Chandrababu cabinet expansion: ఏపీలో( Andhra Pradesh) రాజకీయ సంచలనం రేగనుందా? చంద్రబాబు క్యాబినెట్ ను విస్తరించనున్నారా? 8 మంది మంత్రులను మార్చనున్నారా? స్పీకర్ తో పాటు డిప్యూటీ స్పీకర్ మార్పు ఉంటుందా? ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. ఇటీవల కాలంలో మంత్రివర్గ విస్తరణ ఉంటుంది అనేది బలమైన చర్చగా కొనసాగుతోంది. క్యాబినెట్లో చాలామంది మంత్రుల తీరుపై సీఎం చంద్రబాబు అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. పలుమార్లు చంద్రబాబు హెచ్చరికలు కూడా జారీ చేశారు. మారండి లేకపోతే మార్చేస్తానంటూ హెచ్చరించారు. అయినా సరే వారి పనితీరులో మార్పు రాకపోవడంతో ఇప్పుడు మార్పుకు సిద్ధపడుతున్నారని మీడియా కథనాలు వస్తున్నాయి. ముఖ్యంగా జూనియర్లతో క్యాబినెట్ ఏర్పాటు ప్రయోగం విఫలమయింది అన్న భావన సీఎం చంద్రబాబు లో ఉన్నట్లు తెలుస్తోంది.
కొత్తగా గెలిచిన వారికి ఛాన్స్..
శ్రీకాకుళం( Srikakulam ) నుంచి అనంతపురం వరకు సీనియర్లను పక్కనపెట్టి జూనియర్లకు అవకాశం ఇచ్చారు చంద్రబాబు. కేవలం లోకేష్ నాయకత్వాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా జూనియర్లకు ఛాన్స్ ఇచ్చారన్నది విశ్లేషకుల అభిప్రాయం. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు దాదాపు 15 మంది సీనియర్లు మంత్రి పదవులకు ఎదురు చూశారు. కానీ వారిని కాదని ఆయా జిల్లాల్లో ఉన్న జూనియర్లకు అవకాశం వచ్చింది. కళా వెంకట్రావు, గంటా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణమూర్తి, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, యనమల రామకృష్ణుడు, జ్యోతుల నెహ్రూ, నిమ్మకాయల చినరాజప్ప, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, పరిటాల సునీత, జెసి ఫ్యామిలీ నుంచి.. ఇలా చాలామంది నేతలు పదవులు ఆశించారు. కానీ దక్కలేదు.
Also Read: మంత్రివర్గ విస్తరణ.. చంద్రబాబు వ్యూహం అదే!
తెరపైకి సీనియర్ల ఫార్ములా..
అయితే జూనియర్ ఫార్ములా దెబ్బతినడంతో ఇప్పుడు సీనియర్లను తెరపైకి తేనున్నట్లు ప్రచారం నడుస్తోంది. ప్రధానంగా ఉత్తరాంధ్రలో( North Andhra ) ఇద్దరు మంత్రుల ఉద్వాసన తప్పదని తెలుస్తోంది. గోదావరి జిల్లాల నుంచి మరో ఇద్దరిని తప్పిస్తారని సమాచారం. రాయలసీమతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాల నుంచి ఓ నలుగురిని తప్పిస్తారని కూడా ప్రచారం జరుగుతోంది. అంటే ఎనిమిది మంది మంత్రుల ఉద్వాసన తప్పదని తేలింది. ఇప్పటికే ఒక మంత్రి పదవి క్యాబినెట్లో ఖాళీగా ఉంది. అంటే మొత్తం తొమ్మిది మంత్రి పదవులకు గాను.. ఒకటి జనసేనతో పాటు మరొకటి బిజెపికి కేటాయించే అవకాశం ఉంది. అంటే ఏడు మంత్రి పదవులను టిడిపి సీనియర్లకు దక్కే ఛాన్స్ కనిపిస్తోంది.
ఆ ఇద్దరిని తొలగింపు..
అయితే మరోవైపు స్పీకర్ తో( speaker) పాటు డిప్యూటీ స్పీకర్ సైతం క్యాబినెట్ లోకి వెళ్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆది నుంచి మంత్రి పదవి పై ఆశలు పెట్టుకున్నారు. కానీ అనూహ్యంగా ఆయనకు స్పీకర్ పదవి కట్టబెట్టి నోరు మూయించారన్న వ్యాఖ్యలు వినిపించాయి. ఎందుకంటే అయ్యన్నపాత్రుడు రాజకీయంగా చాలా దూకుడుగా ఉండేవారు. ఆయనకు మంత్రి పదవి ఇస్తే విపక్షంపై ఓ రేంజ్ లో ప్రతాపం చూపుతారని ఒక కామెంట్ ఉంది. మరోవైపు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజుకు సైతం క్యాబినెట్లోకి తీసుకుంటారని.. ఆయన స్థానంలో గోరంట్ల బుచ్చయ్య చౌదరికి డిప్యూటీ స్పీకర్ పదవి ఇస్తారని మరో టాక్ ఉంది. అయితే స్పీకర్ గా బీసీ వర్గానికి చెందిన నేతను తీసుకుంటారని.. అయ్యన్నపాత్రుడుకు మంత్రి పదవి ఖాయమని జోరుగా ప్రచారం సాగుతోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.