Pinnelli Ramakrishna Reddy : ఈవీఎంలు ధ్వంసం చేసిన ఎమ్మెల్యేకు రక్షణ కల్పిస్తారా.. ఇది పెద్ద జోక్

ఏపీలో జరిగిన ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ టిడిపి కూటమికి అనుకూలంగా ఫలితాలను ప్రకటించడం, తాజాగా మాచర్ల ఎమ్మెల్యే పై సుప్రీంకోర్టు నిషేధం విధించడం.. వంటి పరిణామాలు ఆసక్తికరంగా మారాయి.

Written By: NARESH, Updated On : June 3, 2024 6:50 pm

Pinnelli Ramakrishna Reddy

Follow us on

Pinnelli Ramakrishna Reddy : మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉదంతం మంగళవారం సుప్రీంకోర్టును ఒక కుదుపు కుదిపింది. గత నెల 13న జరిగిన ఎన్నికల్లో వీవీ ప్యాట్ ను ధ్వంసం చేసిన కేసులో ఆయనకు హైకోర్టు రక్షణ కల్పించడం.. దానిని సవాల్ చేస్తూ టిడిపి ఏజెంట్ సుప్రీంకోర్టును ఆశ్రయించడం.. సుప్రీంకోర్టు సోమవారం ఆ కేసును విచారణకు స్వీకరించడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. ” ప్రజాస్వామ్యం అంటే ఏంటో తెలుసా.. దానికి మూల స్తంభమైన ఎన్నికల వ్యవస్థను అపహాస్యం చేశారు.. ఈవీఎంలను ధ్వంసం చేసిన ఎమ్మెల్యేకు రక్షణ కల్పించారు. ఇంతకు మించిన జోక్ ఏముంటుందని” సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పల్నాడు జిల్లాలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలింగ్ కేంద్రంలోకి ప్రవేశించారు. ఈవీఎంను ధ్వంసం చేశారు. అదే సమయంలో ఓటర్ వెరిఫైడ్ పేపర్ ట్రైల్(VVPAT)ను పట్టుకున్నారు.. మే 13న ఈ సంఘటన జరిగింది. అయితే ఈ కేసులో రామకృష్ణారెడ్డికి ఉపశమనం లభించింది. మే 13న ఎన్నికలు ముగిసిన మరుసటి రోజు ఆయనపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు న్యాయమూర్తి వెంకట జ్యోతిర్మయి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేసుకు సంబంధించి పాల్వాయి గేటు టిడిపి పోలింగ్ ఏజెంట్ నంబూరి శేషగిరిరావు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కి రక్షణ కల్పిస్తూ హైకోర్టు కల్పించిన వెసలు బాటును ఎత్తివేయాలని ఆయన తన పిటిషన్ లో పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రంలో ఈవీఎంల ధ్వంసంతో పాటు, హత్యాయత్నానికి ఆయన పాల్పడ్డారని ఆయన ఆ పిటిషన్ లో ప్రస్తావించారు. పిన్నెల్లి నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆయన వివరించారు.

ఈ కేసు ను సోమవారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అరవింద్ కుమార్, సందీప్ మెహతాతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా ధర్మాసనం ఏపీ హైకోర్టుపై తీవ్రంగా మండిపడింది..” వ్యవస్థను పూర్తిగా అపహస్యం చేస్తున్నారు. ఇలాంటి కేసుల్లో మధ్యంతర రక్షణ ఎలా కల్పిస్తారు. అలాంటి ఉత్తర్వుపై మేము స్టే ఇవ్వకపోతే.. వ్యవస్థను మరింత అపహస్యం చేసినట్టే” అని ధర్మాసనం పేర్కొంది..” మమ్మల్ని ఎగతాళి చేస్తున్నారా.. ఇదొక పెద్ద జోక్.. ఎన్నికలు జరుగుతుంటే పోలింగ్ బూత్ లోకి అంత మంది ఎలా ప్రవేశిస్తారు. అది లైవ్ వెబ్ టెలికాస్ట్. ఈవీఎం, వివి ప్యాట్ ధ్వంసం చేశారని ఫిర్యాదు దారు పిటిషన్ లో పేర్కొన్నారు. పోలింగ్ బూత్ లో ఎనిమిది మంది దాకా ఉన్నారు.. అక్కడ రిగ్గింగ్ చేయడానికి అవకాశం ఎక్కడ ఉంది? వైసీపీ నాయకుడు చేసిన ఆరోపణలు అంగీకరించేందుకు ప్రాథమికంగా మీరు మొగ్గు చూపుతున్నట్టు కనిపిస్తోందని” హైకోర్టును ఉద్దేశించి సుప్రీంకోర్టు ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. మధ్యంతర రక్షణ ఉత్తర్వులు వచ్చేవరకు ఎమ్మెల్యే అజ్ఞాతంలోకి వెళ్లారని, ఇలాంటి సంఘటనపై పోలీసులు కూడా స్పందించకపోవడం విచారకరమని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. ” ఆయనకు (ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి) వ్యవస్థ అంటే చిన్నచూపులాగా ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యే పోలింగ్ స్టేషన్ వెళ్లి, ఈవీఎం, వీవీ ప్యాట్ ధ్వంసం చేస్తారా? పైగా తెలియని వ్యక్తి ఎవరో ఉన్నారంటూ ఫిర్యాదు చేస్తారా? అలాంటి వ్యక్తి తన నియోజకవర్గంలో ఓట్ల లెక్కింపు జరుగుతున్నప్పుడు వెళ్ళకూడదు. అటు సమీపంలోకి కూడా అతడు ప్రవేశించకూడదు. అతనిపై నమోదైన కేసును ఈనెల ఆరవ తేదీన విచారించి, పరిష్కరించాలని” ధర్మాసనం సూచించింది. కాగా, రామకృష్ణ రెడ్డి తరఫున ఈ కేసును సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ వాదించారు. ఉన్నత న్యాయస్థానం విధించిన సూచనలకు తన క్లైంట్ కట్టుబడి ఉంటాడని కోర్టులో పేర్కొన్నారు. ఆయనపై దాఖలైన పిటిషన్ విచారించేందుకు హైకోర్టుకు అనుమతి ఇవ్వాలని ధర్మాసనాన్ని వికాస్ సింగ్ కోరారు. ఏపీలో జరిగిన ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ టిడిపి కూటమికి అనుకూలంగా ఫలితాలను ప్రకటించడం, తాజాగా మాచర్ల ఎమ్మెల్యే పై సుప్రీంకోర్టు నిషేధం విధించడం.. వంటి పరిణామాలు ఆసక్తికరంగా మారాయి.