YSR Vardhanthi: తెలుగు ప్రజలపై చెరగని ముద్ర వైఎస్ఆర్.. ఆయనకు ఎందుకంత క్రేజ్ అంటే?

వైఎస్సార్.. యెడుగూరి సందింటి రాజశేఖర్ రెడ్డి. ఆ పేరులోనే ఒక వైబ్రేషన్ ఉంది. జనం మెచ్చిన మాస్ లీడర్ ఆయన. నిరుపేదల వైద్యుడిగా పేరు. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా జనం చేత నీరాజనం అందుకున్న నాయకుడు.

Written By: Dharma, Updated On : September 2, 2024 9:55 am

YSR Vardhanthi

Follow us on

YSR Vardhanthi: ఉమ్మడి రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో చెరగని ముద్ర వేసుకున్న పవర్ ఫుల్ మాస్ లీడర్ రాజశేఖర్ రెడ్డి. అభిమానులు ముద్దుగా రాజన్న అని పిలుచుకుంటారు. అందుకు తగ్గట్టే ఆయనలో ఆ రాజసం ఉట్టిపడుతుంది. ఆయన చిరునవ్వులో ఆప్యాయత, ఆత్మీయత స్పష్టంగా కనిపిస్తుంది. తెలుగోడి తెగువకు నిలువుటద్దంలా తెల్లటి పంచె కట్టు, అన్నివేళలా ఆకట్టుకునే చిరు దరహాసం, మడమ తిప్పని గుణం, ఎవరికైనా ఎదురెళ్లే మొండి ధైర్యం, సాయం కోరి వచ్చిన వారికి అండగా నిలిచే తత్వం, అభాగ్యులను అక్కున చేర్చుకునే సేవాగుణం.. ఇవన్నీ రాజశేఖర్ రెడ్డిలో స్పష్టంగా కనిపిస్తాయి. ఆయన పాలనను గుర్తు చేసుకుంటే ఎన్నో జ్ఞాపకాలు పుట్టుకొస్తాయి. పాదయాత్రతో ప్రజల్లోకి వెళ్లి.. అదే జనంలో నుంచి వచ్చిన మాస్ లీడర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి. ఆయన వర్ధంతి నేడు. 2009 సెప్టెంబర్ 2న హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన మృతి చెందారు. ఆయన భౌతికంగా దూరమై 15 సంవత్సరాలు గడుస్తున్నా.. తెలుగు ప్రజలు మాత్రం ఆయన సేవలను గుండెల్లో పెట్టుకున్నారు. గుడి కట్టుకొని పూజిస్తున్నారు. నేడు మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ప్రత్యేక కథనం.

* పేదల వైద్యుడిగా గుర్తింపు
కడప జిల్లా పులివెందులలో రాజారెడ్డి, జయమ్మ దంపతులకు 1949, జూలై 8న జన్మించారు రాజశేఖర్ రెడ్డి. చదువులో చురుకుగా ఉండే రాజశేఖరరెడ్డి వైద్యవృత్తిని స్వీకరించారు. పులివెందులలో పేదల వైద్యుడిగా గుర్తింపు పొందారు. తరువాత తండ్రి వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చారు. కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించారు. కానీ తెలుగుదేశం పార్టీ ప్రభంజనంతో కాంగ్రెస్ మూలాలు కూడా కదిలిపోయాయి. అటువంటి సమయంలో నేనున్నాను అంటూ ముందుకు వచ్చారు రాజశేఖర్ రెడ్డి. 2003లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సుదీర్ఘకాలం పాదయాత్ర చేశారు. నేరుగా ప్రజలను కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు.

* ఉమ్మడి రాష్ట్రంలో పాదయాత్ర
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వరకు సుదీర్ఘ పాదయాత్ర చేశారు. ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారికి నేనున్నాను అను భరోసా ఇచ్చారు. టిడిపి ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తు చూపుతూ.. డీలా పడిన కాంగ్రెస్ పార్టీకి కొత్త జ్యూస్ ఇచ్చారు. ఆ పాదయాత్ర ఫలితమే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టారు. 2004 మే 14 న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 14వ ముఖ్యమంత్రిగా రాజశేఖర్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. 2009లో రెండోసారి కూడా గెలిచారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది రోజులకి అకాల మరణం చెందారు.

* సంక్షేమానికి ఆద్యుడు
సంక్షేమానికి ఆద్యుడు గా నిలిచారు రాజశేఖర్ రెడ్డి. తాను ఇచ్చిన హామీ మేరకు రైతులకు ఉచిత విద్యుత్ హామీని నిలబెట్టుకున్నారు. సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత తొలి ఫైల్ పై సంతకం చేశారు. యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టేందుకు జల యజ్ఞానికి శ్రీకారం చుట్టారు. పేద విద్యార్థుల కోసం ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఆరోగ్యశ్రీ పథకం తో పాటు 108 వాహనాలను అందుబాటులోకి తెచ్చారు. పావలా బుడ్డి కే రుణాలు ఇచ్చి మహిళల స్వయం ఉపాధి కి ఊతం ఇచ్చారు. సబ్సిడీపై రెండు రూపాయలకే కిలో బియ్యం అందించి పేదల పెన్నిధిగా నిలిచారు. ఇందిరమ్మ ఇల్లు, అభయహస్తం పథకం వంటి పథకాలతో ప్రజలకు ఎంతో మేలు చేకూర్చారు.

* రెండోసారి సీఎం
2009లో వైయస్ రాజశేఖర్ రెడ్డి రెండోసారి సీఎం అయ్యారు. దీంతో ప్రజలు తమ ఆకాంక్షలు తీరుతాయని భావించారు. కానీ 2009 సెప్టెంబర్ 2న రాజశేఖర్ రెడ్డి అకాల మరణం చెందారు.చిత్తూరు జిల్లాలో రచ్చబండ కోసం అని బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరారు. కానీ పావురాలు గుట్ట వద్ద హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. రాజశేఖర్ రెడ్డి తో పాటు ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. సిక్స్ సీటర్ కెపాసిటీ కలిగిన బెల్ చాపర్ లో బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరిన హెలిక్యాప్టర్ గంట వ్యవధిలోనే నల్లమల అటవీ ప్రాంతంలో ఉండగా కూలిపోయింది. రాజశేఖర్ రెడ్డి భౌతికంగా దూరమై ఈరోజుకు 15 సంవత్సరాలు అవుతోంది.అయినా తెలుగు ప్రజలు ఆయనను స్మరించుకుంటూ ఉన్నారు. మరోసారి ఆ మహానేతకు జోహార్లు అర్పిద్దాం