు. అయితే దీనిపై భిన్న ప్రచారం నడుస్తోంది. జమ చేసిన నిధులను ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుందని సోషల్ మీడియాలో కొందరు ప్రచారం మొదలుపెట్టారు. దీనిపై ఫుల్ క్లారిటీ ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. ఫ్యాక్ట్ చెక్కు ద్వారా స్పష్టతనిచ్చింది.
Also Read: లోకేష్.. కేటీఆర్.. కలయిక కథేంటి?
రెండు విడతల్లో నిధులు..
జూన్ 12న తొలి విడత నిధులు జమ అయ్యాయి తల్లుల ఖాతాల్లో. సాధారణంగా విద్యా సంవత్సరం( academic year ) ప్రారంభం కావడంతో ఫీజులు, ఇతరత్రా ఖర్చులకోసం ఎక్కువమంది విత్ డ్రా చేశారు. రెండో విడతకు సంబంధించి ఇంకా నిధులు జమ అవుతూనే ఉన్నాయి. అయితే ఈ తరుణంలో అజ్ఞాత వ్యక్తి ఒకరు సోషల్ మీడియాలో ఒక వీడియోను షేర్ చేశారు. తల్లికి వందనం పథకం నిధులు బ్యాంకు నుంచి విత్ డ్రా చేసుకోకుంటే ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుంది అన్నది ఆ ప్రచార సారాంశం. ఇది పెద్ద ఎత్తున వైరల్ కావడంతో ప్రభుత్వం స్పందించింది. ఫ్యాక్ట్ చెక్ ద్వారా స్పందించి క్లారిటీ ఇచ్చింది. ఓ వీడియోను జతచేస్తూ స్పష్టత ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. తల్లికి వందనం నిధులు వెనక్కి తీసుకోవడం అనేది అబద్ధపు ప్రచారం గా తేల్చేసింది. ఒకసారి లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమ అయితే వారి అనుమతి లేకుండా వెనక్కి తీసుకోవడం అనేది జరగని పని అని తేల్చి చెప్పింది. ఈ విషయంలో లబ్ధిదారులు ఎవరు ఆందోళన చెందాల్సిన పనిలేదని కూడా స్పష్టం చేసింది. ఇటువంటి ఫేక్ ప్రచారాలను నమ్మవద్దని ప్రజలకు పిలుపునిచ్చింది.
Also Read: రూ. 260 కోట్ల నిధులు.. రైతుల కోసం చంద్రబాబ చేసిన ఓ గొప్ప పని.
పథకంపై ప్రజల్లో సంతృప్తి..
అధికారంలోకి వచ్చిన వెంటనే తల్లికి వందనం(Thalliki Vandanam) పథకం అమలు చేస్తామని చంద్రబాబు చెప్పిన మాట వాస్తవమే. అయితే గత ఏడాది జూన్లో అధికారం చేపట్టింది ప్రభుత్వం. దీంతో విద్యా సంవత్సరం ప్రారంభం సమయంలో నిధులు విడుదలకు ఎటువంటి సన్నాహాలు చేయలేదు. మరోవైపు ఆర్థిక కారణాల దృష్ట్యా నిధుల సమీకరణ పై దృష్టి పెట్టింది ప్రభుత్వం. అయితే రెండో ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభం నాడే పథకాన్ని అమలు చేసి చిత్తశుద్ధిని నిరూపించుకుంది. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పథకం వర్తించడంతో ప్రజల నుంచి సంతృప్తి వ్యక్తం అయింది. మొదటి సంవత్సరం పథకం ప్రారంభించుకున్న.. ఇంట్లో ఉన్న పిల్లలందరికీ పథకం వర్తింపజేయడంతో అందరిలోనూ ఒక సంతృప్తి శాతం కనిపిస్తోంది. ఇటువంటి తరుణంలో ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకొచ్చేలా రాజకీయ ప్రత్యర్థులు ఇలా సోషల్ మీడియాలో ప్రచారం చేయిస్తున్నారని ప్రభుత్వం అనుమానిస్తోంది. అందుకే ఫ్యాక్ట్ చెక్ ద్వారా దీనిపై పూర్తి స్పష్టతనిచ్చింది ఏపీ ప్రభుత్వం.