Srikakulam : వెనుకబడిన జిల్లా నా కొడకల్లారా.. జర్నలిస్టులపై శ్రీకాకుళం రిమ్స్ ఆర్ఎంవో చిందులు

ఇప్పుడు జిల్లా ప్రజలను కించపరిచే విధంగా వ్యవహరించారు. దీనిపై నేరుగా అసెంబ్లీ స్పీకర్ ఫిర్యాదుచేసినా వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఆర్ఎంవో తిట్ల దండకం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. 

Written By: Dharma, Updated On : June 28, 2023 5:34 pm
Follow us on

Srikakulam : సమాజంలో మీడియా పాత్ర కీలకం. ప్రజాస్వామ్యంలో ఒక ఫిల్లర్ గా మీడియాను అభివర్ణిస్తారు. ప్రజలకు మంచి చెడులను చూపించి.. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలిచేదే మీడియా. అటువంటి మీడియానే కొందరు దుర్వినియోగం చేస్తున్నారు. మరికొందరు దూషిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఇటువంటి ఘటనే వెలుగుచూసింది. ఓ హత్యకేసుకు సంబంధించి మీడియా కవరేజ్ కు వెళ్లిన మీడియా ప్రతినిధులపై బూతు పురాణం అందుకున్నారు శ్రీకాకుళం సాధారణ ఆస్పత్రి (రిమ్స్) ఆర్ఎంవో  శంకరరావు. జర్నలిస్టు నా కొడుకులకు లోపలకు రానియ్యకండి అంటూ సిబ్బందికి ఆదేశాలిచ్చారు. గంటకుపైగా జర్నలిస్టులకు నరకం చూపించారు.

అదే జిల్లాలోని ఎచ్చెర్ల మండలం కుప్పిలిలో ఒక హత్య జరిగింది. ఈ ఘటనలో హతుడు మృతదేహాన్ని రిమ్స్ మార్చురీలో ఉంచారు. దీనికి సంబంధించి కవరేజ్ కు మీడియా వెళ్లింది. మార్చురీ వద్దకు వెళ్లేందుకు మీడియా ప్రతినిధులు అనుమతి కోరారు. దీంతో తీవ్ర కోపోద్రిక్తుడైన ఆర్ఎంవో ఒక్కసారిగా జర్నలిస్టులపై విరుచుకుపడ్డారు. తిట్ల దండకం అందుకున్నారు. ఒకటి కాదు రెండు కాదు చాలా రకాలుగా దూషించారు. వెనుకబడిన జిల్లా నా కొడకల్లారా అంటూ తీవ్ర పదజాలంతో ఆయన దూషణల పర్వం కొనసాగింది. గేట్లు మూసి వేయాలంటూ సిబ్బందిని ఆదేశించారు. సుమారు గంట పాటు గేటు బయటే జర్నలిస్టులు ఉండిపోయారు.

అయినా సరే ఆర్ఎంవో శంకరరావు వెనక్కి తగ్గలేదు. తొడగొడుతూ మీషం మెలేస్తూ జర్నలిస్టులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వెనుకబడిన జిల్లాకు చెందిన నా కొడకల్లారా.. మీ జర్నలిస్టుల వల్లే శ్రీకాకుళం జిల్లా వెనుకబడిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు వచ్చినా సరే ఆయన వినలేదు. దీంతో గేటు ఎదుట జర్నలిస్టులు ధర్నాకు దిగారు. జరిగిన విషయాన్ని అక్కడి నుంచే జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదుచేశారు. అమ్మఒడి ప్రారంభోత్సవానికి జిల్లా కేంద్రానికి విచ్చేసిన స్పీకర్ తమ్మినేని సీతారాంకు ఫిర్యాదుచేశారు. దీంతో ఆయన తనను వచ్చి కలవాలని ఆర్ఎంవోకు సూచించారు. కానీ ఆయన రాలేదు. దీంతో వైద్యఆరోగ్య శాఖ ఉన్నతాధికారులకు స్పీకర్ ఫిర్యాదుచేశారు.

గతంలో కూడా ఆర్ఎంవో ఇలానే వివాదాస్పదంగా వ్యవహరించిన సందర్భాలున్నాయి. ఆయనపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అయినా ఉన్నతాధికారులు చర్యలు తీసుకునేందుకు వెనుకడుగు వేస్తూ వచ్చారు. ఇప్పుడు జిల్లా ప్రజలను కించపరిచే విధంగా వ్యవహరించారు. దీనిపై నేరుగా అసెంబ్లీ స్పీకర్ ఫిర్యాదుచేసినా వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఆర్ఎంవో తిట్ల దండకం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది.