Nellore Politics: నెల్లూరులో టిడిపిది బలమా? వైసిపిది స్వయంకృతాపమా?

గత ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో వైసీపీ వైట్ వాష్ చేసింది. ఆనం ఫ్యామిలీ, మేకపాటి ఫ్యామిలీ, నేదురుమల్లి ఫ్యామిలీ, వేమిరెడ్డి ఫ్యామిలీ.. ఇలా బలమైన కుటుంబాలన్నీ వైసిపి కి అండగా నిలిచాయి.

Written By: Dharma, Updated On : April 11, 2024 12:26 pm

Nellore Politics

Follow us on

Nellore Politics: వైసీపీకి రాయలసీమతో సమానంగా ఆదరిస్తున్న జిల్లా నెల్లూరు. పార్టీ ఆవిర్భావం నుంచి జగన్ వెంట నడిచిన జిల్లా కూడా ఇదే. 2014 ఎన్నికల్లో పది నియోజకవర్గాలకు గాను ఎనిమిది చోట్ల,2019 ఎన్నికల్లో పదికి పది నియోజకవర్గాలను వైసీపీ గెలుచుకుంది. అయితే ఈసారి ఆ హవా ఉంటుందా? లేదా? అన్న బలమైన చర్చ నడుస్తోంది.గత రెండు ఎన్నికల్లో కలిసి వచ్చిన ఏ అంశాలు.. ఈ ఎన్నికల్లో వైసీపీకి కనిపించడం లేదు. బలమైన రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబాలన్నీ వైసీపీకి దూరమయ్యాయి. జగన్ చేజేతులా దూరం చేసుకున్నారు. దీంతో నెల్లూరులో వైసీపీకి దారుణ దెబ్బ తప్పదన్న విశ్లేషణలు ప్రారంభమయ్యాయి.

గత ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో వైసీపీ వైట్ వాష్ చేసింది. ఆనం ఫ్యామిలీ, మేకపాటి ఫ్యామిలీ, నేదురుమల్లి ఫ్యామిలీ, వేమిరెడ్డి ఫ్యామిలీ.. ఇలా బలమైన కుటుంబాలన్నీ వైసిపి కి అండగా నిలిచాయి. పదికి పది సీట్లు గెలుచుకునేలా దోహదపడ్డాయి. కానీ ఎన్నికల్లో మిగిలింది ఒక్క మేకపాటి ఫ్యామిలీ మాత్రమే. అయితే ఆ ఫ్యామిలీలో మేకపాటి గౌతంరెడ్డి చనిపోవడం, చంద్రశేఖర్ రెడ్డి కుటుంబానికి దూరం కావడం మైనస్ గా మారింది. వయోభారంతో రాజమోహన్ రెడ్డి బాధపడుతుండడంతో ఆయన సైతం చురుగ్గా ప్రచారంలో పాల్గొనలేకపోతున్నారు. తమ కుటుంబానికి ఇచ్చిన ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గాలను గెలిపించుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. అక్కడ ఈసారి వైసీపీకి దెబ్బ తప్పదు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.

నెల్లూరు సిటీలో మాజీ మంత్రి నారాయణ పోటీ చేస్తుండడంతో వార్ వన్ సైడ్ గా కనిపిస్తోంది. గత ఎన్నికల్లో ఆయన కేవలం 700 ఓట్ల తేడాతోనే ఓడిపోయారు. రూరల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఏకపక్ష విజయం సాధించనున్నారు అన్న విశ్లేషణలు ఉన్నాయి. కోవూరులో ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ వ్యవహార శైలితో వైసీపీ ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటుంది. ఇక్కడ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి భార్య ప్రశాంతి రెడ్డి పోటీ చేస్తున్నడంతో సీన్ మారింది. అంతటా అనుకూలంగా టిడిపికి మారిపోయింది. వెంకటగిరిలో సైతం టిడిపి వైపు మొగ్గు కనిపిస్తోంది. ఆనం మద్దతు పుష్కలంగా లభిస్తుండడంతో కూటమిదే పై చేయిగా కనిపిస్తోంది. కావలిలో రామిరెడ్డి నిర్వాకాలపై ప్రజల్లో అసంతృప్తి ఉంది. అక్కడ టిడిపి అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి దూసుకెళ్తున్నట్లు తెలుస్తోంది.

వైసీపీ నుంచి టీడీపీలోకి వేంరెడ్డి దంపతులు వచ్చిన తర్వాత పూర్తిగా సీన్ మారిపోయింది. ఆయనేమీ మాస్ లీడర్ కాదు. అయినా సరే ఆయనతోపాటు వైసీపీ క్యాడర్ భారీగా టిడిపిలో చేరింది. చివరి నిమిషంలో అభ్యర్థి దొరకకపోవడంతో విజయసాయిరెడ్డిని జగన్ బరిలో దించాల్సి వచ్చింది. అటు విజయ్ సాయి రెడ్డికి సైతం గెలుపు పై పెద్దగా హోప్స్ లేనట్లు తెలుస్తోంది. అయితే నెల్లూరులో నష్టాన్ని ఊహించిన వైసిపి కొత్త ప్రచారాన్ని తెరతీసింది. వేమిరెడ్డి దంపతులు తిరిగి వైసీపీలో చేరనున్నట్లు ప్రచారం ప్రారంభించారు. దానిపై వేమిరెడ్డి దంపతులు స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు. అయితే ఈసారి ఎన్ని చేసినా నెల్లూరులో వైసీపీకి ప్రతికూల ఫలితాలు తప్పవని తెలుస్తోంది. 10 సీట్లకు గాను ఒకటి రెండు చోట్ల గెలుపొందితే.. అదే భాగ్యమన్న నిర్ణయానికి వైసిపి వచ్చినట్లు సమాచారం. అయితే ఇక్కడ టిడిపి బలపడింది అనే దానికంటే వైసిపి స్వయంకృతాపమే ఎక్కువగా కనిపిస్తోంది.