Defeat in Telangana: ఏపీలో( Andhra Pradesh) వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి నిరాశ మిగిలింది. తెలంగాణలోని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించడం వైసిపికి ఎంత మాత్రం మింగుడు పడలేదు. అక్కడ బిఆర్ఎస్ గెలవాలన్నది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమతం. తద్వారా తన మిత్రుడు బలపడితే.. తాను బలపడతానన్న నమ్మకం జగన్మోహన్ రెడ్డి ది. రాష్ట్ర విభజన నుంచి కెసిఆర్ తో స్నేహం కొనసాగిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకంతో పాటు ఆ ఇద్దరు నేతలకు ఉమ్మడి శత్రువు కావడంతో.. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవాలన్నది జగన్మోహన్ రెడ్డి అభిప్రాయం. కానీ అక్కడ కాంగ్రెస్ పార్టీ 25 వేల ఓట్లకు పైగా మెజారిటీతో గెలిచింది. తన మిత్రుడు ఓడిపోయేసరికి జగన్మోహన్ రెడ్డిలో డీలా కనిపించింది.
ఆది నుంచి సర్దుబాటు..
2014 నుంచి చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy ) తెలంగాణలో పోటీ చేశారు. ఒకటి రెండు స్థానాలు కూడా దక్కాయి. అయితే ఆ ఎన్నికల్లోనే కెసిఆర్ తో సర్దుబాటు చేసుకున్నారు. తెలంగాణలో నామమాత్రం పోటీ చేసి.. గెలిచిన ఒకరిద్దరిని సైతం కేసీఆర్ గూటికి పంపించారు. అది మొదలు ఇప్పటివరకు ఎన్నికల్లో పాల్గొనలేదు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సెటిలర్స్ రూపంలో ఉండే వైసీపీ శ్రేణులు బిఆర్ఎస్ కోసం బలంగా పనిచేసేవి. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో సైతం వైసీపీ సానుభూతిపరులు బిఆర్ఎస్ కోసం గట్టి ప్రయత్నాలు చేశారు. అదే సమయంలో తటస్థ వైఖరిని ప్రకటించిన టిడిపి శ్రేణులు సైతం కాంగ్రెస్ వైపు మొగ్గు చూపాయి. కాంగ్రెస్ గెలవడంతో వైసిపి నిరాశ చెందగా.. తెలుగుదేశం పార్టీలో మాత్రం ఫుల్ జోష్ నెలకొంది.
ఆయనకే మార్గం లేకపోతే..
కెసిఆర్ రాజకీయంగా ఎదిగితే ఏదో ఒక మార్గం జగన్కు దొరకక తప్పదు. కానీ తెలంగాణలో రాజకీయంగా ఉనికి చాటుకోవడానికి కూడా ఇబ్బంది పడుతోంది గులాబీ పార్టీ. ముందుగా అసెంబ్లీ, తరువాత కంటోన్మెంట్, అటు తరువాత పార్లమెంట్ ఎన్నికల్లో తీవ్ర నిరాశ మిగిలింది ఆ పార్టీకి. పార్లమెంట్ సీట్లకు సంబంధించి కొన్ని స్థానాల్లో బి ఆర్ఎస్కు డిపాజిట్లు కూడా దక్కలేదు. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో దారుణ పరాజయంతో దిక్కుతోచని స్థితికి చేరుకుంది గులాబీ పార్టీ. అయితే ఆ పార్టీ ద్వారా లబ్ధి పొందుదాం అనుకున్న వైసీపీ సైతం ఇప్పుడు తీవ్ర నిరాశలో కూరుకుపోయింది. ఒక విధంగా చెప్పాలంటే తెలుగు రాష్ట్రాల్లో కెసిఆర్, జగన్మోహన్ రెడ్డిని వేరుగా చూడలేరు. ఆ స్థాయిలో వారి మధ్య నడిచింది ఇచ్చిపుచ్చుకోవడం. కానీ ఇప్పుడు ఆ ఇద్దరు నేతలు సంక్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారు. ఎవరు ముందుగా రాజకీయంగా ఎదిగితే.. వారు తన స్నేహితుడికి సాయం చేస్తారన్నమాట. కానీ ఉమ్మడి తెలుగు ప్రజలు మాత్రం ఆ రెండు పార్టీలకు ప్రస్తుతానికి అవకాశం ఇవ్వడం లేదు. మున్ముందు ఇస్తారా? లేదా? అన్నది చూడాలి.