Tammineni Sitaram: ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం కు వచ్చే ఎన్నికల్లో టికెట్ లేనట్టేనా? మార్పు జాబితాలో ఆయన పేరు ఉందా? సీతారామును శ్రీకాకుళం ఎంపీగా పోటీ చేయిస్తారా? అందుకు ఆయన సమ్మతిస్తారా? పోటీలో దిగితే గెలిచే ఛాన్స్ ఉందా? ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. ఆమదాల వలస నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న తమ్మినేని సీతారాం సుదీర్ఘ విరామం తర్వాత గత ఎన్నికల్లో గెలుపొందారు. జగన్ క్యాబినెట్లో మంత్రి పదవిని ఆశించారు. కానీ అనూహ్యంగా ఆయనకు స్పీకర్ పదవి దక్కింది. మొన్నటి విస్తరణలో సైతం మంత్రి పదవి ఆశించినా దక్కలేదు.
అయితే తాజాగా రాష్ట్రవ్యాప్తంగా 80 మంది అభ్యర్థులను జగన్ మార్చనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో తమ్మినేని సీతారాం పేరు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన నియోజకవర్గంలో ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నట్లు జగన్కు నివేదికలు అందినట్లు సమాచారం. దీనికి తోడు ఆయన సొంత పార్టీలోనే అసమ్మతిని ఎదుర్కొంటున్నారు. ఆయనకు వ్యతిరేకంగా రెండు బలమైన వర్గాలు నియోజకవర్గంలో నడుస్తున్నాయి. వారితో సమన్వయం చేసుకోవాలని జగన్ పలుమార్లు తమ్మినేని సీతారాం కు సూచించారు. ఆయన ఆ ప్రయత్నం చేయకపోవడంతో.. ఇప్పుడు టిక్కెట్ కు ఎసరు వచ్చిందని టాక్ నడుస్తోంది.
ఆమదాలవలస అసెంబ్లీ నియోజకవర్గంలో కొత్త అభ్యర్థిని బరిలో దించి.. తమ్మినేని సీతారాంకు శ్రీకాకుళం పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయించడానికి జగన్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. అయితే తమ్మినేని సీతారాం అందుకు విముఖత చూపుతున్నట్లు తెలుస్తోంది. ఆమదాలవలస నుంచి తనకు కానీ.. తన కుమారుడు కానీ టిక్కెట్ ఇవ్వాలని ఆయన పట్టుబడుతున్నారు. వ్యతిరేకవర్గమైన సువ్వారి గాంధీ, చింతాడ రవికుమార్ తదితరులు తమ్మినేని కి టికెట్ ఇస్తే పని చేసేది లేదని తేల్చి చెబుతున్నారు. దీంతో జగన్ లో పునరాలోచన ప్రారంభమైంది. తమ్మినేని మార్పున కే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.
ఒకవేళ శ్రీకాకుళం పార్లమెంట్ స్థానం నుంచి తమ్మినేని సీతారాం పోటీ చేస్తే గట్టి పోటీ ఇస్తారని హై కమాండ్ భావిస్తోంది. కానీ వర్గ రాజకీయాల పుణ్యమా అని టిడిపికి వన్ సైడ్ అవుతుందని టాక్ నడుస్తోంది. ఇప్పటికే శ్రీకాకుళం ఎంపీగా రెండుసార్లు కింజరాపు రామ్మోహన్ నాయుడు గెలుపొందారు. నియోజకవర్గంలో పట్టు సాధించారు. గత ఎన్నికల్లో పార్లమెంట్ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను.. ఐదు చోట్ల ఓడిపోయింది. కేవలం రెండు చోట్ల మాత్రమే విజయం సాధించింది. కానీ ఎంపీగా మాత్రం రామ్మోహన్ నాయుడు 10,000 ఓట్లతో గెలుపొందారు. దాదాపు అన్ని నియోజకవర్గాల్లో క్రాస్ ఓటింగ్ జరిగింది. దీంతో ఇక్కడ పోటీ అంటేనే వైసిపి నేతలు భయపడిపోతున్నారు. ఈ తరుణంలో శ్రీకాకుళం ఎంపీ స్థానం నుంచి పోటీ చేసేందుకు తమ్మినేని సీతారాం వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ టిక్కెట్ల వివాదాన్ని జగన్ ఎలా పరిష్కరిస్తారో చూడాలి.