Shock to Kodali Nani: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీలో ఒక వెలుగు వెలిగారు మాజీ మంత్రి కొడాలి నాని. జగన్మోహన్ రెడ్డి పార్టీ ఏర్పాటు చేసినప్పుడే తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. అప్పటికే ఆయన రెండుసార్లు గుడివాడ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు తెలుగుదేశం పార్టీ నుంచి. వైసీపీలో చేరిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆయనకు ఎనలేని ప్రాధాన్యమిచ్చారు. మూడుసార్లు ఆ పార్టీ తరఫున పోటీ చేసి రెండుసార్లు గెలిచారు కొడాలి నాని. మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయారు. అదే సమయంలో ఆయన ఆరోగ్య పరిస్థితి సైతం దిగజారింది. దీంతో 2029 ఎన్నికల్లో కొడాలి నాని పోటీ చేస్తారా? లేదా? అనేది హాట్ టాపిక్ అవుతోంది. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆయన విషయంలో వేరే ఆలోచనతో ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది.
టిడిపి ద్వారా ఎంట్రీ..
తెలుగుదేశం పార్టీ( Telugu Desam Party) ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు కొడాలి నాని. 2004, 2009 ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. ఆ రెండు ఎన్నికల్లోను తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాలేదు. అయితే వైసిపి ఆవిర్భావ సమయంలో చంద్రబాబు నాయకత్వాన్ని విభేదించి టిడిపికి గుడ్ బై చెప్పారు కొడాలి నాని. వైసీపీలో చేరిన నాటి నుంచి చంద్రబాబుతో పాటు లోకేష్ పై వ్యక్తిగత దాడి చేస్తూ వచ్చారు. అయితే మొన్నటి ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. కొద్ది కాలానికే ఆయన యాక్టివ్ అవుతున్న తరుణంలో అనారోగ్యం వెంటాడింది. గత ఏడాదిగా ఆయన హైదరాబాద్కు మాత్రమే పరిమితమయ్యారు. గుడివాడలో సైతం పెద్దగా కనిపించడం లేదు. ఈ ఏడాది సంక్రాంతి వేడుకలకు సైతం దూరంగా ఉండటంతో ఇక కొడాలి నాని గుడివాడ వైపు చూసే అవకాశం లేదని ప్రచారం నడుస్తోంది.
పార్టీ కార్యక్రమాలు లేవు..
ప్రస్తుతం గుడివాడ( Gudivada ) నియోజకవర్గంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలు జరగడం లేదు. పార్టీ కార్యక్రమాలు నిర్వహించిన నాయకుడు లేరు. ఇటువంటి తరుణంలో వైయస్సార్ కాంగ్రెస్ హై కమాండ్ అక్కడ నాయకత్వం మార్పుపై సీరియస్ గా దృష్టి పెట్టినట్లు ప్రచారం నడుస్తోంది. కొడాలి నాని స్థానంలో ఒక ప్రముఖ తెలుగు చిత్ర నిర్మాతను తెరపైకి తెస్తున్నట్లు సమాచారం. అంగ బలంతో పాటు ఆర్థిక బలం, ఆపై కమ్మ సామాజిక వర్గం కావడంతో జగన్మోహన్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. త్వరలో గుడివాడ వైసీపీ ఇన్చార్జిగా ఆయన పేరు ప్రకటిస్తారని ప్రచారం నడుస్తోంది.
కీలక పదవి..
అయితే గత ఎన్నికల్లోనే కొడాలి నాని( Kodali Nani) కీలక ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని చెప్పారు. అయితే తన సోదరుడి కుమారుడిని రాజకీయ వారసుడిగా ప్రకటించారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఆలోచన వేరేలా ఉంది. కొడాలి నానిని గుడివాడ నుంచి తప్పించి.. పార్టీలో కీలక బాధ్యతలు కట్టబెట్టేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 2029 లో పార్టీ అధికారంలోకి వస్తే రాజ్యసభ కానీ.. ఎమ్మెల్సీ పదవి కానీ ఆయనకు కేటాయిస్తారని వైసీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.
