TTD Parakamani Case: తిరుపతిలో( Tirupati) పరకామణి చోరీ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసిపి హయాంలో తిరుమలలో జరిగిన వైఫల్యాలపై సమీక్షించింది. ముఖ్యంగా ఐదేళ్ల వైసిపి పాలనలో తిరుమల లడ్డు తయారీలో అవకతవకలు జరిగాయని అనుమానించింది. ముఖ్యంగా నెయ్యి కల్తీ జరిగిందన్నది ప్రధాన ఆరోపణ. దీనిపై సిబిఐ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ చేపడుతోంది. అదే సమయంలో పరకామణి చోరీ కేసును బలవంతంగా రాజీ చేశారని.. ఇందులో అప్పటి టీటీడీ పెద్దల హస్తం ఉందన్నది ప్రధాన ఆరోపణ. అయితే అప్పట్లో పరకామణి చోరీపై ఫిర్యాదు చేసిన టిటిడి మాజీ అధికారి ఒకరు అనుమానాస్పదంగా మృతి చెందారు. అయితే ఇది హత్య? లేకుంటే ఆత్మహత్య? అన్నది తేలాల్సి ఉంది. రైల్వే ట్రాక్ పై మృతదేహం అనుమానాస్పదంగా ఉండడంతో.. ఆ దిశగా పోలీసులు విచారణ ప్రారంభించారు.
విజిలెన్స్ అధికారుల పట్టివేత..
టీటీడీ పరకామణిలో పనిచేసే రవి కుమార్ ( Ravi Kumar) అనే వ్యక్తి.. పరకామణిలో చోరీ చేసి వెళ్తుండగా విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. అప్పట్లో టిటిడి ఏవీఎస్ఓ గా ఉన్న సతీష్ కుమార్ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. అయితే పరకామణి చోరీ కేసును వైసీపీ హయాంలో లోక్ అదాలాత్ లో బలవంతంగా రాజీవ్ చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత సీనియర్ జర్నలిస్ట్ శ్రీనివాసులు ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారించిన హైకోర్టు దర్యాప్తు చేయాలని సిఐడి కి ఆదేశించింది. అయితే అప్పట్లో ఫిర్యాదు చేసి కేసును రాజీ చేసుకున్న సతీష్ కుమార్ ను విచారించారు సిఐడి అధికారులు. కానీ అదే సతీష్ కుమార్ ఈరోజు అనంతపురం జిల్లాలో మృతదేహమై కనిపించారు. అనంతపురం జిల్లా తాడిపత్రి సమీపంలోని కోమలి దగ్గర రైల్వే ట్రాక్ పై ఆయన మృతదేహం కనిపించింది. రైల్వే పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పట్లో టిటిడి విజిలెన్స్ విభాగంలో పని చేసిన సతీష్ కుమార్.. ప్రస్తుతం గుంతకల్లు రైల్వేలో జి ఆర్ పి ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.
హైకోర్టులో ప్రతివాదిగా..
పరకామణి చోరీకి సంబంధించి హైకోర్టులో( High Court) దాఖలైన పిటీషన్ లో సతీష్ కుమార్ ప్రతివాదిగా ఉన్నారు. ఆయన గత నెలలో హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. పరకామణిలో సీనియర్ అసిస్టెంట్ గా పని చేస్తున్న రవికుమార్ 72 వేల రూపాయలు విలువచేసే అమెరికన్ డాలర్లు చోరీ చేస్తూ దొరికిపోయారు. సీసీ కెమెరాల్లో అది నిక్షిప్తమై ఉంది. వెంటనే దొంగతనం చేసిన డాలర్లను సీజ్ చేసి పోలీసులకు అప్పట్లో అప్పగించాను అని ఆ పిటీషన్ లో చెప్పారు సతీష్ కుమార్. అయితే ఆ కేసును రాజీ చేసుకోవాలని రవికుమార్ ఆశ్రయించారని.. ఫిర్యాదుదారుడిగా దానికి ఒప్పుకున్నానని.. ఈ విషయంలో ఎలాంటి దురుద్దేశం లేదని.. టీటీడీ ప్రయోజనాలను కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సతీష్ కుమార్ కోర్టుకు స్పష్టం చేశారు. జర్నలిస్ట్ శ్రీనివాస్ వేసిన పిటీషన్ను కొట్టివేయాలని కోరారు. మరోవైపు పరకామణి చోరీ విషయంలో సిఐడి విచారణ వేగవంతం అవుతోంది. ఇంతలోనే ఫిర్యాదుదారుడు సతీష్ కుమార్ అనుమానాస్పదంగా మృతి చెందడం సంచలనంగా మారింది.