Madhanapalle : మాయమవుతున్న మానవ సంబంధాలు.. ఆస్తి కోసం తండ్రిపై కారెక్కించాడు!

 మదనపల్లె పుల్లారెడ్డి వీధికి చెందిన మీరుగట్టు చిన్నరెడ్డప్ప రెడ్డికి ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు రఘునాథరెడ్డి ఓ ప్రైవేట్ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేసేవాడు. ప్రస్తుతం ఖాళీగా ఉన్నాడు. చిన్న కుమారుడు శంకర్ రెడ్డి సాఫ్ట్వేర్ ఇంజనీర్. పెద్ద కుమారుడు రఘునాథరెడ్డి జల్సాలకు అలవాటు పడ్డాడు. ఆన్లైన్ ట్రేడింగ్ చేస్తూ 16 లక్షల వరకు అప్పుల పాలయ్యాడు. అప్పుల వేధింపులు ఎక్కువ కావడంతో తన తండ్రిని ఆస్తిలో వాటా ఇవ్వాలని కోరాడు. గత కొంతకాలంగా ఈ పంచాయతీ నడుస్తోంది.

Written By: Dharma, Updated On : July 18, 2024 12:07 pm
Follow us on

Madhanapalle : మానవ సంబంధాలు మంటగలుస్తున్నాయి. ఆర్థికపరమైన విభేదాలు ప్రాణాలను బలిగొంటున్నాయి. ఆస్తి వివాదాలు పచ్చని కుటుంబాల్లో చిచ్చు రేపుతున్నాయి. హత్యలకు, అఘాయిత్యాలకు పురిగొల్పుతున్నాయి. మొన్న ఆ మధ్యన ప్రేమ వివాహానికి అడ్డంకి గా ఉన్నాడని తండ్రినే కడ తేర్చింది ఓ కుమార్తె. జల్సాలకు అలవాటు పడిన కుమారుడిని వద్దని వారించినందుకు తండ్రిని హత్య చేశాడు ఓ యువకుడు. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తనే హత్య చేయించింది ఓ భార్య.. ఇలా చెప్పుకుంటూ పోతే.. ప్రతిరోజు ఏదో ఒక చోట ఇటువంటి ఘటన జరుగుతూనే ఉంది. తాజాగా అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఇటువంటి ఘటనే ఒకటి జరిగింది. ఆస్తి కోసం తండ్రిని కారుతో ఢీ కొట్టించి హత్య చేశాడు ఓ యువకుడు. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.
 మదనపల్లె పుల్లారెడ్డి వీధికి చెందిన మీరుగట్టు చిన్నరెడ్డప్ప రెడ్డికి ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు రఘునాథరెడ్డి ఓ ప్రైవేట్ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేసేవాడు. ప్రస్తుతం ఖాళీగా ఉన్నాడు. చిన్న కుమారుడు శంకర్ రెడ్డి సాఫ్ట్వేర్ ఇంజనీర్. పెద్ద కుమారుడు రఘునాథరెడ్డి జల్సాలకు అలవాటు పడ్డాడు. ఆన్లైన్ ట్రేడింగ్ చేస్తూ 16 లక్షల వరకు అప్పుల పాలయ్యాడు. అప్పుల వేధింపులు ఎక్కువ కావడంతో తన తండ్రిని ఆస్తిలో వాటా ఇవ్వాలని కోరాడు. గత కొంతకాలంగా ఈ పంచాయతీ నడుస్తోంది.
 ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి మరోసారి వారి మధ్య వివాదం జరిగింది. భోజనం ముగిసాక సమీపంలోని వాకింగ్ ట్రాక్ పై చిన్న రెడ్డప్ప రెడ్డి నడుస్తూ వెళ్తున్నాడు. ఆస్తి విషయమై రఘునాథ్ రెడ్డి అడగడంతో వివాదం నెలకొంది. దీంతో తీవ్ర కోపోద్రిక్తుడైన రఘునాథ్ రెడ్డి తన కారుతో తండ్రిని ఢీకొట్టాడు. తర్వాత అక్కడ నుంచి వెళ్లిపోయాడు. విషయాన్ని బెంగుళూరులో ఉన్న సోదరుడికి ఫోన్ చేసి చెప్పాడు. శంకర్ రెడ్డి స్థానికంగా ఉన్న బంధువులకు సమాచారం ఇవ్వడంతో  పాటు పోలీసులకు ఫోన్ చేసి చెప్పాడు. దీంతో వారు రాత్రంతా గాలింపు చర్యలు చేపట్టారు. గురువారం తెల్లవారుజామున పట్టణంలోని వీవర్స్ కాలనీ సమీపంలో నిర్మానుష్య ప్రాంతంలో చిన్న రెడ్డప్ప మృతదేహాన్ని గుర్తించారు. ఢీ కొట్టిన కారును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 ఇటీవల ఇటువంటి ఘటనలు జరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. పిల్లలు పెడదోవ పట్టి తల్లిదండ్రులను హింసిస్తున్నారు. ఆన్లైన్ జూదాలకు అలవాటు పడి  అప్పుల పాలవుతున్నారు. తరువాత ఆస్తుల కోసం తల్లిదండ్రులపై పడుతున్నారు. ఈ క్రమంలో క్షణికావేశానికి గురై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. మదనపల్లిలో జరిగిన ఘటన ఇలాంటిదే. ఇంకోవైపు పరువు హత్యలు సైతం ఎక్కువగా జరుగుతున్నాయి. ప్రేమ పేరిట వంచనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో హత్యలు, ఆత్మహత్యలు పరిపాటిగా మారాయి.
 క్షణికావేశంలో చాలామంది నిందితులుగా మారుతున్నారు. అయినవారిని కోల్పోతున్నారు. తాము జైలు పాలు కావడంతో కుటుంబాలు సైతం వీధిన పడుతున్నాయి. విభేదాలతో కుటుంబాలే విచ్ఛిన్నమవుతున్నాయి. అందుకే ఎటువంటి ఘటనలు జరిగినా సంయమనంతో వ్యవహరించాలని నిపుణులు సూచిస్తున్నారు. లేకుంటే తామే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.