weather : ఏపీలో భిన్న వాతావరణం నెలకొంది. ఒకవైపు వర్షాలు పడుతుండగా.. మరోవైపు ఎండల తీవ్రత అధికంగా ఉంది. 40 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదవుతోంది. వాతావరణంలో తలెత్తిన పరిస్థితులు వల్లేనంటూ వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది. ప్రధానంగా రాయలసీమ జిల్లాల్లో ఎండ తీవ్రత అధికంగా ఉంది. తిరుపతి జిల్లా రేణిగుంట, అల్లూరి సీతారామరాజు జిల్లా గంగవరం లో అత్యధికంగా 40.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదయింది. కడప జిల్లా సిద్ధవటంలో 40.3° c మేరా పగటి ఉష్ణోగ్రత నమోదయినట్లు తెలుస్తోంది. మరి కొద్ది రోజులపాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉన్నట్లు సమాచారం.
మరోవైపు శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి జిల్లాలో ఈరోజు తేలికపాటి వర్షాలు పడ్డాయి. ఆకాశం మేఘావృతమై వర్షాలు పడుతున్నాయి. మంగళవారం సైతం రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో వర్షం పడింది. అత్యధికంగా ప్రకాశం జిల్లా కనిగిరిలో 43.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో 34, ప్రత్తిపాడు లో 33, అల్లూరి జిల్లా గూడెం కొత్త వీధిలో 30 మిల్లీమీటర్ల మేర వర్షపాతం నమోదయింది.
అయితే ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు తీవ్ర వడగాలులు వీచిన ప్రాంతాల్లో సైతం.. వర్షాలు కురవడం విశేషం. శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, నెల్లూరు, అన్నమయ్య, రాయచోటి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ముందుగానే ప్రకటించింది. దానికి అనుగుణంగానే చాలా జిల్లాల్లో వర్షపాతం నమోదయింది. మరోవైపు ఉపరితల ద్రోణి ప్రభావంతోనే ఈ వర్షాలు పడుతున్నాయని వాతావరణ శాఖ చెబుతోంది. అయితే ఉక్కపోత, తీవ్ర వడగాలులతో అల్లాడిపోతున్న ప్రజలకు వర్షం ఉపశమనం ఇస్తోంది.