YV Subbareddy: తిరుమల( Tirumala) లడ్డూ వివాదం కేసులో టీటీడీ మాజీ అధ్యక్షుడు, మాజీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి చుట్టూ ఉచ్చు బిగిస్తున్నట్లు తెలుస్తోంది. నిన్ననే ఆయన నివాసానికి వెళ్లిన ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు విచారణ చేపట్టారు. అనేక రకాల వివరాలు సేకరించారు. అయితే ఈ విచారణకు వైవి సుబ్బారెడ్డి సహకరించినట్లు తెలుస్తోంది. కొన్ని సంచలన అంశాలు సైతం బయటపడినట్లు సమాచారం. ఆయన పిఏగా భావిస్తున్న అప్పన్న ద్వారా జరిగిన నగదు లావాదేవీలపై సిట్ విచారణ జరిపింది. అయితే తనకు రూపాయి ముట్ట లేదని.. తాను ఏ తప్పు చేయలేదని.. తప్పు చేశానని నిరూపించి కఠిన చర్యలు తీసుకోవాలని వైవి సుబ్బారెడ్డి సవాల్ చేసినట్లు తెలుస్తోంది. అయితే తిరుమలలో వివాదం వెలుగులోకి వచ్చిన నాటి నుంచి వై వి సుబ్బారెడ్డి కోర్టులను ఆశ్రయించారు. అదే విషయంపై ఇప్పుడు దర్యాప్తు బృందం అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఈ కేసు విచారణలో భాగంగా న్యాయస్థానాలను ఎందుకు ఆశ్రయించారు? ఆందోళనకు ఎందుకు గురయ్యారు? అన్న కోణంలోనే సిట్ విచారణ కొనసాగినట్లు సమాచారం.
* వై వి సుబ్బారెడ్డి హయాంలోనే..
దాదాపు నాలుగు సంవత్సరాల పాటు టీటీడీ( Tirumala Tirupati Devasthanam) అధ్యక్షుడిగా కొనసాగారు వైవి సుబ్బారెడ్డి. ఈయన జగన్మోహన్ రెడ్డికి స్వయానా బాబాయ్. 2014 ఎన్నికల్లో ఒంగోలు ఎంపీగా గెలిచారు. 2019 ఎన్నికల్లో మాత్రం పోటీ చేయలేదు. వైయస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో వైవి సుబ్బారెడ్డి టీటీడీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. దాదాపు నాలుగేళ్ల పాటు ఆయన అధ్యక్షుడిగా కొనసాగారు. చివరి ఏడాది మాత్రం భూమన కరుణాకర్ రెడ్డి అధ్యక్షుడయ్యారు. అయితే తిరుమలలో వివాదానికి సంబంధించి తనకు ఏ పాపం తెలీదని కరుణాకర్ రెడ్డి ఏకంగా ప్రమాణం చేశారు. అదే సమయంలో వై వి సుబ్బారెడ్డి ఈ కేసులో అనేక రకాలుగా న్యాయస్థానాలను ఆశ్రయించారు. దీంతో అందరి అనుమానపు చూపులు ఆయనపై ప్రారంభం అయ్యాయి.
* అప్పన్న అరెస్టుతో..
కొద్దిరోజుల కిందట అప్పన్న అనే వ్యక్తి అరెస్టయ్యారు. ఆయన వైవి సుబ్బారెడ్డి కి( Subba Reddy) పిఏ తో పాటు బినామీ అని ప్రచారం సాగింది. అయితే లడ్డు తయారీకి సంబంధించి నెయ్యి సరఫరా చేసే సంస్థల నుంచి అప్పన్న భారీగా కమిషన్లు వసూలు చేశారని.. ఆ మొత్తాన్ని వైవి సుబ్బారెడ్డి కి చేరవేసేవారని ఆరోపణలు ఉన్నాయి. అప్పన్న అరెస్టు తర్వాతనే వైవి సుబ్బారెడ్డి పేరు ప్రముఖంగా వినిపించింది. అయితే అప్పన్న ఎవరో తనకు తెలియదని వైవి సుబ్బారెడ్డి దర్యాప్తు బృందం ఎదుట తేల్చి చెప్పినట్లు సమాచారం. మరోవైపు అప్పన్న టిడిపి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పరిశ్రమలో 25వేల జీతం తీసుకునే ఉద్యోగి అని వైసిపి నేతలు చెబుతున్నారు. అయితే తాను ఎటువంటి తప్పు చేయలేదని.. ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని సుబ్బారెడ్డి విచారణలో చెప్పినట్లు తెలుస్తోంది. వై వి సుబ్బారెడ్డి ఏ క్షణం అయినా అరెస్టు కావచ్చని పొలిటికల్ సర్కిల్లో ప్రచారం జరుగుతోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.