YCP MLAs: వైఎస్ఆర్ కాంగ్రెస్( YSR Congress) పార్టీలో విచిత్ర పరిస్థితి కనిపిస్తోంది. ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి శాసనసభకు హాజరు కావడం లేదు. తనకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభకు హాజరవుతానని చెబుతున్నారు. తనకు ప్రతిపక్ష హోదా ఇచ్చే ధైర్యం లేదని చంద్రబాబుకి సవాల్ చేస్తున్నారు. అసలు బుద్ధి జ్ఞానం ఉందా అంటూ చంద్రబాబు ప్రశ్నించిన జగన్ తీరులో మార్పు రావడం లేదు. ఆయుధం ఇవ్వండి యుద్ధం చేస్తా అన్నట్టు ఉంది జగన్మోహన్ రెడ్డి. అంతకుమించింది ఏంటంటే.. అధికార పార్టీపై పోరాటం చేసేందుకు.. అదే అధికార పార్టీకి అనుమతి కోరినట్టు ఉంది. అయితే ప్రస్తుతం జగన్ వైఖరి ఇంటా బయట చర్చ జరుగుతోంది. శాసనమండలి సమావేశాలకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు హాజరవుతున్నారు. మరి శాసనసభకు ఏం బాధ వచ్చింది అనేవారు ఉన్నారు. పోనీ హోదా ఇస్తే.. గంటలకు గంటలు మాట్లాడే అవకాశం ఇచ్చినా జగన్ మాట్లాడగలరా? ప్రమాణ స్వీకార సమయంలోనే ఆయన పూర్తిగా అయోమయానికి గురయ్యారు. చాలా ఆత్మ నున్యతా భావంతో మాట్లాడారు. అటువంటి వ్యక్తి వచ్చి 164 మంది ఎమ్మెల్యేలను ఎదుర్కోవడం సాధ్యమా? అది అయ్యే పనేనా? అందుకే జగన్తో పని లేకుండా ఓ ఆరుగురు వైసీపీ ఎమ్మెల్యేలు సభకు హాజరవుతారని ప్రచారం నడుస్తోంది.
* కొత్త వారే అధికం..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈసారి పేరు మోసిన నేతలు ఎవరూ గెలవలేదు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి( Ramachandra Reddy ), ఆయన తమ్ముడు ద్వారకానాథ్ రెడ్డి, కడప జిల్లా నుంచి అమర్నాథ్ రెడ్డి, మరో ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి లాంటి వారే గెలిచారు. మిగతా వారంతా పెద్దగా తెలియని వారే. అయితే ఇప్పుడు జగన్ అభిప్రాయంతో సంబంధం లేకుండా.. ఓ ఆరుగురు వైసీపీ ఎమ్మెల్యేలు సభకు హాజరవుతారని ప్రచారం నడుస్తోంది. అయితే అనర్హత వేటు భయంతోనే వారు సభకు హాజరవుతున్నట్లు సమాచారం. సభకు సమాచారం ఇవ్వకుండా 60 పని దినాలు హాజరు కాకపోతే అనరాహత వేటు వేయవచ్చు. అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వైసిపి సభ్యులు హాజరు కాలేదు. ఒకే ఒక్క రోజు గవర్నర్ ప్రసంగం నాడు సభకు హాజరయ్యారు. ఆరోజు హాజరు వేసుకున్నారు. కానీ అది చెల్లదని తేలింది. తరువాత కొందరు దొంగ చాటుగా వచ్చి సంతకాలు పెట్టినట్లు తెలియడంతో స్పీకర్ రూలింగ్ ఇచ్చారు.
* వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు..
సెప్టెంబర్ నెలలో వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు( assembly sessions ) నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ సమావేశాలకు హాజరు కాకుంటే మాత్రం.. 60 రోజుల కోటా పూర్తి అయిపోతుంది. అందుకే వైసీపీ ఎమ్మెల్యేలు ఒకరితో ఒకరు మాట్లాడుకుని అసెంబ్లీకి హాజరుకావాలని నిర్ణయించుకున్నట్లుగా చెబుతున్నారు. అలా సభకు వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పాలని భావిస్తున్నారు. అయితే ఆ ఆరుగురు ఎవరు అన్నది మాత్రం తెలియడం లేదు. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో మాత్రం సభకు హాజరవుతారని బలంగా ప్రచారం జరుగుతోంది. అయితే వారిని కచ్చితంగా ఆపేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తారు. ఆ ఆరుగురు సభ్యులు సభకు హాజరైతే మాత్రం జగన్మోహన్ రెడ్డి బరువు పోవడం ఖాయం. అయితే ఇందులో తొలిసారిగా ఎమ్మెల్యేలు అయిన వారు ఉన్నారు. కనీసం సభలో మాట్లాడకుండా తమ పదవీకాలం ముగిస్తే.. తమకు ఏం ప్రయోజనమని.. కనీసం మాజీ ఎమ్మెల్యేల కోటా కింద పెన్షన్ తో పాటు రాయితీలు తీసుకోలేమని బాధపడుతున్న వారు ఉన్నారు. అందుకే అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.