Super victories in AP: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి సునామీ సృష్టించింది. భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు మించి ఈ విజయం ఉంది. మహాఘాట్ బంధన్ దారుణ పరాజయం చవిచూసింది. అయితే దేశ రాజకీయాలను, ఎన్నో రాజకీయ పార్టీలకు విజయాన్ని అందించిన ప్రశాంత్ కిషోర్ జన సూరజ్ పార్టీ ప్రజామోదం పొందలేకపోయింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇదే హాట్ టాపిక్ గా మారింది. ఏపీలో రెండు పార్టీలకు విజయం అందించిన ప్రశాంత్ కిషోర్.. తన స్వరాష్ట్రంలో మాత్రం తన సొంత పార్టీని మాత్రం అధికారంలోకి తెచ్చుకోలేకపోయారు. దీనిపై ఏపీవ్యాప్తంగా తీవ్ర చర్చ నడుస్తోంది. శుక్రవారం ఉదయం నుంచి ఫలితాలు వెల్లడవుతున్న తరుణంలో ప్రశాంత్ కిషోర్ జన సూరజ్ పార్టీ పరిస్థితి ఏంటి అని ఎక్కువ మంది ఆరా తీశారు. ఆ పార్టీకి దారుణ పరాజయం ఎదురయ్యేసరికి అందరూ ఆశ్చర్యపోయారు.
ముందుగా వైసిపికి..
2014లో రాష్ట్ర విభజన జరిగింది. నవ్యాంధ్రప్రదేశ్ ఆవిర్భవించింది. ఆ ఎన్నికల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబుకు ఏపీ ప్రజలు అవకాశం ఇచ్చారు. అదే సమయంలో బలమైన ప్రతిపక్షంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డికి ఛాన్స్ కల్పించారు. అయితే విడిపోయిన రాష్ట్రంగా అనేక ఇబ్బందుల నడుమవున్న ఏపీని చక్కదిద్దే ప్రయత్నం చేశారు చంద్రబాబు. అయితే అప్పటికే ఎక్కువ స్థానాలతో బలమైన ప్రతిపక్షంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి కి ప్రశాంత్ కిషోర్ వ్యూహం అక్కరకు వచ్చింది. ఆయన నేతృత్వంలోని ఐపాక్ టీం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి సేవలందించింది. అప్పటి టిడిపి ప్రభుత్వ వైఫల్యాలను, వైసిపి పై అనుకూల ప్రచారంలో ప్రశాంత్ కిషోర్ టీం సక్సెస్ అయింది. అలా 2019లో అద్భుత విజయం సొంతం చేసుకుంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. దీంతో ప్రశాంత్ కిషోర్ కు ఎనలేని ప్రాధాన్యం పెరిగింది. అయితే సొంత రాష్ట్రంలో రాజకీయ పార్టీ ప్రారంభించిన ప్రశాంత్ కిషోర్ రాజకీయ వ్యూహకర్త కొలువుకు దూరంగా ఉండిపోయారు.
తెలుగుదేశం పార్టీకి సలహాలు..
బీహార్లో జన సూరజ్ పార్టీ ఏర్పాటు, విస్తరణతో పాటు అసెంబ్లీ ఎన్నికల సనాహాలను ముందుగానే ప్రారంభించారు ప్రశాంత్ కిషోర్. ప్రజల్లోకి బలంగా వెళ్లేందుకు పాదయాత్ర కూడా చేశారు. అయితే జాతీయస్థాయిలో చంద్రబాబుకు సన్నిహితుడు ఒకరు ప్రశాంత్ కిషోర్ సేవలను వినియోగించుకోవాలని సూచించారట. ఆయన చొరవ తీసుకొని ప్రశాంత్ కిషోర్ ను ఒప్పించారట. అలా ప్రశాంత్ కిషోర్ చంద్రబాబుతో పాటు లోకేష్ కు దగ్గర అయ్యారు. 2024 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీకి విలువైన సలహాలు, సూచనలు ఇచ్చారు. టిడిపికి కొన్ని రకాల స్లోగన్స్ ఇచ్చి ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యతను అప్పగించారు. దీంతో 2024 ఎన్నికల్లో టిడిపి కూటమి ఘనవిజయం సాధించింది. అయితే వైసిపి తో పాటు తెలుగుదేశం పార్టీకి సేవలందించిన ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు బీహార్లో దారుణంగా ఓడిపోయారు. ఇది కచ్చితంగా ఆయన క్రెడిబులిటీ పై పడుతుంది. అందుకే ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ఎలాంటి అడుగులు వేస్తారు అన్నది చర్చగా మారింది.