Congress party : దేశవ్యాప్తంగా బలోపేతంపై కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టింది. ప్రస్తుతం ఇండియా కూటమికి పెద్దదిక్కుగా ఉంది కాంగ్రెస్ పార్టీ. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో.. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు మొండి చేయి చూపినట్లు ఆరోపణలు ఉన్నాయి. కేవలం బిజెపి, ఎన్డీఏ పాలిత రాష్ట్రాలకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించడంతో విపక్షాలు భగ్గుమంటున్నాయి. అధికార ఎన్డీఏ పై విరుచుకుపడుతున్నాయి. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్.. బడ్జెట్ ప్రవేశపెట్టిన నాటి నుంచి లోక్ సభ, రాజ్యసభల్లో ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. సమాజ్ వాది పార్టీ అధినేత, ఎంపీ అఖిలేష్ యాదవ్, తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన ఫైర్ బ్రాండ్ మహువా మొయిత్రా, శివసేన రాజ్యసభ సభ్యురాలు ప్రియాంక చతుర్వేది.. ఇలా ప్రతిపక్షాల ఉమ్మడి సంకీర్ణ కూటమి ఇండియా ఎంపీలు ఎన్డీఏ ప్రభుత్వ తీరుపై విరుచుకుపడుతున్నారు. ఇదే తీరును కొనసాగించాలని కాంగ్రెస్ పార్టీ డిసైడ్ అయ్యింది. మిగతా పార్టీలను సైతం తమతో కలుపుకెళ్లాలని భావిస్తోంది. అందులో భాగంగా వ్యూహం రూపొందిస్తోంది. బుధవారం కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సర్వసభ్య సమావేశం జరగనుంది. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఉదయం 11 గంటలకు ఈ భేటీ జరగనుంది. ప్రధానంగా వైసీపీ విషయంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. వైసీపీని ఇండియా కూటమిలో చేర్చుకోవాలా? వద్దా? అన్న విషయాలను సమగ్రంగా చర్చించి ఒక నిర్ణయానికి రానున్నట్లు సమాచారం.
* నాడు కాంగ్రెస్ ను బలహీనపరిచి..
వైయస్ రాజశేఖర్ రెడ్డి అకాల మరణంతో కాంగ్రెస్ పార్టీని విభేదించారు జగన్.తండ్రి వారసత్వంగా సీఎం పదవి కోసం పోటీపడ్డారు.కానీ కాంగ్రెస్ పార్టీ అంగీకరించలేదు. దీంతో ఆ పార్టీని విభేదించి వైసీపీని ఏర్పాటు చేశారు. అప్పటికే రాష్ట్ర విభజనతో ఆగ్రహంగా ఉన్న కాంగ్రెస్ నాయకులు వైసీపీలో చేరారు. ఒక విధంగా చెప్పాలంటే కాంగ్రెస్ బలాన్ని తన వైపు లాక్కోవడంలో జగన్ సక్సెస్ అయ్యారు. అప్పటినుంచి కాంగ్రెస్ కు విరోధిగానే ఉన్నారు. కాంగ్రెస్ బద్ధ విరోధి అయిన బిజెపితో స్నేహం చేశారు.
* మారిన పరిస్థితులతో..
అయితే ఇప్పుడు వైసీపీకి అనుకూలంగా రాజకీయాలు లేవు. ఇంతకాలం స్నేహ హస్తం అందించిన బిజెపి.. టిడిపి తో జతకట్టింది. టిడిపి తో పొత్తు పెట్టుకుని అధికారంలోకి రాగలిగింది. ఏపీలో టీడీపీ కూటమి, కేంద్రంలో బిజెపి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చాయి. కేంద్రంలో టిడిపి బలం కీలకంగా మారింది. ఇటువంటి తరుణంలో జగన్ సైతం పునరాలోచనలో పడ్డారు. ఎన్డీఏకు వ్యతిరేకంగా పావులు కదపాల్సిన అవసరం ఏర్పడింది. మొన్న ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద రాష్ట్రంలో క్షీణించిన శాంతి భద్రతలపై ధర్నా చేశారు జగన్. ఎన్డీఏ కు వ్యతిరేక పార్టీలన్నీ ధర్నాకు మద్దతు తెలిపాయి.ఇండియా కూటమిలోకి రావాలని ఆహ్వానించాయి.
* కూటమి పార్టీల ఒత్తిడి
అయితే ఆ ధర్నాకు ఇండియా కూటమికి నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ హాజరు కాలేదు. అయితే సహజంగానే కాంగ్రెస్ పార్టీపై ఒత్తిడి పెరుగుతుంది. వైసీపీని ఇండియా కూటమిలో చేర్చుకోవాలని అవి కోరినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్లమెంటరీ బోర్డు సమావేశం అవుతుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. తప్పకుండా దీనిపై కాంగ్రెస్ పార్టీ చర్చిస్తుందన్న ప్రచారం జరుగుతుంది. ఒకవేళ వైసీపీ విషయంలో కాంగ్రెస్ సానుకూల నిర్ణయం తీసుకుంటే.. ఏపీ రాజకీయాల్లో పెను మార్పులు సంభవించే అవకాశం ఉంది.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Should ycp be included in india alliance congress will take a decision tomorrow
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com