Ippatam Village : ఇప్పటం.. కొద్ది రోజుల కిందట మార్మోగిపోయింది ఈ గ్రామం పేరు. గుంటూరు జిల్లాలోని ఇదో చిన్న గ్రామం. మంగళగిరి సమీపంలో ఉన్న ఈ గ్రామంలో జనసేన పార్టీ వ్యవస్థాపక దినోత్సవం నిర్వహించేందుకు కొంత స్థలాన్ని ఇచ్చారు గ్రామస్తులు.అప్పట్లో అధికారంలో ఉన్న వైసిపి ప్రభుత్వానికి ఇది మింగుడు పడలేదు. వెంటనే గ్రామంలో అక్రమ నిర్మాణాల పేరుతో, రోడ్డు వెడల్పు పేరిట ఇళ్ల గోడల కూల్చివేతకు దిగింది.దీంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగారు.వారికి మద్దతుగా నిలిచారు. అప్పట్లో ప్రభుత్వం పవన్ ను అడ్డుకునే ప్రయత్నం చేసినా వెనక్కి తగ్గలేదు. పవన్ కళ్యాణ్ కాన్వాయ్ ని అడ్డుకున్నా.. నేరుగా బాధితుల వద్దకు వెళ్లి పరామర్శించారు. అప్పట్లో అదో సంచలన అంశంగా మారింది.
* హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
అయితే కేవలం ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం తమ ఇళ్లను కూల్చింది అంటూ ఇప్పటం గ్రామస్తులు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో కూల్చివేతలు ఆపాలని హైకోర్టు మధ్యంతర ఆదేశాలు జారీచేసింది. అయితే ప్రభుత్వం మాత్రం తాము నోటీసులు ఇచ్చి.. వారి నుంచి సరైన సమాధానం రాకపోవడంతోనే తాము కూల్చివేతలకు దిగినట్లు.. వారు అందించిన నోటీసుల వివరాలను హైకోర్టుకు సమర్పించింది. దీంతో న్యాయస్థానం ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టును తప్పుదోవ పట్టించడం పై 14 మంది గ్రామస్తులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. తలో లక్ష రూపాయలు జరిమానా విధించింది. దీనిని సవాల్ చేస్తూ ఇప్పటం గ్రామస్తులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
* జరిమానా తగ్గడం ఉపశమనం
చాలా రోజులుగా ఈ కేసు విచారణ కొనసాగుతోంది. ఈరోజు తుది తీర్పు వెల్లడించింది సుప్రీంకోర్టు. గతంలో హైకోర్టు జరిమానా విధించడాన్ని సమర్థించింది. అయితే జరిమానా మొత్తం తగ్గించాలన్న పిటిషనర్ల అభ్యర్థనను మాత్రం అంగీకరించింది. హైకోర్టు లక్ష రూపాయలు జరిమానా విధించగా.. దానిని పాతిక వేల రూపాయలకు తగ్గించింది. దీంతో ఇదొక సంచలన అంశంగా మారిపోయింది. పవన్ మద్దతుతో వాస్తవాలు చూసుకోకుండా.. కోర్టులకు తప్పుడు సమాచారం ఇవ్వడంతోనే ఈ పరిస్థితి వచ్చిందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే అప్పట్లో రైతులకు విధించిన జరిమానా తాను కట్టేందుకు ముందుకు వచ్చారు పవన్. ఇప్పుడు ఎలా స్పందిస్తారో చూడాలి.