Smart Ration Cards In AP: ఏపీలో( Andhra Pradesh) రేషన్ కార్డుల జారీకి సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. ఈనెల 25 నుంచి కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభం కానుంది. అయితే ఇప్పటివరకు అందించిన రేషన్ కార్డులకు భిన్నంగా ఇది ఉండనుంది. స్మార్ట్ కార్డుల తరహాలో రేషన్ కార్డును అందించనుంది ఏపీ ప్రభుత్వం. కొత్తగా ఇవ్వనున్న స్మార్ట్ కార్డులు ఏటీఎం కార్డు పరిమాణంలో ఉండనున్నాయి. ఇందులో ఒకవైపు ప్రభుత్వ అధికారిక చిహ్నం, కార్డుదారు ఫోటో, కార్డు నెంబర్, రేషన్ షాప్ నంబర్ ఉంటాయి. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఇప్పటికే వీటి ముద్రణ ప్రారంభమైంది. గత ప్రభుత్వం అందించిన బియ్యం కార్డుల పై ఆ పార్టీ రంగులు, నాయకుల ఫోటోలు ముద్రించారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి. అందుకే ఈసారి ఎటువంటి ఫోటోలు లేకుండా స్మార్ట్ కార్డులు అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈనెల 25 నుంచి వీటి పంపిణీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి.
Also Read: శభాష్ సిరాజ్.. తండ్రి కష్టానికి గుర్తింపు తెచ్చావ్.. దేశాన్ని సగర్వంగా నిలబెట్టావ్!
* అవే పథకాలకు ప్రామాణికం
ప్రభుత్వ సంక్షేమ పథకాలకు( government welfare schemes) రేషన్ కార్డులే ప్రామాణికంగా ఉన్నాయి. అయితే గత మూడేళ్లుగా రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ జరగలేదు. దీంతో లక్షలాదిమంది అర్హులు ఆశగా ఎదురు చూశారు. ముఖ్యంగా కుటుంబాల నుంచి విడిపోయిన వారు, కొత్తగా పెళ్లయిన వారికి రేషన్ కార్డులు అందలేదు. పేర్లు తొలగింపు, పిల్లల చేర్పులు కూడా కష్టంగా మారాయి. అందుకే కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. కొత్త రేషన్ కార్డుల జారీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చిరునామా మార్పులు, సభ్యుల చేర్పులు, తొలగింపు, కొత్త కార్డులు, విభజనలకు అవకాశం ఇచ్చింది. మే 7 నుంచి సచివాలయాల్లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం అయ్యింది. అవన్నీ కొలిక్కి రావడంతో స్మార్ట్ కార్డుల తరహాలో రేషన్ కార్డులు అందించేందుకు సన్నాహాలు ప్రారంభించింది.
* వారం రోజులపాటు పంపిణీ..
రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 25 నుంచి 31 వరకు కొత్త స్మార్ట్ కార్డులు( Smart cards ) పంపిణీ చేయనున్నారు. కార్డుల ముద్రణకు నెల క్రితమే టెండర్లు పూర్తయ్యాయి. చెన్నైలో కార్డుల ముద్రణ జరుగుతోంది. వాటిని నేరుగా మండల కేంద్రాలకు పంపుతున్నారు. ఈ కార్డులపై నేతల ఫోటోలు ఉండవు. బ్యాంకు కార్డులు మాదిరిగా ఉంటాయి. సెప్టెంబర్ నుంచి ఈ కొత్త కార్డుల పైనే రేషన్ సరుకులు పంపిణీ చేయనున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 1.46 కోట్ల రేషన్ కార్డులు ఉన్నాయి. గత మూడేళ్లుగా రేషన్ కార్డుల పంపిణీ జరగలేదు. అందుకే మే నెలలో దరఖాస్తులను స్వీకరించింది ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో ఈ కేవైసీ ప్రక్రియను సైతం పూర్తి చేసింది. తద్వారా 3.56 లక్షల మంది లబ్ధిదారులు మృతి చెందినట్లు గుర్తించి వారి పేర్లను కార్డుల నుంచి తొలగించింది. అయితే మూడేళ్ల అనంతరం రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభం అవుతుండడం.. స్మార్ట్ కార్డు తరహాలో అవి ఉండడం ప్రాధాన్యత సంతరించుకుంది.