Somu Veerraju
Somu Veerraju: రాజకీయ అవసరాలే నేతలను మార్చేస్తాయి. అవసరానికి తగ్గట్టు నేతలు మాట్లాడడం పరిపాటి కూడా. దీనికి అతీతుడు కాదు బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు( MLC Somu Veer Raju) . ఎందుకంటే ఆయన వైఖరి మారింది. కూటమి తరుపున ఆయనకు ఎమ్మెల్సీ స్థానం దక్కింది. మొన్న ఎమ్మెల్యేల కోటా కింద 5 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నిక జరిగిన సంగతి తెలిసిందే. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి బలం లేకపోవడంతో ఆ ఐదు స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. అందులో ఒకరు సోము వీర్రాజు. చివరి నిమిషంలో ఆయన ఎమ్మెల్సీ పదవి పొందారు. ఏప్రిల్ 1 నుంచి ఆయన అధికారికంగా ఎమ్మెల్సీ కానున్నారు. కానీ అంతకంటే ముందే యాక్షన్ లోకి దిగుతున్నారు. తాను పూర్తిగా మారిపోయానని సంకేతాలు ఇస్తున్నారు.
Also Read: చిక్కుల్లో తమ్మినేని.. ఏపీ ప్రభుత్వం సీరియస్!
* వైసిపి అనుకూల ముద్ర
ఎవరు అవునన్నా కాదన్నా.. సోము వీర్రాజు తెలుగుదేశం( Telugu Desam) పార్టీని తీవ్రంగా వ్యతిరేకించేవారు. ఆయన ఏపీ బీజేపీ చీఫ్ గా ఉన్న సమయంలో అధికార పార్టీగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉండేది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండేవారు. అటువంటి సమయంలో ప్రతిపక్షంగా బిజెపి అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయాలి. జగన్మోహన్ రెడ్డిని ఎక్కువగా విమర్శించాలి. కానీ సోము వీర్రాజు ఆ పని చేసేవారు. జగన్మోహన్ రెడ్డి పై విమర్శలు చేసేవారు. అవి చాలా వరకు సుతిమెత్తగా ఉండేవి. కానీ చంద్రబాబుతో పాటు టిడిపి విషయానికి వచ్చేసరికి మాత్రం కఠినంగా ఉండేవి. ఆపై టిడిపి తో పొత్తు వద్దే వద్దు అనేవారు సోము వీర్రాజు.
* ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పై..
ఇప్పుడు సీన్ కట్ చేస్తే అదే సోము వీర్రాజు జగన్మోహన్ రెడ్డికి( Y S Jagan Mohan Reddy ) సవాల్ విసురుతున్నారు. 40% ఓట్లు ఉన్నాయని మాట్లాడుతున్నారని.. వచ్చే ఎన్నికల నాటికి నాలుగు శాతం ఓట్లకు పడేస్తామని సవాల్ చేస్తున్నారు. దీంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. సోము వీర్రాజు ఏంటి ఇంతలా మారిపోయారు అని చర్చించుకుంటున్నాయి. అయితే సోము వీర్రాజు మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. మీడియా కనిపిస్తే చాలు జగన్మోహన్ రెడ్డి పై అదే స్థాయిలో విమర్శలు కొనసాగిస్తూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా ఇస్తేనే శాసనసభలో అడుగు పెడతానని చెప్పడాన్ని తప్పుపడుతున్నారు. 2014లో ప్రతిపక్ష నేత హోదా ఉన్నా సరే ఎందుకు శాసనసభకు వెళ్లలేదని ప్రశ్నిస్తున్నారు సోము. ఇలా లాజిక్కులతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డిని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. మున్ముందు విమర్శలు ఎక్కువగా ఉంటాయని సంకేతాలు పంపిస్తున్నారు.
* అప్పట్లో టిడిపి టార్గెట్
బిజెపి చీఫ్ గా ఉండేటప్పుడు సోము వీర్రాజు టిడిపిని టార్గెట్ చేసుకున్నారు. ఆయన ఉంటే బీజేపీ( BJP) టిడిపితో పొత్తు పెట్టుకునేది కాదని కూడా కామెంట్స్ వినిపిస్తున్నాయి. అన్నింటికీ మించి ఆయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైన నేతగా ముద్ర పడిపోయారు. ఆ కారణంగానే మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఎటువంటి టిక్కెట్ దక్కలేదు ఆయనకు. అయితే ఈ ఐదేళ్లపాటు ఆయనకు ఎటువంటి పదవులు కూడా దక్కవని అంతా భావించారు. కానీ చివరి నిమిషంలో బిజెపి తరఫున ఎమ్మెల్సీగా ఎంపికయ్యారు. దీని వెనుక ఆయనకు బిగ్ టాస్క్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. జగన్మోహన్ రెడ్డి పై స్ట్రాంగ్ విమర్శలు చేయడానికి సోము వీర్రాజును ఎమ్మెల్సీ చేశారని ప్రచారం జరుగుతోంది. మరి ఆ ప్రచారంలో ఎంత నిజం ఉందో తెలియాలి.
Also Read: కొత్త రేషన్ కార్డుల పై బిగ్ అప్డేట్.. జారీ అప్పుడే!