Tammineni Sitaram: స్పీకర్ తమ్మినేని సీతారాం ఎదురీదు తున్నారు. మరోసారి ఆయన ఆముదాలవలస అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయనకు సొంత పార్టీలోనే వ్యతిరేక వర్గాలు ఉన్నాయి. గత ఐదు సంవత్సరాలుగా కొనసాగుతూ వచ్చాయి. ఆయనకు టిక్కెట్ ఇస్తే ఓడిస్తామని కూడా హెచ్చరించాయి. కానీ హై కమాండ్ మాత్రం తమ్మినేని సీతారాంకి టికెట్ కట్టబెట్టింది. దీంతో ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సీనియర్ నాయకుడు సువ్వారి గాంధీ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇండిపెండెంట్ గా బరిలోకి దిగుతానని ప్రకటించారు. తమ్మినేని సీతారాం ను ఓడిస్తానని ప్రతిన బూనారు. మిగతా మరో మూడు వర్గాలు వ్యతిరేకిస్తుండడంతో తమ్మినేని డేంజర్ జోన్ లో పడ్డారు. అక్కడ వైసీపీకి ప్రతికూల ఫలితం తప్పదని సంకేతాలు వస్తున్నాయి.
తమ్మినేని సీతారాం సీనియర్ నాయకుడు. తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలం పనిచేశారు. ఎన్టీఆర్ తో పాటు చంద్రబాబు ప్రభుత్వంలో కీలక మంత్రి పదవులు చేపట్టారు. 2004 ఎన్నికల్లో సిట్టింగ్ మంత్రిగా ఉంటూ ఓడిపోయారు. 2019 వరకు వరుసగా ఓటమి పాలవుతూ వచ్చారు. 2004 ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2009లో చిరంజీవి నేతృత్వంలోని ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఆ పార్టీ తరఫున పోటీ చేశారు. అక్కడ కూడా ఓటమి తప్పలేదు. అనంతరం తెలుగుదేశం పార్టీలో చేరారు. టిడిపిని వీడి తప్పు చేశానని.. కట్టె కాలే వరకు తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. 2014 ఎన్నికల్లో టిడిపి ఆయనకు టికెట్ ఇవ్వలేదు. దీంతో ఆయన వైసీపీలోకి వెళ్లిపోయారు. ఆ ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేశారు. మళ్లీ ఓటమి ఎదురైంది. 2019 ఎన్నికల్లో మరోసారి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించగలిగారు తమ్మినేని.
అయితే ఈ ఎన్నికల్లో తమ్మినేనిని మార్చి కొత్త అభ్యర్థిని వైసిపి బరిలో దించుతుందని అంతా భావించారు. దీనిపై అసమ్మతి నాయకులు ఎప్పటికప్పుడు హైకమాండ్ కు ఫిర్యాదులు చేశారు. తమ్మినేనిని మార్చితేనే వైసిపి విజయం సాధిస్తుందని చెప్పుకొచ్చారు. అయినా హై కమాండ్ వినలేదు. పైగా అసమ్మతి నాయకులను నోరు మూయించే ప్రయత్నం తమ్మినేని చేశారు. వారి పార్టీ పదవులను తొలగించారు. పార్టీలో వారికి ఎటువంటి హోదాలు లేకుండా చేశారు. దీంతో మాజీ ఎంపీపీ సువారి గాంధీ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్ పర్సన్ సువర్ణ తో పాటు వారి వర్గీయులు పార్టీకి రాజీనామా చేశారు. గాంధీ ఇండిపెండెంట్ గా పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో వైసీపీ క్యాడర్ సైతం గాంధీకి సహకరిస్తోంది. బాహటంగానే మద్దతు తెలుపుతోంది. తమ్మినేని కానీ.. హై కమాండ్ కానీ దిద్దుబాటు చర్యలు చేపట్టడం లేదు. దీంతో ఇక్కడ వైసిపికి ప్రతికూల పరిస్థితులు తప్పవని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు జనసేన తో పాటు బిజెపి సైతం ఇక్కడ యాక్టివ్ గా ఉంది. అందుకే ఇక్కడ కూటమి అభ్యర్థి తప్పకుండా గెలుపొందుతారని సర్వత్ర వినిపిస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.