Balayya Unstoppable Yatra : పవన్ వారాహి యాత్ర ఈ నెల 14న ప్రారంభంకానుంది. అన్నవరం టూ భీమవరం యాత్రకు పవన్ రెడీ అవుతున్నారు. ఇందుకు సంబంధించి జనసేన నాయకత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ యాత్రతో ఏపీలో పొలిటికల్ హీట్ పెరగనుంది. ఈ హీట్ ఉండగానే మరో యాత్రకు వడివడిగా అడుగులు పడుతున్నట్టు సమాచారం. ఇప్పటికే టీడీపీ, జనసేనల మధ్య పొత్తు కుదిరినట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో రెండు పార్టీలకు ఉభయతారకంగా ఉండేలా మరో స్టార్ క్యాంపెయినర్ ను చంద్రబాబు సిద్ధం చేస్తున్నట్టు సమాచారం.
నందమూరి బాలక్రిష్ణతో ఒక యాత్రకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే లోకేష్ పాదయాత్ర రాయలసీమలో జరుగుతోంది. చిత్తూరు, అనంతపురం, కర్నూలులో పూర్తయ్యింది. ప్రస్తుతం కడప జిల్లాలో జరుగుతోంది. మరో పక్షం రోజుల్లో పూర్తికానుంది. లోకేష్ పాదయాత్రతో రాయలసీమలో రాజకీయ సమీకరణలు మారాయి. అయినా ఆ శక్తి చాలదని చంద్రబాబు భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే బాలయ్యతో రాయలసీమలో యాత్రకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
రాయలసీమలో బాలక్రిష్ణకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన సినిమాలు కూడా అక్కడ రికార్డుల ను బద్ధలు కొడుతూ వచ్చాయి. దాంతో వైసీపీ కి హార్డ్ కోర్ రీజియన్ గా ఉన్న రాయలసీమ ను బద్దలు కొట్టాలంటే బాలయ్యని రంగం లోకి దించాలన్నది చంద్రబాబు ఎత్తుగడగా కనిపిస్తోంది. బాలయ్య సైతం ఈసారి హిందూపురాని కే పరిమితం కాకుడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఏపీ లో టీడీపీ ని అధికారం లోకి తీసుకుని రావాలని చూస్తున్నారు. ఇప్పటికే హిందూపురంలో బాలక్రిష్ణకు పాజిటివ్ టాక్ ఉంది. అందుకే ఈసారి రాయలసీమ జిల్లాల్లో ఫోకస్ పెంచుతారని తెలుస్తోంది.
వైసీపీకి ఈసారి రాయలసీమ లో సీట్లు తగ్గుతాయని విశ్లేషణలు వెలువడుతున్నాయి. 2019 ఎన్నికల్లో 52 సీట్లకు గానూ 49 సీట్ల ను వైసీపీ గెలుచుకుంది. మూడంటే మూడు సీట్లు టీడీపీ కి వచ్చాయి. ఇపుడు మాత్రం అంత దారుణంగా టీడీపీ పరిస్థితి ఉండదు అంటున్నారు. ముఖ్యంగా ఉమ్మడి అనంతపురంతో పాటు కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో సీట్లు పెరుగుతాయని చెబుతున్నారు. రాయలసీమలో మరిన్ని సీట్లు సాధించేందుకు చంద్రబాబు వ్యూహరచన చేస్తున్నారు. అందు కోసం బాలక్రిష్ణ సేవలను వినియోగించుకోవాలని చూస్తున్నారు. అన్నీ కుదిరితే వీలైనంత త్వరగా సినిమాలు ముగించుకొని డిసెంబరులో యాత్రకు బాలయ్య సిద్ధమవుతారని సమాచారం.