Singayya Death Case: వైఎస్ఆర్ కాంగ్రెస్( YSR Congress) అధినేత జగన్మోహన్ రెడ్డి పై కేసు నమోదయింది. సత్తెనపల్లి పర్యటనలో భాగంగా సింగయ్య అనే వైయస్సార్ కాంగ్రెస్ కార్యకర్త మృతి చెందారు. అయితే ఆయన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారని.. గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టిందని అంతా భావించారు. గుంటూరు ఎస్పీ సైతం ఇదే విషయాన్ని ప్రకటించారు. అయితే సింగయ్య జగన్ ప్రయాణిస్తున్న వాహనం కిందపడి చనిపోయాడని తాజాగా నిర్ధారణ అయింది. దీంతో ఆ వాహన డ్రైవర్ ఏ2 గా, జగన్మోహన్ రెడ్డి ఏ 2 గా కేసు నమోదయింది. మృతుడు సింగయ్య భార్య లూర్దూ మేరీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. తాజాగా వెలుగులోకి వచ్చిన వీడియో పూటేజీలో సింగయ్య జగన్ వాహనం కింద పడి మృతి చెందినట్లు నిర్ధారణ అయింది. దీంతో పోలీసులు ఈ కేసులో సెక్షన్లు మార్చారు.
పోలీసులు ఆదేశాలు ఇచ్చినా సత్తెనపల్లి( Sattenapalli ) నియోజకవర్గంలోని వైయస్సార్ కాంగ్రెస్ నేత విగ్రహ ఆవిష్కరణకు జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. గతంలో జగన్ పర్యటనలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు ఆంక్షలు విధించారు. పరిమిత సంఖ్యలో వాహనాలు మాత్రమే వెళ్లాలని సూచించారు. కానీ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ ని భారీగా వాహనాలు అనుసరించాయి. అయితే అదే రోజు సింగయ్య రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందాడు. జగన్ కాన్వాయ్ ఢీకొని మృతి చెందాడని అంతా భావించారు. ఇప్పుడు ఏకంగా జగన్మోహన్ రెడ్డి ప్రయాణిస్తున్న వాహనం ఢీ కొట్టిందని తేలింది. దీంతో వాహనం నడిపిన డ్రైవర్ రమణ రెడ్డి పై ఏ1 గా కేసు నమోదయింది. ఏ 2 గా జగన్మోహన్ రెడ్డి, ఏ 3 గా జగన్ వ్యక్తిగత కార్యదర్శి నాగేశ్వర్ రెడ్డి, a4 గా, వై వి సుబ్బారెడ్డి, ఏ5 గా పేర్ని నాని, ఏ 6 గా విడదల రజిని నీ చేర్చుతూ కేసు నమోదు చేశారు. గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ ధ్రువీకరించారు.
అరెస్టు తప్పదా
ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy ) తప్పకుండా అరెస్ట్ అవుతారని ప్రచారం నడుస్తోంది. ఈనెల 18న వైసీపీ నేత విగ్రహ ఆవిష్కరణకు రెంటపాల వెళ్లారు జగన్మోహన్ రెడ్డి. అయితే కాన్వాయ్ లోని 11 వాహనాలతో పాటు మూడు వాహనాలకు మాత్రమే పోలీసులు అనుమతి ఇచ్చారు. కానీ వీటిని పట్టించుకోకుండా తాడేపల్లి నుంచి 50 వాహనాల్లో జగన్మోహన్ రెడ్డి బయలుదేరారు. నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏటుకూరు బైపాస్ ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద సింగయ్యను జగన్ ప్రయాణిస్తున్న వాహనం ఢీకొట్టింది. అయితే స్థానిక వైసిపి కార్యకర్తలు కేకలు వేసిన పట్టించుకోలేదు. తర్వాత సింగయ్యను బయటకు తీసి రోడ్డు పక్కనే పడుకోబెట్టారు. పోలీసులు వచ్చి 108 లో ఆసుపత్రికి తరలించారు. అప్పటికే సింగయ్య మృతిచెందాడు. జగన్ వాహనం ఫార్చునర్ చక్రం కింద సింగయ్య పడిపోవడం, చక్రం అతనిపై ఎక్కుతున్నట్లుగా వీడియో ఆధారం లభించింది. దీంతో పోలీసులు సెక్షన్లు మార్చి కేసులు నమోదు చేశారు.
Also Read: Jagan Rappa Viral Dialogue: జగన్ ‘రప్ప.. రప్ప’ డైలాగ్.. నేషనల్ లెవల్ ట్రెండింగ్
గుంటూరు ఎస్పీ క్లారిటీ
మరోవైపు గుంటూరు( Guntur) ఎస్పీ ప్రకటనపై భిన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఆదివారం రాత్రి ఎస్పి విలేకరుల సమావేశం తో మాట్లాడిన సమయంలో కూడా కొన్ని రకాల సందేహాలు వ్యక్తం అయ్యాయి. ఘటన జరిగిన రోజు వేరే వాహనం ఢీకొన్నట్లు ఎలా చెప్పారని ఎస్పీని ప్రశ్నించారు విలేకరులు. ఆరోజు ఉన్న అంశాల ఆధారంగా చెప్పామని.. దర్యాప్తులో వచ్చే అంశాల ఆధారంగా వివరాలు వెల్లడైతే చెబుతామని ఆరోజే చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు గుంటూరు ఎస్పీ. మొత్తానికైతే జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగించినట్లు అయ్యింది. అయితే దీనిపై కొట్టి పారేస్తున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో భాగంగా ఆ ఫోటో అలా సెట్ చేశారని.. అదంతా అభూత కల్పన అని తేల్చి చెబుతున్నారు. దీనిపై సోషల్ మీడియా వేదికగా పెద్ద వార్ నడుస్తోంది.