CM Chandrababu: ఏపీ పరిస్థితులపై ప్రధాని ఆరా.. అర్ధరాత్రి చంద్రబాబు చేసిన సాహసం….

విజయవాడలో వరద బాధిత ప్రాంతాలను ఆదివారం మధ్యాహ్నం బోటులో ప్రయాణించి సందర్శించారు. మళ్లీ ఆదివారం అర్ధరాత్రి 11 గంటల సమయంలోను పర్యటించారు. సింగ్ నగర్ ప్రాంతంలో పర్యటించిన చంద్రబాబు బాధితులకు ఆహార పదార్థాలు అందాయా? అని ఆర్ఆర్ తీశారు.

Written By: Dharma, Updated On : September 2, 2024 10:01 am

CM Chandrababu

Follow us on

CM Chandrababu: ఏపీవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడ్డాయి.బీభత్సం సృష్టించాయి.ముఖ్యంగా కృష్ణా, గుంటూరు జిల్లాలను అస్తవ్యస్తంగా మార్చాయి. భయానక వాతావరణాన్ని సృష్టించాయి. ఈ తరుణంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు ఆదివారం రాత్రి ప్రధాని మోదీ ఫోన్ చేశారు. రాష్ట్రంలో వరద పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.కేంద్ర ప్రభుత్వపరంగా అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం వరద ప్రాంతాల్లో తీసుకుంటున్న సహాయక చర్యలపై చంద్రబాబు మోడీకి వివరించే ప్రయత్నం చేశారు.రాష్ట్రానికి అవసరమైన సహాయ సహకారాలు అందించాలని కేంద్ర ప్రభుత్వ శాఖలకు ఆదేశాలు ఇచ్చినట్లు ప్రధాని మోదీ చంద్రబాబుకు వివరించారు. దీనిపై చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు విజయవాడ కలెక్టరేట్లో చంద్రబాబు రాత్రి బస చేశారు. సాధారణ స్థితికి వచ్చే వరకు అక్కడే ఉంటానని స్పష్టం చేశారు. మరోవైపు వరద ప్రాంతాల్లో అర్ధరాత్రి పర్యటించారు చంద్రబాబు. భద్రతా కారణాల దృష్ట్యా వద్దని వారించినా ఆయన వినలేదు. ప్రధానంగా బుడమేరు వరద బాధితుల కష్టాలను స్వయంగా తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో తీవ్రత చెప్పడంలో అధికారులు విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే స్వయంగా తానే రంగంలోకి దిగారు. వరదల్లో చిక్కుకున్న వారికి పాలు, ఆహారం, తాగునీరు, కొవ్వొత్తులు, టార్చ్లు వెంటనే బాధితులకు అందించాలని ఆదేశించారు. లక్ష మందికి సరిపోయే ఆహారం సరఫరా చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

* ఉదయం, మళ్లీ అర్ధరాత్రి
విజయవాడలో వరద బాధిత ప్రాంతాలను ఆదివారం మధ్యాహ్నం బోటులో ప్రయాణించి సందర్శించారు. మళ్లీ ఆదివారం అర్ధరాత్రి 11 గంటల సమయంలోను పర్యటించారు. సింగ్ నగర్ ప్రాంతంలో పర్యటించిన చంద్రబాబు బాధితులకు ఆహార పదార్థాలు అందాయా? అని ఆర్ఆర్ తీశారు. సీఎం చంద్రబాబు మరోసారి రావడంతో అధికారులు హుటాహుటిన స్పందించి బాధితులందరికీ ఆహార పదార్థాలను అందించారు. బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

* కలెక్టరేట్లో బస
సాధారణంగా సీఎంలు ఏరియల్ సర్వే చేస్తారు. కానీ విపత్తుల విషయంలో చంద్రబాబు చాలా జాగ్రత్తగా ఉంటారు. గతంలో హుద్ హుద్, తితలి తుఫాన్ సమయంలో చంద్రబాబు స్వయంగా ఉత్తరాంధ్రలో ఉండిపోయారు. వారం రోజులపాటు బస్సులోనే బస చేసి సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించేవారు. ఇప్పుడు కూడా విజయవాడ కలెక్టరేట్లో ఉండిపోయారు. అయితే అర్ధరాత్రి బోటు ప్రయాణం భద్రతాపరంగా ఇబ్బంది అని చెప్పినా చంద్రబాబు వినలేదు. వరద నీటిలో చిక్కుకొని అల్లాడుతున్న ప్రజలను నేరుగా కలవాలనుకున్నారు. అదే ప్రయత్నం చేశారు. ఈ ఒక్క రాత్రి ధైర్యంగా ఉండండి. సోమవారానికల్లా మీ అందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించే బాధ్యత తనది అంటూ హామీ ఇచ్చారు.

* హృదయ విదారకం
వరద నీటిలో చిక్కుకున్న కుటుంబాల్లో ప్రతి ఒక్కరిది హృదయ విదారకమైన పరిస్థితి. వాటిని చూస్తుంటే హృదయం పరుక్కుపోతోంది. వారి మనోధైర్యం దెబ్బతినకుండా చర్యలు చేపడతామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆదివారం ఉదయం నుంచి సిఎస్, డిజిపి, కలెక్టర్లు, ఉన్నతాధికారులతో టెలి కాన్ఫరెన్స్ ద్వారా పరిస్థితిని సమీక్షించిన చంద్రబాబు.. అర్ధరాత్రి నేరుగా రంగంలోకి దిగడంతో అధికారుల సైతం ఉత్సాహంతో పని చేశారు.