NTR Death Anniversary: వెండి తెర ఇలవేల్పు స్వర్గీయ నందమూరి తారక రామారావు( Nandamuri Taraka Rama Rao ). సినిమా రంగంలో మకుటం లేని మహారాజుగా ఎదిగారు. అంతటితో ఆగకుండా రాజకీయాల్లోకి వచ్చి ప్రభంజనం సృష్టించారు. ఢిల్లీ కోటలను కదిలించి రాజకీయాల్లో నూతన అధ్యయనానికి నాంది పలికారు నటసార్వభౌమ నందమూరి తారక రామారావు. ఆయన భౌతికంగా దూరమై 29 ఏళ్లు గడుస్తోంది. అయినా ఆయన తెలుగు ప్రజలకు ఒక తీపి గుర్తు. వెలుగు రేడు. ఎన్టీఆర్ అనేది ఒక పేరు కాదు.. ప్రభంజనం.. అదొక సంచలనం.. తెలుగువాడి విశ్వరూపం. వెండితెరపై రారాజుగా వెలుగొందారు. రాజకీయాల్లో మహా నాయకుడిగా రాణించారు. తెలుగుదనానికి ప్రతిరూపంగా నిలిచారు.
* వెండితెర ఇలవేల్పు
తింటే గారెలే తినాలి.. వింటే భారతం వినాలి.. రాముడు,కృష్ణుడు వేషం చేస్తే ఎన్టీఆర్( NTR) మాత్రమే వేయాలి. అన్నంతగా విశ్వవిఖ్యాత నట సార్వభౌముడిగా బిరుదాంకితుడైన ఎన్టీఆర్ అనేక పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాల్లో వైవిధ్య భరితమైన పాత్రలను పోషించి తెలుగు ప్రాక్షకుల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. రాముడు, కృష్ణుడు, దుర్యోధనుడు, రావణాసురుడు, భీముడు, కర్ణుడు ఇలా ఎన్నో పౌరాణిక పాత్రలలో ఒదిగిపోయారు ఎన్టీఆర్. సుమారు నాలుగు వందల చిత్రాల్లో నటించి కేవలం నటుడిగా మాత్రమే కాకుండా నిర్మాతగా, దర్శకుడిగా కళామతల్లికి ముద్దుబిడ్డ అయ్యారు.
* రాజకీయాల్లో ప్రభంజనం రాజకీయాల్లో( politics) అడుగుపెట్టిన ఆయన ఓ ప్రభంజనం సృష్టించారు. ఆయన రాజకీయ యుగం ఓ సువర్ణ అధ్యాయం. ఆయన పిలుపు ఓ నవ్యోపదేశం, ఆయన పలుకు ఓ సంచలనం, ఆయన మాట ఓ తూటా.. ఆయన సందేశమే స్ఫూర్తి. అప్పటివరకు దేవుడిగా కొలిచిన ప్రజలు.. రాజకీయ నేతగాను కీర్తించడం మొదలుపెట్టారు. తెలుగుదేశం పార్టీ శ్రామికుడు చెమట లో నుంచి వచ్చినది. కార్మికుడు కలిగిన కండరాలలో నుంచి వచ్చింది. రైతు కూలీల రక్తం లో నుంచి వచ్చింది. నిరుపేదల కన్నీటిలో నుండి, కష్టజీవుల కంటి మంటల్లో నుంచి పుట్టింది తెలుగుదేశం. రాష్ట్ర ప్రజలారా ఆశీర్వదించండి అంటూ ఎన్టీఆర్ ఇచ్చిన పిలుపు యావత్ ఏపీ ప్రజలను ఆకర్షించింది. 1982 మార్చి 29న హైదరాబాదులో పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు ఎన్టీఆర్. కానీ ఆయన పిలుపునకు కదిలిన ఏపీ జనం 9 నెలల్లో అధికారాన్ని కట్టబెట్టారు. అయితే అది ఎన్టీఆర్ గొప్పతనం. రాజకీయ శున్యతను ముందే పసిగట్టిన ఆయన పార్టీని ఏర్పాటు చేశారు. ఢిల్లీ కోటను బద్దలు కొట్టారు.
* పాలనలో విప్లవం
పాలనలోను విప్లవాత్మక మార్పులు చూపించారు నందమూరి తారక రామారావు( Nandamuri Taraka Rama Rao ). తప్పుడు వాగ్దానాలు, తప్పించుకునే దారిని ఆయన పాలనలో ఏనాడు చూడలేదు. పేదవాడి నా దేవుడు.. సమాజమే నా దేవాలయం అంటూ కాషాయ వస్త్రాలను ధరించి ప్రజా క్షేమమనే దీక్షపునారు ఎన్టీఆర్. తెలుగుదేశం పార్టీ నాలుగు దశాబ్దాల చరిత్రను సొంతం చేసుకుంది అంటే దానికి అంత గట్టిగా పునాది వేసిన ఘనత ఎన్టీఆర్ ది. తెలుగు వాడు ఉన్నంతకాలం తెలుగుదేశం పార్టీ ఉండేలా నిర్మాణం చేపట్టారు. క్రమశిక్షణతో పార్టీని తీర్చిదిద్దారు. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా మనోబలం సమకూర్చారు. నాడు ఆయన చేసిన సంక్షేమ పథకాలు, సాహసోపేతమైన నిర్ణయాలు తెలుగుదేశం పార్టీకి గట్టి పునాదులుగా నిలిచాయి.
* జాతీయ రాజకీయాల్లో ముద్ర
కాంగ్రెస్ పార్టీని( Congress Party) ఢీకొన్న ఎన్టీఆర్ జాతీయ రాజకీయాల్లో సైతం తనదైన ముద్రను చాటుకున్నారు. సుదీర్ఘకాలం జాతీయ రాజకీయాలను శాసించగలిగారు. తెలుగు వాడి సత్తాను ఢిల్లీలో చాటి చెప్పారు. అంతవరకు ఉన్న షీల్డ్ కవర్ల సీఎం సంస్కృతిని మార్చేశారు. రూపాయికే కిలో బియ్యం, గృహ నిర్మాణం వంటి పథకాలతో పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఆ మహనీయుడు టిడిపి అనే బీజాన్ని వేసి.. తెలుగు ప్రజలకు చేరువ చేశారు. తెలుగు వాడు ఉన్నంత కాలం తెలుగుదేశం పార్టీ ఉంటుందని నమ్మారు ఎన్టీఆర్. అయితే ఆయన మరణించి 29 ఏళ్లు అవుతున్న ఇంకా పార్టీ మాత్రం ప్రజల్లో ఉందంటే దానికి కారణం ముమ్మాటికి ఆ మహానేత. మరోసారి ఆయనను గుర్తు చేసుకుంటూ అంజలి ఘటిద్దాం.